సీఎం గారూ.. రైతుల కష్టం కనిపించలేదా?

YS Jagan's Open Letter to Chandrababu Naidu Over Farmers Problems - Sakshi

ముఖ్యమంత్రి తీరుపై ప్రతిపక్ష నేత జగన్‌ ధ్వజం 

ప్రజలు, విద్యార్థులు, రైతుల గురించి పట్టించుకోండి 

అన్నదాతల చావులు, విద్యార్థుల ఆత్మహత్యలు మిమ్మల్ని కదిలించటం లేదా? 

వర్షాల వల్ల నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవాలని జగన్‌ బహిరంగ లేఖ

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో నారా పాలన నీరో చక్రవర్తి పాలన కన్నా ఘోరంగా తయారైందని, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రజలను పట్టించుకోవడం మానేశారని ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌ సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ధ్వజమెత్తారు. రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులపై శనివారం ఆయన ముఖ్యమంత్రికి బహిరంగ లేఖ రాశారు. చంద్రబాబు మారాలని..  ప్రజలు, విద్యార్థులు, రైతుల గురించి ఆలోచించాలని విజ్ఞప్తి చేశారు. ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నా, ముఖ్యంగా భారీ వర్షాలతో పంటలు మునిగిపోతున్నా.. కుంభకర్ణుడి పెద్దన్న మాదిరిగా ముఖ్యమంత్రి, ఆయన మంత్రి మండలి నిద్ర పోతోందని విమర్శించారు. కష్టాల్లో ఉన్న రైతాంగాన్ని ఆదుకోవడానికి అధికార యంత్రాంగాన్ని పరుగులెత్తించాలని విజ్ఞప్తి చేశారు. వైఎస్‌ జగన్‌ రాసిన బహిరంగ లేఖ పూర్తి పాఠం...

‘‘ముఖ్యమంత్రి గారూ... రైతుల కష్టం మీకు కనిపించటం లేదా?
రెండు వారాలుగా, ప్రధానంగా గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు 13 జిల్లాలను ప్రత్యేకించి రాయలసీమను అతలాకుతలం చేస్తున్న విషయం రాష్ట్రంలోని ప్రతి మీడియా విస్పష్టంగా చెబుతూ వస్తోంది. వరి, వేరుశనగ, నూనె గింజలు, పత్తి , ఉల్లి, మిరప, మినుము, కంది, మొక్కజొన్న, ఆముదం, ఇతర పంటలు లక్షల ఎకరాల్లో దెబ్బతిన్న విషయం మొత్తం రాష్ట్ర ప్రజలందరి దృష్టికీ వచ్చింది. రోడ్డు మార్గాలు తెగిపోయాయి. కొన్ని జిల్లాల్లో రైళ్ల రాకపోకలకు కూడా అంతరాయం కలిగింది.

ఇలాంటి సమయంలో రైతుల ఆవేదన, ప్రజల ఆక్రందన పట్టించుకునే తీరిక మీకు లేక పోవడం ఆందోళన కలిగిస్తున్నందువల్ల ఈ బహిరంగ లేఖ రాస్తున్నా. మీరు ప్రకటించిన రుణమాఫీ ఒక మోసం. ఇన్‌పుట్‌ సబ్సిడీలను ఎగ్గొట్టారు. సున్నా వడ్డీ, పావలా వడ్డీ పథకాలను సంపూర్ణంగా భూమిలో పాతేశారు. మొత్తంగా రూ.87 వేల కోట్ల మేరకు మీరు అధికారంలోకి వచ్చే నాటికి ఉన్న రుణాలను మాఫీ చేయక పోవడంతో ఆ తరువాత ఏటా రూ.14,000 కోట్ల చొప్పున నాలుగేళ్లలో రూ.56,000 కోట్లు వడ్డీగా, అపరాధ వడ్డీని చెల్లించుకోలేక రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వచ్చింది.

రైతులకు పంటల బీమా లభించకుండా మీ రుణమాఫీ వ్యవహారమే రాష్ట్ర రైతాంగాన్ని సర్వనాశనం చేసింది. గత మూడున్నర ఏళ్లుగా గిట్టుబాటు ధరల విషయంలో మీ ప్రభుత్వానిదే రాష్ట్ర రికార్డు. గిట్టుబాటు ధరలు పెంచడంలో కాదు, గిట్టుబాటు ధరలు పెరగకుండా చూడటంలో మీదొక రికార్డు. అంతకుముందు సంవత్సరాల్లో అందిన ధరలు కూడా రాక రైతులు నానా అగచాట్లకు గురైన పరిపాలన మీదే చంద్రబాబునాయుడు గారూ. ఈ విషయంలో రైతులు ధర్నాలు చేసినా, మేం ధర్నాలు, దీక్షలు చేసినా మీ మనసు కరగలేదు. ఈ సంవత్సరం ఖరీఫ్‌ తీసుకుంటే ఏకంగా 10 లక్షల ఎకరాలకు పైగా బీడు పడి ఉందని , విత్తనం పడలేదని పత్రికల్లో వార్తలు వచ్చినా మీ ప్రభుత్వంలో చలనం లేదు.

ఎందుకు ఈ పరిస్థితి వచ్చిందంటే బ్యాంకులు టార్గెట్ల మేరకు వ్యవసాయ రుణాలు ఇవ్వటం లేదు. ఇవ్వొద్దు అని ఎస్‌ఎల్‌బీసీ మీటింగులో మీరే స్వయంగా బ్యాంకర్లకు చెప్పారు. రుణాలు రాక, పెట్టుబడులు పెట్టలేక పంట విస్తీర్ణం తగ్గింది. సకాలంలో వర్షాలు పడక కొంతమేర పంటలు దెబ్బతింటే, ఇప్పుడు కురుస్తున్న వర్షాలు పంటల మీదా, రైతుల ఆశలమీదా మొత్తంగా రైతు జీవితం మీదా చూపుతున్న ప్రభావాన్ని చర్చించడానికి మీకు తీరికే లేదు. ‘రోమ్‌ తగలబడుతుంటే... నీరో చక్రవర్తి ఫిడేలు వాయించినట్టు...’ అన్న సామెతను అందరూ మరచిపోయేలా చేసి మీరు సన్మానాలు, సత్కారాలు, ల్యాండ్‌ డీల్స్, విదేశీ ప్రతినిధులతో ఫొటోలు లాంటి కార్యక్రమాల్లో గత నాలుగు రోజులుగా తలమునకలయ్యారని సీఎం డైలీ షెడ్యూలు చూసిన ఎవరికైనా వెంటనే అర్థం అవుతుంది.

రాష్ట్రంలో రైతు మునుగుతున్నా చలించని మనస్తత్వం మీకు ఎందుకు అబ్బింది చంద్రబాబు గారూ? ఈ నెల 11న మీ వ్యవసాయ శాఖ ఇచ్చిన నివేదిక రెండో పేజీ చూస్తే రాష్ట్రంలోని పలు పంటలు నానా రకాల తెగుళ్ల బారిన పడిన విషయం ఎవరికైనా అర్థం అవుతుంది. అయినా మీకు పట్టించుకునే తీరిక లేదు. వర్షాలు ప్రారంభం కాగానే అవి మీవల్లే కురుస్తాయన్న ఒక అభిప్రాయాన్ని కలిగించడానికి ‘జలహారతి’ అంటూ ప్రచార డ్రామా ఆడారు. వర్షాలు ఎక్కువై రాష్ట్రంలోని రైతాంగమే మునిగి పోతుంటే కుంభకర్ణుడికి పెద్దన్న మాదిరిగా మీరు, మీ మంత్రిమండలి నిద్ర పోతున్నారు. ఇదేం  ప్రభుత్వం చంద్రబాబు గారూ? రైతులు కష్టంలో ఉంటే, రాష్ట్రం నష్టపోతూంటే... మీ ప్రభుత్వ యంత్రాంగాన్ని కదిలించాలని, పరుగులెత్తించాలని, మీరే స్వయంగా రంగంలోకి దిగాలని మీకు ఎందుకు అనిపించడం లేదో నాకు అర్థం కావడం లేదు.

ఏ ఘనకార్యాలు చేస్తున్నారండీ ఆ సెక్రటేరియట్‌లో? ఓ పక్కన రైతుల ఆత్మహత్యలు, ఇంకో పక్కన ఎప్పుడూ వినని విధంగా నిరుద్యోగుల ఆత్మహత్యలు, మరోవైపు మీ మంత్రుల కళాశాలల్లోనే విద్యార్థుల ఆత్మహత్యలు... ఏమిటిది చంద్రబాబు గారూ...? ఒక రైతు గుండె కోత కానీ, తల్లిదండ్రుల కడుపు కోత కానీ మిమ్మల్ని కదిలించడం లేదంటే ఎంత ఘోరం చంద్రబాబు గారూ ఇది! అయ్యా మీరు కాస్త మారండి... ప్రజల గురించి పట్టించుకోండి. నీరో పాలన కన్నా నారా పాలన ఘోరంగా ఉందని ఎందుకు అంటున్నామో ఆలోచించండి. ఇకనైనా కదలండి. రైతుల నష్టానికి పూర్తిగా పరిహారం ఇవ్వండి. విద్యార్థులు, నిరుద్యోగుల ఆత్మహత్యల్లో మీ పాత్ర మీద ఆత్మ పరిశీలన చేసుకోండి’’ 
అభినందనలతో...
వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top