వైఎస్సార్‌సీపీకి పూర్వవైభవం వస్తుంది..   

YSRCP Will Reinforce In Khammam - Sakshi

 నాయకులు, కార్యకర్తల కష్టాన్ని రాష్ట్ర పార్టీ గుర్తిస్తుంది 

ఊపిరున్నంతకాలం జననేత నాయకత్వంలో పనిచేస్తా 

వైఎస్‌.జగన్‌ విజయోత్సవ సమావేశంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు కొల్లు వెంకటరెడ్డి  

సాక్షి, ఖమ్మం: ఉభయ జిల్లాల్లో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి పూర్వవైభవం వస్తుందని, పార్టీ అభివృద్ధికి, ఎదుగుదలకు నాయకులు, కార్యకర్తలు ఐక్యంగా పని చేయాలని ఖమ్మం, భద్రాద్రికొత్తగూడెం జిల్లాల అధ్యక్షులు లక్కినేని సుధీర్‌బాబు, కొల్లు వెంకటరెడ్డి పిలుపునిచ్చారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ జాతీయ అధ్యక్షుడు వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి అయిన సందర్భంగా ఆదివారం ఖమ్మం నగరంలోని ఐఎంఏ హాల్‌లో విజయోత్సవ సమావేశం ఏర్పాటు చేశారు.

ఈ సమావేశంలో ఖమ్మం, భద్రాద్రికొత్తగూడెం జిల్లాల్లోని పట్టణ, మండల అధ్యక్ష, కార్యదర్శులు, పార్టీ అనుబంధ సంఘాల బాధ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పార్టీ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు లక్కినేని సుధీర్‌బాబు అధ్యక్షతన నిర్వహించిన సభలో తొలుత దివంగత వైఎస్‌.రాజశేఖర్‌రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం వైఎస్‌.జగన్‌ విజయోత్సవ వేడుకల్లో భాగంగా పార్టీ ఉమ్మడి జిల్లాల అధ్యక్షులు, రాష్ట్ర, జిల్లా పార్టీ బాధ్యులు కేక్‌ కట్‌ చేసి అందరికీ పంచిపెట్టారు.

ఈ సందర్భంగా..  కొల్లు వెంకటరెడ్డి మాట్లాడుతూ..2014 ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు ఎన్నికల్లో పార్టీ నాయకులను గెలిపిస్తే గెలిచాక పార్టీని వీడారని, కానీ ఓట్లు వేసిన కార్యకర్తలు మాత్రం పార్టీనే అంటిపెట్టుకొని ఉన్నారని, వారి తెగువ గొప్పదని అన్నారు. జిల్లాలో ఇతర పార్టీల నాయకుల బెదిరింపులకు, దాడులకు భయపడేది లేదని, ఎదైనా ఉంటే రాజకీయంగా ఎదుర్కోవాలని అన్నారు. పార్టీ అంటే వైఎస్సార్‌  కుటుంబం అని, ప్రతి కార్యకర్తా కుటుంబంలోని సభ్యులేనని తెలిపారు. ప్రతి ఒక్కరూ మనస్పర్థలు లేకుండా పార్టీ బలోపేతానికి పని చేయాలని సూచించారు. త్వరలోనే రాష్ట్ర నాయకత్వంతో చర్చించి పార్టీ జాతీయ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్‌ సీఎం వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డిని కలిసేందుకు జిల్లా నుంచి తరలివెళ్లనున్నట్లు తెలిపారు.  

పార్టీ అభివృద్ధి కోసమే పనిచేశా.. 
వైఎస్సార్‌ సీపీ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు లక్కినేని సుధీర్‌బాబు మాట్లాడుతూ తాను పార్టీలో చేరినప్పటి నుంచి పార్టీ అభివృద్ధి కోసమే పని చేశానని అన్నారు. మహానేత వైఎస్సార్‌ అభిమానిగా, జననేత వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వంలో పని చేయడం ఆనందంగా ఉందని చెప్పారు. ఉమ్మడి జిల్లాలో పార్టీలో ఉన్న నాయకులు, కార్యకర్తలు సీనియర్లుగా ఉండి తనకంటే ముందు నుంచి పార్టీ కోసం పని చేస్తున్నారని, వారందరినీ సమన్వయం చేసుకుంటూ రాష్ట్ర అగ్రనాయకత్వం సూచనలు పాటిస్తూ వస్తున్నట్లు తెలిపారు. నీతి, నిజాయతీ, విశ్వసనీయత, కష్టడపే తత్వమే పార్టీ జాతీయ అధ్యక్షుడు వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డిని ఈ రోజు ఈ స్థాయికి చేర్చాయని, ఆయన అడుగుజాడల్లో ఊపిరున్నంతకాలం పనిచేస్తానని తెలిపారు.

తెలంగాణాలో గతంలో, ఇటీవల జరిగిన ఎన్నికల్లో పార్టీ పోటీ చేయకపోవడం పట్ల నాయకులు, కార్యకర్తలు కొంత నైరాశ్యంలో ఉన్నారని, అధినేత జగనన్న, పార్టీ రాష్ట్ర నాయకత్వం సూచనల మేరకు ఇక్కడ పార్టీ పని చేస్తుందని అన్నారు. ఎంతమంది పార్టీలు మారినా వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు, క్యాడర్‌ మాత్రం పార్టీలు మారలేదని, అధికారం, పదవులు లేకపోయినా వైఎస్సార్‌ కుటుంబాన్ని, పార్టీని నమ్ముకుని ఉన్న కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకులు, కార్యకర్తలు పార్టీలు మారడం లేదని ఇతర పార్టీలు విధ్వంసాలకు దిగాయని, స్వయాన భద్రాద్రి జిల్లా అధ్యక్షుడి ఆస్తులను కొందరు ధ్వంసం చేశారని అన్నారు. నాయకులకు, కార్యకర్తలకు పార్టీ అండగా ఉంటుందన్నారు.

కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శులు వేమిరెడ్డి రోశిరెడ్డి, నాగిరెడ్డి, జల్లేపల్లి సైదులు, ఖమ్మం జిల్లా ఎస్టీ సెల్‌ అధ్యక్షుడు రూప్లానాయక్, జిల్లా ప్రధాన కార్యదర్శులు రాంబాబు రెడ్డి, ఆలస్యం రవి, గాదె వీరారెడ్డి, షేక్‌ మస్తాన్‌సాబ్, బాలశౌరి, నాగవరపు రాములు, జిల్లా మహిళా కార్యదర్శులు గోళ్లమూడి శ్రీలక్ష్మి, గుడవర్తి స్వరూపరాణి, యాకాలక్ష్మి, తోటకూర ప్రభావతి, ఆయా మండలాల అధ్యక్షులు మల్లారెడ్డి, వీరారెడ్డి, ఉమామహేశ్వరరెడ్డి, వైవీడీ.రెడ్డి, తాళ్లూరి రాంబాబు, హన్మంతరావు, అశోక, పసుపులేటి సైదులు, నర్సింహారావు, నాగిరెడ్డి, యువజన నాయకులు మురళి, జిల్లా యుజవన సంఘం బాధ్యులు నిఖిల్‌రెడ్డి బొబ్బ, మందపాటి దయాకర్‌రెడ్డి, నాయకులు గండ్రా నాగేందర్‌రెడ్డి, బండి నాగరాజు, వెంకటకిరణ్‌రెడ్డి, గోపీచంద్, ఎస్టీసెల్‌ నగర కార్యదర్శి వీరునాయక్, గొట్టిపర్తి గోపి, రావూరి పిచ్చయ్య, లఘుపతినాయక్, మాళోతు ప్రసాద్, కుమార్‌ నాయక్‌ తదితరులు పాల్గొన్నారు.

జగన్‌ అన్నతో కొత్త ఆశలు..: మందడపు వెంకటరామిరెడ్డి 
పార్టీ రాష్ట్ర కార్యదర్శి మందడపు వెంకటరామిరెడ్డి మాట్లాడుతూ..ఆంధ్ర రాష్ట్రంలో వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా అధికారంలోకి రావడంతో ఇక్కడ మనవద్దా ఆశలు పెరిగాయని తెలిపారు. పార్టీ నాయకులకు, కార్యకర్తలకు చాలా ధైర్యం వచ్చిందని, భవిష్యత్‌ బాగుంటుందని తెలిపారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top