ఆత్మకూరు గౌతమ్‌రెడ్డిదే..

YSRCP MLA Candidate Mekapati Gautam Reddy Won Atmakuru Seat In PSR Nellore - Sakshi

సాక్షి, ఆత్మకూరు: మేకపాటి గౌతమ్‌రెడ్డి ఆత్మకూరు నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఘన విజయం సాధించారు. వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆశీస్సులతో ఆ పార్టీ  సిటింగ్‌ అభ్యర్థిగా బరిలోకి దిగిన గౌతమ్‌రెడ్డి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి బొల్లినేని కృష్ణయ్యపై 22,963 మెజార్టీతో గెలుపొందారు. గురువారం సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలవడ్డాయి. నెల్లూరులోని డీకేడబ్ల్యూ కళాశాలలో కౌంటింగ్‌ జరిగింది. ఓట్ల లెక్కింపులో తొలి రౌండ్‌ నుంచి వైఎస్సార్‌సీపీ ఆధిక్యత ప్రదర్శిస్తూనే వచ్చింది. ప్రతి రౌండ్‌కు పెరుగుతున్న మెజార్టీని చూసి తెలుగు తమ్ముళ్లు బెంబేలెత్తారు.

మొదటి నాలుగు రౌండ్లు పూర్తయ్యాక టీడీపీ నాయకులు ఓటమి తప్పదని నిర్ణయానికి వచ్చారు. టీడీపీ వర్గాలు తాము తప్పనిసరిగా గెలుస్తామని చెప్పిన మండలాల్లోనూ వైఎస్సార్‌సీపీ  స్పష్టమైన ఆధిక్యతను ప్రదర్శించింది. తొలి నుంచి ఊహించినట్లుగానే మర్రిపాడు, అనంతసాగరం మండలాలు, ఆత్మకూరు పట్టణంలో వైఎస్సార్‌సీపీకి మంచి మెజార్టీ లభించింది. టీడీపీ అభ్యర్థికి చెందిన సొంత మండలమైన చేజర్లలోనూ వారు ఆశించిన స్థాయిలో మెజార్టీ రాకపోవడం గమనార్హం. ఆత్మకూరు రూరల్‌ మండలంలో టీడీపీ వర్గీయులు మెజార్టీ వస్తుందని ఆర్భాటంగా ప్రకటన చేసినా వైఎస్సార్‌సీపీకే 700 ఓట్లకు పైగా మెజార్టీ రావడం విశేషం. ఇదే క్రమంలో ఏఎస్‌పేట, సంగం మండలాల్లోనూ తెలుగుదేశాన్ని తోసిరాజని ఓటర్లు వైఎస్సార్‌సీపీకే మద్దతుగా నిలిచారు. చంద్రబాబు ఎన్ని గిమ్మిక్కులు చేసినా ఓటర్లు పట్టించుకోలేదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

ఎన్నికల కౌంటింగ్‌ ఫలితాలను పరిశీలిస్తే ఆత్మకూరు నియోజకవర్గంలోని 277 బూత్‌ల్లో జరిగిన అన్ని రౌండ్లలో వైఎస్సార్‌సీపీ మెజార్టీ సాధించగా కేవలం మూడు రౌండ్లలో మాత్రమే టీడీపీ స్వల్ప ఆధిక్యత కనబరిచింది. గౌతమ్‌రెడ్డి ఘన విజయం సాధించడంతో పార్టీ శ్రేణుల్లో సంబరాలు అంబరాన్ని అంటాయి. మేధరవీధి గిరిజన కాలనీలో పార్టీ నాయకురాలు గంధళ్ల లక్ష్మి ఆధ్వర్యంలో 25 కేజీల కేక్‌ను కట్‌ చేశారు.  2014 ఎన్నికల్లో గౌతమ్‌రెడ్డి 31,412 ఓట్ల విజయం సాధించారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top