చిత్తశుద్ధి ఉంటే మాతో కలిసి రండి: బొత్స

YSRCP Asks Chandrababu Naidu To Make TDP MPs To quit  - Sakshi

సాక్షి, విజయవాడ : ఏపీకి ప్రత్యేక హోదా వచ్చేవరకూ పోరాటం చేస్తూనే ఉంటామని వైఎస్‌ఆర్‌ సీపీ సీనియర్‌ నేత బొత్స సత్యనారాయణ మరోసారి స్పష్టం చేశారు. కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకే తమ పార్టీ ఎంపీలు రాజీనామాలకు సిద్ధపడ్డారని అన్నారు. తమ సభ్యులు ఐదుగురే ఉన్నా అవిశ్వాస తీర్మానం పెట్టామని బొత్స పేర్కొన్నారు. అలాగే మిగిలిన పార్టీలతో సంప్రదింపులు జరిపి బలం చేకూర్చామని, కానీ టీడీపీ కేవలం మాటలకే పరిమితమైందన్నారు.

విజయవాడలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో బొత‍్స సత్యనారాయణ శనివారం మీడియా సమావేశంలో మాట్లాడారు. ‘గత నాలుగు రోజులు ఏపీ మంత్రులు మాట్లాడుతున్న మాటలు చూస్తుంటే  సహనం కోల్పోయినట్లుగా ఉన్నాయి. మంత్రుల్ని ఏమి అనాలో అర్థం కావడం లేదు. అవిశ్వాసం పెట్టి భారతదేశ చరిత్రలో ప్రకంపనలు సృష్టించిన పార్టీ మాది. ఐదుగురు ఎంపీలున్నా పార్లమెంట్‌లో సత్తా చూపాం. టీడీపీ తప్పనిసరి పరిస్థితుల్లో మా దారిలోకి వచ్చింది. మేము రాజీనామాలు ప్రకటించాం. టీడీపీ ఎంపీలకు చిత్తశుద్ధి ఉంటే రండి అందరూ రాజీనామాలు చేద్దాం. రాజధర్మానికి కట్టుబడి ఇచ్చిన మాటపై నిలబడాలి.

సోమవారం మళ్లీ మా ఎంపీలు అదే పోరాటం కొనసాగిస్తారు. టీడీపీ ఎంపీలు చరిత్ర హీనులుగా మిగలొద్దు. ఏపీ ఎంపీలంతా రాజీనామాలు చేస్తేనే కేంద్రం దిగొస్తుంది. చంద్రబాబు పాలనలో ఎక్కడ చూసినా అవినీతే. ఎక్కడ చూసినా అవినీతి కంపు. పోలవరం నిర్మాణం చేతకాక అడ్డుగోలుగా దోచేసి అసహనంతో నోటికొచ్చినట్లు మంత్రులు మాట్లాడుతున్నారు. ధర్మం దారితప్పితే విపత్కర పరిస్థితులు ఏర్పడతాయి. చంద్రబాబు ఎక్కడ అడుగు పెడితే అక్కడ అశుభం. గోదావరి పుష్కరాలు, పడవ ప్రమాదం, ఒంటిమిట్ట...ఇలా ఏది చూసి అశుభాలే’ అని వ్యాఖ్యానించారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top