అగార్కర్‌కు మరో చాన్స్‌?

Ajit Agarkar Still In Line To Be Selector In Next Term - Sakshi

న్యూఢిల్లీ: భారత క్రికెట్‌ జట్టు సెలక్టర్‌గా ఎంపికయ్యే అవకాశాన్ని కోల్పోయిన మాజీ పేసర్‌ అజిత్‌ అగార్కర్‌కు మరో చాన్స్‌ ఉన్నట్లే కనబడుతోంది. మదన్‌లాల్, ఆర్పీ సింగ్, సులక్షణా నాయక్‌లతో కూడిన క్రికెట్‌ సలహా కమిటీ (సీఏసీ) సీనియర్‌ సెలక్షన్‌ కమిటీ చైర్మన్‌గా భారత మాజీ స్పిన్నర్‌ సునీల్‌ జోషి (సౌత్‌జోన్‌)ని ఎంపిక చేయడంతో అగార్కర్‌ చీఫ్‌ సెలక్టర్‌ అయ్యే అవకాశాన్ని కోల్పోయాడు. జోనల్‌ పద్ధతిని పాటించడంతో అగార్కర్ అసలు సెలక్టర్ల రేసులోనే లేకుండా పోయాడు.(ఎమ్మెస్కే వారసుడిగా సునీల్‌ జోషి)

రెండు ఖాళీల కోసం 44 మంది దరఖాస్తు చేసుకోగా... అందులో నుంచి వెంకటేశ్‌ ప్రసాద్, సునీల్‌ జోషి, లక్ష్మణ్‌ శివరామకృష్ణన్, హర్విందర్‌ సింగ్, రాజేశ్‌ చౌహాన్‌లను ఇంటర్వ్యూల కోసం ఖరారు చేసింది. జోనల్‌ ప్రాతిపదికన సెలక్టర్లను ఎంపిక చేయాలని సీఏసీ సభ్యులు నిర్ణయించుకోవడంతో అగార్కర్‌ను పరిగణనలోకి తీసుకోలేదు. పదవీ కాలం ముగిసిన సెలెక్టర్లలో గగన్‌ ఖోడా సెంట్రల్‌ జోన్‌కు చెందిన వాడు కావడంతో ఆ జోన్‌ నుంచి హర్విందర్‌ సింగ్‌ను... ఎమ్మెస్కే ప్రసాద్‌ది సౌత్‌ జోన్‌ కావడంతో వెంకటేశ్‌ ప్రసాద్, శివరామకృష్ణన్, సునీల్‌ జోషిలను తదుపరి దశకు ఎంపిక చేశారు. ఇక్కడ సునీల్‌ జోషి, హర్విందర్‌ సింగ్‌లను ఎంపిక చేసింది. ఈ క్రమంలోనే సునీల్‌ జోషి చీఫ్‌ సెలక్టర్‌గా ఎంపిక చేశారు. 

అగార్కర్‌కు మరో చాన్స్‌ ఎలా?
సెలక్షన్‌ కమిటీలో ప్రస్తుతం కొనసాగుతున్న జతిన్‌ పరంజపే (వెస్ట్‌ జోన్‌), దేవాంగ్‌ గాంధీ (ఈస్ట్‌ జోన్‌), శరణ్‌దీప్‌ సింగ్‌ (నార్త్‌ జోన్‌)ల పదవీ కాలం ఈ సెప్టెంబర్‌తో ముగియనుంది. దాంతో ప్రస్తుతం దరఖాస్తుకు చేసుకుని నిరాశకు గురైన అగార్కర్‌, నయాన్‌ మోంగియా, మణిందర్‌ సింగ్‌ తదితరులు మళ్లీ తిరిగి అప్లై చేసుకునే అవకాశం లేకుండానే రేసులో ఉండే అవకాశం ఉంది.  ప్రధానంగా జతిన్‌ పరంజపే ముంబైకు చెందిన వాడు కావడంతో అతని స్థానంలో అగార్కర్‌కు చాన్స్‌ దక్కే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. కాకపోతే దానికి మరో ఆరు నుంచి ఏడు నెలలు నిరీక్షించాల్సి ఉంటుంది. సెలక్టర్‌గా అగార్కర్‌ను ఎందుకు పరిగణలోకి తీసుకోలేదు అనే అంశంపై  బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ వివరణ ఇచ్చాడు.

‘భారత సీనియర్‌ క్రికెట్‌ జట్టుకు చీఫ్‌ సెలక్టర్‌ అయ్యే అవకాశాలు అగార్కర్‌కు ఉన్నాయి. సెలక్టర్ల పదవి కోసం దరఖాస్తు చేసుకున్న జాబితా ప్రకారం చూస్తే అతనే టాప్‌ ప్లేస్‌లో ఉన్నాడు. కానీ జోనల్‌ పద్ధతిని అనుసరించడంతో అగార్కర్‌ చాన్స్‌ మిస్సయ్యాడు. అదే సమయంలో ముంబై నుంచి పరంజపే ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. దాంతో అగార్కర్‌కు సెలక్షన్‌ కమిటీలో చోటు దక్కలేదు. ప్రస్తుతం ఉన్న సెలక్టర్లలో ముగ్గురు మరో ఆరు-ఏడు నెలల్లో వీడ్కోలు చెప్పనున్నారు. అప్పుడు అగార్కర్‌ను  కచ్చితంగా పరిగణలోకి తీసుకుంటాం’ అని గంగూలీ తెలిపాడు.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top