టీడీపీ నేతలపై అంబటి ఫైర్‌

YSRCP Leader Ambati Slams TDP Leaders In Vijayawada - Sakshi

విజయవాడ: అధికార టీడీపీ నాయకులపై వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు మండిపడ్డారు. వైఎస్ జగన్‌ మోహన్‌ రెడ్డి, బీజేపీతో కుమ్మక్కు అయితే ఈడీ కేసు ఎందుకు పెట్టిందని టీడీపీ నేతలను సూటిగా ప్రశ్నించారు. టీడీపీ నాయకులు బుద్ధి ఉండే మాట్లాడుతున్నారా అని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. బీజేపీతో లాలూచీ పడితే ప్రతివారం కోర్టుకి ఎందుకు వెళ్లాల్సి వచ్చేది అని సూటిగా ప్రశ్నించారు. విజయవాడలోని పార్టీ కార్యాలయంలో ఆదివారం విలేకరులతో మాట్లాడుతూ.. ‘  వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి సతీమణి వైఎస్‌ భారతి మీద కేసు పెట్టారు. ముద్దాయిగా చూపారు అని రెండు టీడీపీ పత్రికల్లో వార్త ప్రచురించారు. తర్వాత జగన్‌ బహిరంగ లేఖ రాశారు. టీడీపీ ఏపీ అధ్యక్షుడు కళా వెంకట్రావు, మంత్రులు విమర్శలు చేశారు.  ఇదంతా ఓ కుట్ర. వైఎస్సార్‌ కుటుంబాన్ని అపహాస్యం చేయడానికి కొన్ని శక్తులు పనిచేస్తున్నాయి. కాంగ్రెస్‌, టీడీపీ రెండూ కలిసి కేసులు వేసి అన్యాయంగా వేధిస్తున్నాయ్‌. ప్రజా సంకల్ప యాత్రకు వస్తున్న ఆదరణ చూడలేక చివరికి  వైఎస్‌ భారతిని కూడా కోర్టుకు ఈడ్చే ప్రయత్నం చేస్తున్నారు. దీనికి ఎల్లో మీడియా వత్తాసు పలుకుతుంద’ని తీవ్రంగా విమర్శించారు.

‘ వైఎస్‌ జగన్‌పై కేసులు పెట్టి జైలు పెడితే తేలికగా గెలవొచ్చు అన్న తాపత్రయం  చంద్రబాబుది. గత ఎన్నికల సమయంలో వైఎస్‌ జగన్‌ రూ.లక్ష కోట్లు దోచుకున్నాడని ప్రచారం చేశారు. ఇప్పుడేమో రూ.43 వేల కోట్లు అంటున్నారు. రూ.43 వేల కోట్లు అయితే నేను రాజకీయాల నుంచి తప్పుకుంటా.. కేవలం రూ.1200 కోట్లకు సంబంధించి మాత్రమే కేసు నడుస్తోంది.ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేస్తున్న టీడీపీ నాయకులకు సిగ్గు శరం ఉందా’ అని విమర్శల వర్షం కురింపించారు.

హెరిటేజ్‌లో జీతాలు ఎంత తీసుకుంటున్నారో లెక్కలు బయటపెట్టాలని డిమాండ్‌ చేశారు. ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు, దర్యాప్తు సంస్థలను మేనేజ్‌ చేయడంలో దిట్ట అని విమర్శించారు. ఈ విషయం చంద్రబాబు చుట్టూ ఉన్న ఆయన అనుచరగణం, ఇద్దరు ఈడీ అధికారుల కాల్‌ డేటా బయటపెడితే నిరూపితమవుతుందని వ్యాఖ్యానించారు. చంద్రబాబు ఓటుకు నోటు కేసులో రెడ్‌హ్యాండెడ్‌గా దొరికితే తప్పు కాదు.. చంద్రబాబులా వ్యవస్థలను మేనేజ్‌ మాకు రాదు.. అందుకే ఇబ్బందులు పడుతున్నామని చెప్పారు. జగన్‌ మోహన్‌ రెడ్డి జైలులో ఉన్నపుడు ఆ పార్టీ పని అయిపోయిందని ప్రచారం చేశారు..కానీ నిలబడి పోరాడుతూ ఉండే సరికి ఇలా తప్పుడు కుట్రలు చేస్తున్నారని విమర్శించారు. 

జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి వైఎస్సార్‌సీపీ గుర్తుపై గెలిచి రాజీనామా చేయకుండా తమపై ఆరోపణలు చేయడానికి ఆయనకి ఏమి నైతికత, అర్హత ఉందని ప్రశ్నించారు. తుని రైలు దహనం  వైఎస్సార్‌సీపీకి చెందిన వ్యక్తులే చేశారని ఆరోపిస్తున్న ఏపీ ఆర్ధిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడికి సిగ్గూ,శరం ఉందా అని ప్రశ్నించారు. అధికారంలో ఉండీ కూడా ఎందుకు విచారణ చేయడం లేదని అడిగారు. ఆయన ఆర్ధిక శాఖకు మంత్రిగా ఉండటం కంటే అబద్ధాల శాఖకు మంత్రిగా ఉంటే మేలని ఎద్దేవా చేశారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top