బాబూ.. నీకెందుకు ఇంత పైశాచిక ఆనందం?

YSRCP MLA Gadikota Srikanth Reddy Slams Chandrababu In Hyderabad - Sakshi

హైదరాబాద్‌: ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు వైఎస్సార్‌ జిల్లాలో అధర్మ పోరాట సభ నిర్వహించారని రాయచోటి వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌ రెడ్డి ఎద్దేవా చేశారు. హైదరాబాద్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో శ్రీకాంత్‌ రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ.. పక్కనున్న ఆరు జిల్లాల నుంచి ఆర్టీసీ బస్సులు పెట్టి బలవంతంగా జనాన్ని కడపకు తరలించారని ఆరోపించారు. ప్రతిపక్ష నేత సొంత జిల్లాలో ఇష్టమొచ్చినట్లు జగన్‌పై మాట్లాడించారని మండిపడ్డారు. ‘చంద్రబాబూ నీకు ఇంత పైశాచిక ఆనందం ఎందుకు’ అని సూటిగా ప్రశ్నించారు. చంద్రబాబు నాయుడికి తెలిసిందల్లా అధర్మం, అన్యాయం మాత్రమేనని దుయ్యబట్టారు.

కేవలం జగన్‌ని టార్గెట్‌ చేసుకునే సభ జరిగిందని, జగన్‌పై టీడీపీ నేతలు ఇష్టానుసారంగా, అసభ్యంగా మాట్లాడారని చెప్పారు. వైఎస్సార్‌ జిల్లాలో కరవుతో రైతులు ఇబ్బందులు పడుతుంటే ఒక్క మాట మాట్లాడలేదని తప్పుబట్టారు. చంద్రబాబు కేంద్రం ఏం చెబితే అదే నిజం అని చంకలు గుద్దుకుంది నిజం కాదా అని సూటిగా అడిగారు. అప్పుడే ఎందుకు నోరు మెదపలేదని సూటిగా ప్రశ్నించారు. నాలుగేళ్లు ఎందుకు నోరు మూసుకుని కూర్చున్నావని ప్రశ్న లేవనెత్తారు. రాజకీయాలు మాట్లాడటానికే సభ నిర్వహించారని విమర్శించారు. కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీని తిట్టిన నోటితోనే పొగుడుతావ్‌.. మోదీని పొగిడిన నోటితోనే తిడుతున్నావ్‌.. ఎన్నిసార్లు యూటర్న్‌ తీసుకుంటావని ధ్వజమెత్తారు.

చంద్రబాబు నీ హయాంలో రాయలసీమ ప్రాజెక్టులకు ఎంత ఖర్చు పెట్టావో శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. టీడీపీ ఎంపీ జేసీ దివాకర్‌ రెడ్డిని రాయలసీమ ప్రజలందరూ బహిష్కరించాలని కోరారు. కడప స్టీల్‌ ప్లాంట్‌ గురించి చంద్రబాబుకు అవగాహన ఉందా అని సూటిగా ప్రశ్నించారు. చంద్రబాబు ఎలాగూ వచ్చేసారి సీఎం కాలేరు కాబట్టి ఇలాంటి డ్రామాలు ఆడుతున్నారని విమర్శించారు. చంద్రబాబుకు రాయలసీమ పేరెత్తే అర్హత లేదని, కడప ప్రజల్ని రౌడీలు, గూండాలు అని సంబోధించిన సీఎం ఎలా కడప జిల్లాకు వస్తారని సూటిగా ప్రశ్నించారు. చంద్రబాబు ఏమైనా చేయగల సమర్ధుడని వ్యాఖ్యానించారు. వైఎస్‌ జగన్‌పై హత్యాయత్నం చేసిన నిందితుడు శ్రీనివాస్‌కు నార్కో అనాలసిస్‌ పరీక్ష చేస్తే నిజాలు వెల్లడవుతాయని అన్నారు.

రైల్వే కోడూరు ఎమ్మెల్యే కొరుముట్ల శ్రీనివాసులు మాట్లాడుతూ.. చంద్రబాబు ధర్మపోరాటం పేరుతో సభ పెట్టి జగన్‌ని తిట్టడమే లక్ష్యంగా పెట్టుకున్నారని ఆరోపించారు. ప్రజల్లో కనీస స్పందన లేదని, జిల్లా ప్రజలు సంస్కారవంతులు కాబట్టి ఎవరూ చంద్రబాబు సభలో చప్పట్లు కొట్టలేదని వివరించారు. చంద్రబాబు డిక్షనరీలో ధర్మం ఎక్కడా లేదు.. కేవలం వెన్నుపోటు, అధర్మం మాత్రమే ఉన్నాయని వ్యాఖ్యానించారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top