ఫిఫా ప్రపంచకప్‌: పీలే తర్వాత ఎంబాపెనే!

After Mbappe Matches Another Pele Record - Sakshi

మాస్కో : ఫ్రాన్స్‌ యువ కెరటం కైలిన్‌ ఎంబాపె అరుదైన రికార్డును సొం‍తం చేసుకున్నాడు. ఆదివారం క్రోయేషియాతో జరిగిన ఫిఫా ప్రపంచకప్‌ ఫైనల్లో ఈ స్టార్‌ ఆటగాడు 65వ నిమిషంలో గోల్‌ సాధించి బ్రెజిల్‌ దిగ్గజం పీలే (1958లో) తర్వాత అతి పిన్న వయసులో వరల్డ్‌ కప్‌ ఫైనల్లో గోల్‌ కొట్టిన ఆటగాడిగా గుర్తింపు పొందాడు. ఈ మ్యాచ్‌లో ఫ్రాన్స్‌ 4-2తో నెగ్గి 20 ఏళ్ల తర్వాత రెండోసారి జగజ్జేతగా అవతరించిన విషయం తెలిసిందే.

ఇక అంతకముందు నాకౌట్‌ సమరంలోను గోల్‌ సాధించిన ఎంబాపే ఇదే..పీలే రికార్డును సమం చేశాడు. మ్యాచ్‌ అనంతరం ‘మైలవ్‌’ అనే క్యాప్షన్‌తో ట్రోఫీని ముద్దాడుతూ.. ఫోజిచ్చిన ఫొటోను ఎంబాపె ట్వీట్‌ చేశాడు. అయితే ఈ ట్వీట్‌కు పీలేనే తొలుత స్పందించడం విశేషం. ‘కైలిన్‌ నా రికార్డును సమం చేశాడు.. ఇక నా బూట్లకున్న దుమ్ముదులిపి బరిలోకి దిగాల్సిందే’ అని ట్వీట్‌ చేశాడు. అంతకు ముందు ‘వెలకమ్‌ టూ ది క్లబ్‌’  అని పేర్కొన్నాడు. ప్రస్తుతం ఈ ట్వీట్స్‌ వైరల్‌ అయ్యాయి.

క్రొయేషియా ఆటగాడు మాన్‌జుకిచ్‌ (18వ నిమిషం) సెల్ఫ్‌ గోల్‌తో ఫ్రాన్స్‌ ఖాతా తెరవగా... గ్రీజ్‌మన్‌ (38వ ని.లో), పోగ్బా (59వ ని.లో), ఎంబాపె (65వ ని.లో) తమ జట్టు తరఫున గోల్స్‌  కొట్టారు. క్రొయేషియా తరఫున పెరిసిచ్‌ (28వ ని.లో), మాన్‌జుకిచ్‌ (69వ ని.లో) గోల్స్‌ సాధించారు. తొలి అర్ధభాగం ముగిసేసరికి ఫ్రాన్స్‌ 2–1తో ఆధిక్యంలో నిలవగా... ఆ తర్వాత మరో రెండు గోల్స్‌తో ఫ్రాన్స్‌ తమ ప్రత్యర్థికి అవకాశం లేకుండా చేసింది. దీంతో ఫ్రాన్స్‌ సునాయస విజయం సాధించింది.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top