పాక్‌ను గెలిపించిన మాలిక్‌

Afghanistan in big game against Pakistan - Sakshi

పోరాడి ఓడిన అఫ్గానిస్తాన్‌

అబుదాబి: వరుస విజయాలతో ఆసియా కప్‌ గ్రూప్‌ ‘బి’లో టాపర్‌గా నిలిచిన అఫ్గానిస్తాన్‌ శుక్రవారం జరిగిన సూపర్‌–4 మ్యాచ్‌లో పాకిస్తాన్‌ ఎదుట నిలువలేకపోయింది. తొలుత బ్యాటింగ్‌లో సత్తా చాటినా... బౌలింగ్‌లో అనుభవరాహిత్యంతో ఓటమి పాలైంది. 258 పరుగుల లక్ష్యాన్ని పాకిస్తాన్‌ 49.3 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి అధిగమించింది. షోయబ్‌ మాలిక్‌ (43 బంతుల్లో 51 నాటౌట్‌; 3 ఫోర్లు, సిక్స్‌) చివరి వరకు క్రీజులో నిలిచి పాకిస్తాన్‌ను విజయతీరాలకు చేర్చాడు. అంతకుముందు ఇమాముల్‌ హఖ్‌ (104 బంతుల్లో 80; 5 ఫోర్లు, 1 సిక్స్‌), బాబర్‌ ఆజమ్‌ (94 బంతుల్లో 66; 4 ఫోర్లు, 1 సిక్స్‌) అర్ధశతకాలతో ఆకట్టుకున్నారు. వీరిద్దరు రెండో వికెట్‌కు 154 పరుగులు జోడించారు. అయితే వీరిద్దరు ఔటయ్యాక పాక్‌ కష్టాల్లో పడినట్లు కనిపించినా... ఆఖర్లో మాలిక్‌ పాక్‌ను గట్టెక్కించాడు. అఫ్గానిస్తాన్‌ బౌలర్లలో ముజీబ్‌ (2/33), రషీద్‌ ఖాన్‌ (3/46) ఆకట్టుకున్నారు. అంతకుముందు టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న అఫ్గాన్‌ 50 ఓవర్లలో 6 వికెట్లకు 257 పరుగులు చేసింది. హష్మతుల్లా షాహిదీ (118 బంతుల్లో 97 నాటౌట్‌; 7 ఫోర్లు) అద్భుత పోరాటానికి కెప్టెన్‌ అస్గర్‌ అఫ్గాన్‌ (56 బంతుల్లో 67; 2 ఫోర్లు, 5 సిక్స్‌లు) మెరుపులు తోడవడంతో మంచి స్కోరు చేసింది. పాక్‌ బౌలర్లలో మొహమ్మద్‌ నవాజ్‌ 3, అరంగేట్ర లెఫ్టార్మ్‌ పేసర్‌ షాహీన్‌ ఆఫ్రిది 2 వికెట్లు పడగొట్టారు.  

అదరగొట్టిన అస్గర్, హష్మతుల్లా

ఆసియాలోనే అత్యుత్తమ బౌలింగ్‌ వనరులు ఉన్న పాకిస్తాన్‌... మ్యాచ్‌ ప్రారంభంలో తమ స్థాయికి తగ్గట్లే విజృంభించింది. లెఫ్టార్మ్‌ స్పిన్నర్‌ మొహమ్మద్‌ నవాజ్‌ వరుస ఓవర్లలో ఓపెనర్లు షహజాద్‌ (20), ఎహ్‌సానుల్లా (10)లను పెవిలియన్‌ పంపాడు. ఆ తర్వాత రహమత్‌ షా (36; 2 ఫోర్లు)తో కలిసి హష్మతుల్లా ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు. ఈ జోడీ మూడో వికెట్‌కు 63 పరుగులు జోడించాక నవాజ్‌ బౌలింగ్‌లోనే రహమత్‌ షా వెనుదిరిగాడు. ఆ తర్వాతే అసలు ఆట ప్రారంభమైంది హష్మతుల్లాతో జత కలిసిన కెప్టెన్‌ అస్గర్‌ ముందు ఆచితూచి ఆడినా... కుదురుకున్నాక భారీ సిక్సర్లతో హోరెత్తించాడు. వీరిద్దరు నాలుగో వికెట్‌కు 99 బంతుల్లో 94 పరుగులు జతచేశారు. ఆ తర్వాత ఓ వైపు వికెట్లు పడుతున్నా మరోవైపు హష్మతుల్లా చివరి వరకు నిలిచి జట్టుకు మంచి స్కోరు అందించాడు. చివరి 10 ఓవర్లలో అఫ్గాన్‌ 87 పరుగులు సాధించింది.

ఆడుతూ పాడుతూ...

పాకిస్తాన్‌ ఇన్నింగ్స్‌ ఆరంభంలోనే భారీ షాక్‌కు గురైంది. ఖాతా తెరవకుండానే ఓపెనర్‌ ఫఖర్‌ జమాన్‌ (0) వికెట్‌ కోల్పోయింది. ఆ తర్వాత మరో ఓపెనర్‌ ఇమామ్, బాబర్‌ ఆజమ్‌ నిలకడగా ఆడుతూ ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించారు. వీరిద్దరు రెండో వికెట్‌కు 154 పరుగులు జోడించి గెలుపు బాట పరిచారు. స్కోరు వేగం పెంచే క్రమంలో ఇమామ్‌ రనౌట్‌గా వెనుదిరగ్గా... బాబర్‌ను రషీద్‌ పెవిలియన్‌ బాట పట్టించాడు. ఆ తర్వాత సోహైల్‌ (13), సర్ఫరాజ్‌ (8), నవాజ్‌ (10) ఔటైనా... మరోవైపు చివరిదాకా పోరాడిన షోయబ్‌ మాలిక్‌ జట్టుకు విజయాన్నందించాడు. ఆదివారం జరిగే సూపర్‌–4 మరో మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌తో అఫ్గాన్‌ ఆడుతుంది.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top