మేమంతా మీ వెంటే.. | YS Jagan PrajaSankalpaYatra Restarted with Huge Public Support | Sakshi
Sakshi News home page

మేమంతా మీ వెంటే..

Nov 13 2018 4:21 AM | Updated on Nov 13 2018 1:20 PM

YS Jagan PrajaSankalpaYatra Restarted with Huge Public Support - Sakshi

ప్రజా సంకల్ప యాత్ర నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: ‘ఎవరెన్ని కుట్రలు పన్నినా నీకు దేవుడు అండగా ఉన్నాడు.. నీకేం కాదు నాయనా.. నువ్వు రావాలని, నువ్వు వస్తేనే అందరికీ న్యాయం జరుగుతుందని నమ్ముతున్నాం.. అందుకోసం మేమంతా నీ వెంటే ఉంటాం..’ అని అవ్వాతాతలు, ‘ఎన్ని కష్టాలొచ్చినా ఈసారి మిమ్మల్ని గెలిపించుకుంటాం’ అని యువత, అక్క చెల్లెమ్మలు ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ ఎదుట స్పష్టీకరించారు. పోటెత్తిన జన వాహిని నడుమ, అడుగడుగునా మహిళలు నీరాజనాలు పడుతుండగా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజా సంకల్ప యాత్రను సోమవారం పునఃప్రారంభించారు. వెల్లువెత్తిన ప్రజాభిమానం అడ్డుపడటంతో ఆయన యాత్ర నెమ్మదిగా ముందుకు సాగింది. హత్యాయత్నానికి గురయ్యాక మళ్లీ తమ మధ్యకు వచ్చిన జగన్‌ను చూసి పలువురు మహిళలు దారిపొడవునా ఉద్వేగానికి లోనయ్యారు. ‘నీకెంత కష్టం వచ్చింది నాయనా.. నీకేం కాదు నాయనా.. ఆ భగవంతుడున్నాడు.
 



నీకు ఏమీ కాకూడదని మేం గట్టిగా మొక్కుతున్నాం’ అని ఓ వృద్ధురాలు ఆయన్ను చూసి చలించి పోయి ఏడ్చేసింది. మరో అవ్వ ఆయన బుగ్గలు తాకుతూ తన ఉద్వేగాన్ని దాచుకోలేకపోయింది. జగన్‌ మాతృమూర్తి వైఎస్‌ విజయమ్మ ఆదివారం తన బిడ్డను రక్షించుకోవాలని చెప్పిన మాటలను ఓ మహిళ గుర్తు చేసుకుంటూ గద్గద స్వరంతో కన్నీళ్లు పెట్టుకుంది. దారి పొడవునా ఇలాంటి సన్నివేశాలే కనిపించాయి. ‘గాడ్‌ ఈజ్‌ గ్రేట్‌.. జగనన్నా నువ్వు ఈ రాష్ట్రానికి కావాలి.. ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలి..’ అని రాసి పట్టుకున్న ప్లకార్డులతో రోడ్ల కిరువైపులా యువత, విద్యార్థులు ఎక్కువగా కనిపించారు. రాత్రి బస చేసిన పాయకపాడు వద్ద శిబిరం నుంచి జగన్‌ బయటకు రాకముందే వేల సంఖ్యలో మహిళలు, ప్రజలు గుమి కూడి ఎదురు చూశారు. జగన్‌ రోడ్డు మీదకు వచ్చాక  జనం చుట్టుముట్టడంతో ఆయన యాత్ర ఎంతకీ ముందుకు సాగలేదు. ఒక కిలోమీటరు దూరానికే గంటకు పైగా సమయం పట్టింది.  


కుమ్మరుల కష్టాలు వింటున్న ప్రతిపక్ష నేత 

అందరితోనూ ఆప్యాయంగా.. 
ఓ అవ్వతో ఆప్యాయంగా.. 
గత నెల 25వ తేదీన ఎక్కడి వరకైతే పాదయాత్ర సాగిందో.. సరిగ్గా అక్కడి నుంచే సోమవారం ఉదయం 295వ రోజు యాత్ర మొదలైంది. విశాఖపట్టణం విమానాశ్రయంలో తనపై జరిగిన హత్యాయత్నం దరిమిలా వైద్యుల సలహా మేరకు విరామం ప్రకటించిన జగన్‌ 17 రోజుల తర్వాత.. వజ్ర సంకల్పంతో ముందుకు సాగారు. హత్యాయత్నంలో భుజానికి తగిలిన తీవ్ర గాయం ఓ వైపు కొంత బాధిస్తున్నా.. జగన్‌ మాత్రం సాదా సీదాగా తనకేమీ కానట్లు దారి పొడవునా అందరినీ పలకరిస్తూ వెళ్లారు. జగన్‌పై హత్యాయత్నం జరిగిందన్న ఆవేదనతో తల్లడిల్లిన ప్రజలు ఆయన మళ్లీ తమ మధ్యకు వస్తున్నాడన్న ఆనందంతో చూడటానికి రోడ్లపై పరుగులు తీశారు. బిడ్డ ఎలా ఉన్నాడో చూడాలని అవ్వా తాతలు తహ తహ లాడారు.

జగన్‌ యాత్ర సాగుతున్నపుడు రాష్ట్ర పోలీసులు మూడంచెల భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేసినప్పటికీ జనం మాత్రం జగన్‌ను కలవడానికి ఏ మాత్రం వెనక్కి తగ్గలేదు. ఉత్సాహంతో జగన్‌ను కలిసి సంఘీభావం ప్రకటించారు. తన వద్దకు వస్తున్న వారిని నిరోధిస్తున్న పోలీసులను జగన్‌ వారిస్తూ రానీయాల్సిందిగా కోరారు. పాదయాత్ర పునఃప్రారంభమైన రోజునే పార్టీలోకి చేరికలు జోరుగా సాగాయి. దారి పొడవునా తమ సమస్యలపై గ్రామీణులు జగన్‌ను కలిసి వినతిపత్రాలు సమర్పించారు. ఈ ప్రభుత్వంలో అన్నీ కష్టాలేనని, మీరు సీఎం అయితేనే అందరికీ మేలు జరుగుతుందని ఆకాంక్షించారు. అందరి కష్టాలను ఓపికగా విన్న జననేత.. వారికి ధైర్యం చెబుతూ ముందుకు సాగారు.   
     
రాజమండ్రి లోక్‌సభ సీటు బీసీలకే.. కోఆర్డినేటర్‌గా భరత్‌ రామ్‌  
రాజమండ్రి లోక్‌సభ స్థానాన్ని బీసీలకు కేటాయిస్తామని ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌ సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పునరుద్ఘాటించారు. రాజమండ్రి పార్లమెంట్‌ కోఆర్డినేటర్‌గా మార్గాని భరత్‌ రామ్‌ పేరును ఆయన ప్రకటించారు. రాష్ట్ర బీసీ కులాల జేఏసీ అధ్యక్షుడు మార్గాని నాగేశ్వరరావు, ఆయన కుమారుడు మార్గాని భరత్‌ రామ్‌లు సోమవారం పెద్ద సంఖ్యలో అనుచరులతో కలిసి జగన్‌ సమక్షంలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌లో చేరారు. పాదయాత్ర భోజన విరామం శిబిరం (పాపయ్యవలస)వద్ద నాగేశ్వరరావు, భరత్‌ రామ్‌లతో పాటు పార్టీలో చేరడానికి వచ్చిన వారందరినీ తాను హృదయ పూర్వకంగా ఆహ్వానిస్తున్నానని జగన్‌ పేర్కొన్నారు. తమ పార్టీ తరఫున రాజమండ్రి లోక్‌సభ నియోజకవర్గంలో బీసీలకు సీటు ఇస్తామని గతంలో ప్రకటన చేశామన్నారు.

ఇందులో భాగంగానే నాగేశ్వరరావు కుమారుడు భరత్‌ రామ్‌ను కోఆర్డినేటర్‌గా నియమిస్తున్నామని చెప్పారు. రాజమండ్రి చరిత్రలో ఎప్పుడూ జరుగని విధంగా ఈ సీటును బీసీలకు కేటాయించి ఒక ప్రయోగం చేస్తున్నారని అందరూ అంటున్నారన్నారు. బడుగు, బలహీన వర్గాల తరఫున తోడుగా నిలబడేందుకు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ ఎన్ని ప్రయోగాలు చేయడానికైనా సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు.  రాజమండ్రి పార్లమెంట్‌ సీటును బీసీలకు ఇవ్వడం ద్వారా ఈ విషయం రుజువు చేస్తున్నామన్నారు. భరత్‌ రామ్‌కు మంచి జరుగుతుందని, మంచి జరగాలని దేవుణ్ని ప్రార్థిస్తున్నాననని జగన్‌ అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ పిల్లి సుభాష్‌ చంద్రబోస్, ముఖ్య నేతలు జక్కంపూడి విజయలక్ష్మి, రౌతు సూర్యప్రకాశరావు, రాజమండ్రి నగర అధ్యక్షుడు నందెపు శ్రీనివాస్, కవురు శ్రీనివాస్‌లు పాల్గొన్నారు.  
 

వైఎస్సార్‌సీపీలోకి రాష్ట్ర బీసీ సంఘాల జేఏసీ చైర్మన్‌ 
రాజమండ్రి పార్లమెంట్‌  నియోజకవర్గానికి చెందిన రాష్ట్ర బీసీ సంఘాల జేఏసీ చైర్మన్‌ మార్గాని నాగేశ్వరరావు, ఆయన కుమారుడు మార్గాని భరత్‌ రామ్‌లు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. విజయనగరం జిల్లా సాలూరు నియోజకవర్గం మక్కువ మండలంలోని కాశీపట్నం వద్ద సోమవారం ప్రజా సంకల్ప యాత్రలో వారు వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో పార్టీలో చేరారు. జననేత జగన్‌ వారికి పార్టీ కండువాలు వేసి సాదరంగా ఆహ్వానించారు. వీరితో పాటు మార్గాని యువసేనకు చెందిన కొంచా సత్య, కడియాల లక్ష్మణరావు, మేకా లక్ష్మణరావు, మేకా శ్రీనివాస్, మాసా విజయదుర్గ తదితరులు పార్టీలో చేరిన వారిలో ఉన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు బొత్స సత్యనారాయణ, పిల్లి సుభాష్‌చంద్రబోస్, రాజమండ్రి అర్బన్‌ నియోజకవర్గ సమన్వయకర్త రౌతు సూర్యప్రకాష్, రాజానగరం సమన్వయకర్త జక్కంపూడి విజయలక్ష్మి, కొవ్వూరు నియోజకవర్గ సమన్వయకర్త తానేటి వనిత,  గోపాలపురం సమన్వయకర్త వెంకటరమణ, కొవ్వూరు పట్టణ పార్టీ అధ్యక్షుడు రుత్తల ఉదయభాను, రాజమండ్రి పట్టణ పార్టీ అధ్యక్షుడు ఎన్‌.శ్రీను, ఇతర నేతలు గౌతం, అడప హరి తదితరులు పాల్గొన్నారు.  

తంబళ్లపల్లి టీడీపీ నేతల చేరిక 
చిత్తూరు జిల్లా తంబళ్లపల్లి నియోజకవర్గానికి చెందిన పలువురు టీడీపీ నాయకులు ఆ పార్టీని వీడి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు.  రాజంపేట తాజా మాజీ ఎంపీ పి.వి.మిథున్‌రెడ్డి నేతృత్వంలో సోమవారం వారు ప్రజా సంకల్ప యాత్ర సాగుతున్న ప్రాంతానికి వచ్చారు. పీటీఎం మండలం ఎంపీపీ కొండా గీతమ్మ, ఆమె కుమారుడు కొండా సిద్ధార్థ, సింగిల్‌ విండో చైర్మన్‌ ఎం.భాస్కరరెడ్డి, పీహెచ్‌సీ అభివృద్ధి కమిటీ చైర్మన్‌ కె.చంద్రశేఖర్‌లను జగన్‌.. వైఎస్సార్‌సీపీలోకి ఆహ్వానించారు.  
 

రోడ్డు బాగోలేక ఇక్కట్లు పడుతున్నామన్నా.. 
అన్నా.. మాది పాయకపాడు. మా గ్రామం నుంచి కళాశాలలకు వెళ్లాలంటే సాలూరు వెళ్లాలి. రోడ్డు చాలా ఇరుకుగా ఉంటుంది. బొబ్బిలి, పార్వతీపురం వెళ్లాలన్నా ఇరుకు రోడ్డే. దీంతో ఎదురుగా వాహనాలు వస్తే తప్పుకుని వెళ్లడానికి బాగా ఆలస్యమవుతోంది. దీనికితోడు ఎక్కడ చూసినా గోతులే. రోడ్డు ప్రమాదాలు కూడా ఎక్కువగా అవుతున్నాయి. మీరు అధికారంలోకి రాగానే మా గ్రామాలకు విశాలమైన రోడ్లు వేసి మా చదువులకు ఆటంకం లేకుండా చూడాలన్నా. 
– బొత్స లక్ష్మి, పాయకపాడు 

పన్నెండేళ్లుగా పని చేస్తున్నా రెగ్యులర్‌ చేయలేదన్నా..  
అన్నా.. పన్నెండేళ్లుగా పీహెచ్‌సీలలో సెకండ్‌ ఏఎన్‌ఎంలుగా విధులు నిర్వహిస్తున్న మమ్మల్ని శాశ్వత ఉద్యోగులుగా గుర్తించడం లేదు. ఇతర రాష్ట్రాల్లో మా స్థాయి ఉద్యోగులను బాగా చూసుకుంటున్నారు. ఎక్కువ వేతనం ఇస్తున్నారు. ఏపీలోని ప్రతి జిల్లాలో 400 మందికి పైగా సెకండ్‌ ఏఎన్‌ఎంలు పని చేస్తున్నారు. రెగ్యులర్‌ ఉద్యోగుల కన్నా ఎక్కువ పని చేస్తున్నా వేతనం మాత్రం చాలా తక్కువగా ఇస్తున్నారు. మీరు సీఎం కాగానే మమ్మల్ని ఆదుకోవాలన్నా.      
– ఎం శ్యామల, పి మంగమ్మ

 

కుమ్మరులకు కార్పొరేషన్‌ ఏర్పాటు చేయండి 
కుమ్మరి కులస్తులు ఆర్థికంగా వెనుకబడి ఉన్నారు. వృత్తి పరమైన పని బాగా తగ్గిపోవడంతో కుటుంబాన్ని నెట్టుకు రావడం ఇబ్బందిగా మారింది. రాజశేఖరరెడ్డి హయాంలో శాలివాహన ఫెడరేషన్‌ ఏర్పాటు చేసి కాస్త ఊరట కల్పించారు. మీరు ముఖ్యమంత్రి కాగానే శాలివాహన కార్పొరేషన్‌ ఏర్పాటు చేసి రుణాలు మంజూరు చేసి మమ్మల్ని ఆదుకోవాలి. ప్రస్తుతం కుండల విక్రయాలు తగ్గుముఖం పట్టడంతో పలువురు పొట్టచేత పట్టుకొని వలసలు వెళ్లారు. మరికొంత మంది ఇటుకలు తయారు చేస్తూ జీవితం నెట్టుకు వస్తున్నారు. ఇటుకల తయారీకి అవసరమైన మట్టిని కొనుగోలు చేయడం ఆర్థికంగా భారమవుతోంది. జీవో 1076ను అమలు చేసి మట్టి తవ్వుకునే హక్కును కల్పించాలి.   
 – శాలివాహన సంఘం నేతలు  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement