
సాక్షి, అమరావతి : శాసనసభలో మెటల్ లేని అంశాలు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలకు మెంటల్ ఎక్కిస్తున్నారని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి విమర్శించారు. అసెంబ్లీ సమావేశాల్లో ఇప్పటివరకూ ప్రజా సమస్యలు, రైతుల సమస్యలపై చర్చ జరగలేదని అన్నారు.
మీడియా చంద్రబాబు ప్రసంగాలను ఎక్కువగా ప్రసారం చేయకపోవడం వల్ల ఆయన శాసనసభలో డబ్బాలు కొట్టుకుంటున్నారని మండిపడ్డారు. సొంత ప్రయోజనాలకు అసెంబ్లీని వాడుకోవడం రాజ్యాంగ విరుద్ధమని అన్నారు. తాజాగా అసెంబ్లీ సమావేశాలను పొడిగించారని, రాజకీయ ప్రయోజనాల కోసమే ప్రభుత్వం ఇలా చేస్తోందని ఆరోపించారు.
ఎన్నికల మేనిఫెస్టోలోని హామీల అమలులో చంద్రబాబు విఫలమయ్యారని అన్నారు. ఎన్నికల సమయంలో టీడీపీ ఇచ్చిన హామీల తాలూకూ ఏ అంశం కూడా దొరక్కుండా చేశారని మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్ ఆఖరి బడ్జెట్‌లోనైనా అందరికీ న్యాయం జరగుతుందని భావిస్తే.. దాన్ని నీరుగార్చరన్నారు. ప్రత్యేక హోదా కోసం వైఎస్‌ఆర్ సీపీ ఎంపీలతో పాటు టీడీపీ ఎంపీలు కూడా రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.