‘బంద్‌ను ప్రభుత్వం అణచివేయాలని చూసింది’

YSRCP Leader Botsa Satyanarayana On AP Bandh - Sakshi

సాక్షి, విశాఖపట్నం : ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర బంద్‌పై టీడీపీ ప్రభుత్వం వ్యవహరించిన వైఖరిపై వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నేత బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. విశాఖపట్నంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘బంద్‌కు అన్ని వర్గాలు సహకరించాయి. ప్రభుత్వం పోలీసులతో బంద్‌ను అణచివేయాలని చూసింది. హోదాపై చిత్తశుద్ది ఉంటే పోలీసులతో దాడులు ఎందుకు చేయిస్తారు. హోదాను ఏ పార్టీ ఇస్తే ఆ పార్టీకే కేంద్రంలో మద్దతిస్తాం. హోదా కోసం ఢిల్లీతో పోరాటమే మా ధ్యేయం. కేసులున్నాయని చంద్రబాబు కేంద్రంతో, టీఆర్‌ఎస్‌తో లాలూచీ పడ్డారు. వైఎస్సార్‌సీపీ ప్రజల్లోకి వెళ్తోందని టీడీపీ భయపడుతుంది. ప్రత్యేక హోదా ఇస్తామని బీజేపీ, టీడీపీలు గత ఎన్నికల్లో హామీ ఇచ్చాయి. ఎన్నికలు పూర్తవ్వగానే మాట మార్చాయి. మళ్లీ ఎన్నికలు సమీపిస్తుండటంతో డ్రామాలు మొదలుపెట్టారు. అప్పుడు, ఇప్పుడు వైఎస్సార్‌సీపీ ఒకే మాటపై ఒంటరి పోరు కొనసాగిస్తోంది.

టీడీపీ హోదాపై ఇప్పటికైనా తన వైఖరిని వెల్లడించాలి. హోదా కోసం వైఎస్సార్‌సీపీ ఎంపీలు మాట తప్పకుండా పదవులను వదిలేశారు. సీఎం చంద్రబాబు నాయుడు ప్రత్యేక హోదా వద్దు ప్యాకేజీనే కావాలన్నారు. పార్లమెంట్‌లో టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్‌ మాట్లాడిన అంశాలను వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడ వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి మూడున్నరేళ్ల నుంచి చెబుతున్నారు. కానీ టీడీపీ నేతలు అప్పుడు వైఎస్సార్‌సీపీని హేళన చేశారు. రాష్ట్రం నష్టపోతుందని చెబుతున్నా పట్టించుకోలేదు. రానున్న కాలంలో మరిన్ని పోరాటాలకు ప్రజలు సహకరించాలి. విశాఖ కేంద్రంగా రైల్వే జోన్‌, ఏపీకి ప్రత్యేక హోదా, పోలవరం పూర్తి చేయడానికి వైఎస్సార్‌సీపీ కట్టుబడి ఉంద’ని తెలిపారు. ఏపీకి ప్రత్యేక హోదా సాధనలో చంద్రబాబు నాయుడు మోసాలు, కేంద్రంలోని ఎన్డీఏ సర్కారు తీరును వ్యతిరేకిస్తూ వైఎస్సార్‌సీపీ మంగళవారం బంద్‌కు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top