జ్యోతిష్యంతో ‘పెళ్లి’కి ఎసరు! | marriage stopped because of astrology | Sakshi
Sakshi News home page

జ్యోతిష్యంతో ‘పెళ్లి’కి ఎసరు!

Feb 20 2018 5:19 PM | Updated on Feb 20 2018 5:19 PM

marriage stopped because of astrology - Sakshi

 జ్యోతిష్యుడి ఇంటి ఎదుట గుమిగూడిన బాధితులు

సిద్దిపేటటౌన్‌ : తప్పుడు జ్యోతిష్యం చెప్పడంతో ఓ పెళ్లి ఆగిపోయింది. అమ్మాయిని పెళ్లి చేసుకుంటే అబ్బాయి కుటుంబంలోని ఒకరికి ప్రాణ హాని ఉందంటూ జ్యోతిష్యుడు చెప్పడంతో అబ్బాయి తరఫు వాళ్లు పెళ్లి సంబంధం వదులుకున్నారు. ఆ మాటే అబ్బాయి తరఫు వాళ్లు అమ్మాయి వాళ్లకు చెప్పడంతో కుటుంబ సభ్యులంతా కలిసి ఆ జ్యోతిష్యుడి ఇంటి ఎదుట ఆందోళనకు దిగారు. మూఢ నమ్మకంతో పెళ్లి ఆగిన ఘటన సోమవారం సిద్దిపేటలోని శ్రీనివాసనగర్‌లో చోటుచేసుకుంది. శ్రీనివాస నగర్‌లో రాజు పంతులు అనే వ్యక్తి జ్యోతిష్యాలయం నిర్వహిస్తున్నాడు. అదే కాలనీలోని ఓ కుటుంబం తమ కొడుకుకు పెళ్లి చేయాలనుకుంటున్నామని తాము చూసిన అమ్మాయి జాతకం చూడమని ఆ జ్యోతిష్యునికి చూపించారు. దాన్ని చూసిన పంతులు ఇద్దరికి   జాతకాలు కలవడం లేదని, ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే అబ్బాయి ఇంట్లో ఒకరికి ప్రాణ హాని ఉందని ఖంగు తినే విషయం చెప్పాడు. ఆ పంతులు చెప్పిన మాట నమ్మిన వారు అమ్మాయి వాళ్లకు అదే విషయాన్ని చెప్పి పెళ్లి ఆలోచన మానుకోవాలని చెప్పారు.

అంతకుముందే కట్నకానుకల విషయం మాట్లాడుకొని ఈ నెల 22న నిశ్చితార్థం చేసుకోవడానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. ఇంతలోనే జాతకాల వ్యవహారం అమ్మాయి తరఫువాళ్లను ఆందోళనలో పడేసింది. అమ్మాయి వాళ్లు ఆదివారం వచ్చి జ్యోతిష్యున్ని సంపద్రించడంతో మీ అమ్మాయికి జన్మలో పెళ్లి కాదని చెప్పాడని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. జాతకంలో దోషం ఉందని పేరు మార్చుకొని పెళ్లి చేసుకుంటే సరిపోతుందని చెప్పినట్టు తెలిపారు. నాలుగు నెలల నుంచి కలిసి మెలిసి తిరిగిన అమ్మాయి, అబ్బాయి రాజు పంతులు చెప్పిన మాటలతో పెళ్లి చేసుకోలేకపోతున్నారని, దీనంతటికి పంతులే కారణమని అతడి బంధువులు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో తన మీదకు దాడికి వచ్చారని రాజు పంతులు పోలీసులకు ఫోన్‌ చేసి రక్షణ కోరడంతో పోలీసులు అతడిని, అబ్బాయిని స్టేషన్‌కు తీసుకెళ్లారు. అనంతరం అమ్మాయి, అబ్బాయి తరఫు వాళ్లు మాట్లాడుకొని సయోధ్య కుదుర్చుకున్నారు. పెళ్లి కారణంగా అమ్మాయివాళ్లకైన డబ్బులు ఇవ్వడానికి అబ్బాయి వాళ్లు  అంగీకారం తెలపడంతో ఎలాంటి కేసు నమోదు కాలేదు. 

మమ్మల్ని ఆగం చేసిండ్రు..
పెళ్లికి అన్ని ఏర్పాట్లు చేసుకున్న టైంల శనివారం రాత్రి అబ్బాయి వాళ్లు ఫోన్‌ చేసి మా అమ్మాయిని చేసుకుంటే వారి కుటుంబంలోని ఒకరికి ప్రాణ హాని ఉందని చెప్పిండ్రు. పెళ్లి క్యాన్సల్‌ చేస్తున్నట్టు చెప్పిండ్రు. ఏం చేయాల్నో మాకు ఏం అర్థం కావడం లేదు. మమ్మల్ని ఆగం చేసిండ్రు. గుట్టుగా బతికే మమ్మల్ని రోడ్డు మీదకు గుంజిండ్రు.. 
–అమ్మాయి తల్లి

పెళ్లి యోగం లేదన్నాడు
ముందుగా మేం చూపించిన పంతులు జాతకం బాగానే ఉందన్నాడు. రాజు పంతులు మా అమ్మాయికి జన్మలో పెళ్లి కాదన్నాడు. పెళ్లి యోగం లేదన్నాడు. ఒక వేళ పెళ్లి అయితే నా తల నరుక్కుంటా అని చెప్పి.. ఇంకా ఎవరినైనా పండితులను అడిగి తెలుసుకొని నాకు ఫోన్‌ చేయమని తన నంబర్‌ నాకిచ్చాడు. రాజు పంతులు వల్లనే మా బిడ్డ పెళ్లి ఆగిపోయింది. 
– అమ్మాయి తండ్రి

పేరు మార్చుకొని పెళ్లి చేసుకోమన్నా..
నా దగ్గరకు ముందుగా ఒక తప్పుడు డేట్‌ తీసుకొని వచ్చారు. దాని ప్రకారం చూసి చెప్పాను. మళ్లీ ఇంకో డేట్‌ తీసుకొని వచ్చారు. దాని ప్రకారం చూస్తే జాతకంలో కొంచెం దోషం ఉందని, పేరు మార్చుకొని పెళ్లి చేసుకోమని చెప్పాను. అదే జాతకం తీసుకొని వేరే పంతులు దగ్గరకు వెళ్లినా నేను చెప్పిందే చెప్తాడు. నేను తప్పుడు జాతకం చెప్పలేదు.
–రాజు పంతులు, జ్యోతిష్యుడు 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement