నేనడుగు పెట్టా.. సీసీ కెమెరాలు బంద్‌: వైఎస్‌ జగన్‌

YS Jagan Fires On Chandrababu Naidu Over Vizag Airport Incident - Sakshi

బాబులాంటి కుట్రదారు ప్రపంచంలో ఉండరు : వైఎస్‌ జగన్‌

సాక్షి, విజయనగరం : ‘రాజకీయంగా నన్ను ఎదుర్కొనే దమ్ములేకనే.. అంతమెందించాలని చూశారు’ అని ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ఆరోపించారు. టీడీపీ అరాచక పాలనలో అన్యాయానికి గురౌతున్న ప్రజల సమస్యల్ని తెలుసుకునేందుకు పాదయాత్ర చేస్తున్నానని చెప్పారు. ప్రజల్లో తనకు వస్తున్న ఆదరణ చూసి చం‍ద్రబాబు ఓర్వలేకపోయాడనీ, అందుకే తనపై హత్యాయత్నం జరిగిందని వెల్లడించారు. ప్రజాసంకల్పయాత్రలో భాగంగా విజయనగరం జిల్లాలో పాదయాత్ర  చేస్తున్న వైఎస్‌ జగన్‌ పార్వతీపురంలో జరిగిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి చంద్రబాబుపై నిప్పులు చెరిగారు. చంద్రబాబు లాంటి నక్క జిత్తుల మనిషి ప్రపంచంలో మరొకరు ఉండరని వ్యాఖ్యానించారు. 

‘విశాఖ ఎయిర్‌పోర్టులో నాపై జరిగింది కుట్ర కాదా’ అని చంద్రబాబును ప్రశ్నించారు. ‘బీజేపీతో నాలుగేళ్లు అధికారాన్ని పంచుకున్న టీడీపీ గత మార్చి నెలలో తెగదెంపులు చేసుకుంది. అప్పటికే ప్రజాసంకల్పయాత్రకు విశేష స్పందన రావడంతో నన్ను చంపేందుకు పథకం రచించారు. ఓ సినీ నటుడిని తీసుకొచ్చి ఆపరేషన్ గరుడ పేరుతో స్క్రిప్టు చదివించారు. దానికి ఎల్లో మీడియాలో విస్తృత ప్రచారం కల్పించారు. ఆపరేషన్‌ గరుడ పేరుతో బీజేపీ రాష్ట్రంలో అనిశ్చితి రగిల్చి టీడీపీ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు కుట్ర చేస్తోందని జనాన్ని నమ్మించే ప్రయత్నం చేశారు. రాష్ట్ర ప్రతిపక్ష నేతపై దాడి జరగబోతోందని నటుడితో చెప్పించారు. కేంద్రం పరిధిలో ఉండే ఎయిర్‌పోర్టులో దాడి చేసి నన్ను చంపేస్తే బాబు ప్రభుత్వానికి ఏ సంబంధం ఉండదనుకున్నారు. ఆ ప్రయత్నం విఫలమవడంతో ఆపరేషన్‌ గరుడలో చెప్పినట్టే జరిగిందని ప్రచారం చేస్తున్నార’ని వైఎస్‌ జగన్‌ ప్రజలకు వివరించారు.

మూడు నెలల నుంచి కెమెరాలు బంద్‌..!
‘పాదయాత్ర చేస్తూ ఆగస్టు నెలలో విశాఖ జిల్లాలో అడుగుపెట్టిన వెంటనే ఎయిర్‌పోర్టులో సీసీ కెమెరాలు ఆగిపోయాయి. నాపై దాడి జరిగిన అనంతరం సీసీ కెమెరా ఫుటేజీలపై ఆరా తీయగా.. మూడు నెలల నుంచి అక్కడ కెమెరాలు పనిచేయడం లేదని చెప్తున్నారు. ఇదంత కుట్ర కాదా.. బాబూ’ అని వైఎస్‌ జగన్‌ చంద్రబాబుపై విరుచుకుపడ్డాడు. కట్టుదిట్టమైన భద్రత ఉండే ఎయిర్‌పోర్టులోకి కత్తులు ఎలా వచ్చాయని వైఎస్‌ జగన్‌ ప్రశ్నించారు. ‘బాబు సన్నిహితుడైన హర్షవర్ధన్‌ చౌదరి రెస్టారెంట్‌లో పనిచేసే వ్యక్తి నాపై దాడి చేశాడు. దానిని కూడా చంద్రబాబు రాజకీయం చేయాలని చూశాడు. ఘటన జరిగిన గంటలోపే రాష్ట్ర డీజీపీ, మంత్రులు మీడియా మందుకొచ్చి హత్యాయత్నం చేసింది జగన్‌ అభిమానే అని ప్రకటించారు. అభిమాని అయితే.. దాడి చేస్తారా’ అని ప్రశ్నించారు. దాడి జరిగిన అనంతరం వీఐపీ లాంజ్‌లో నిందితుడి వద్ద సీఐఎస్‌ఎఫ్‌ సిబ్బందికి ఎలాంటి లేఖ దొరకలేదని వైఎస్‌ జగన్‌ చెప్పారు. ఘటన జరిగిన 10 గంటల తర్వాత డీజీపీతో చెక్కుచెదరని, ఎక్కడా మడతలు పడని లేఖను మీడియాకు చూపించారని గుర్తు చేశారు. ‘ఇదంతా కుట్ర కాదా బాబూ’.. అని వైఎస్‌ జగన్‌ ధ్వజమెత్తారు.

‘వైఎస్‌ జగన్‌పై దాడి చేయించింది.. ఆయన తల్లి విజయమ్మ, చెల్లి షర్మిలే కావచ్చు అని దిక్కుమాలిన స్టేట్‌మెంట్లు ఇచ్చే స్థాయికి బాబు రాజకీయాలు దిగజారాయి. నాపై జరిగిన హత్యాయత్నంలో ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఎలాంటి ప్రమేయం లేకపోతే.. స్వతంత్ర దర్యాప్తు సంస్థతో కేసు విచారణ చేయించొచ్చు కదా’ అన్నారు. ‘ఓదార్పు యాత్ర చేపడతానన్న నాపై కాంగ్రెస్‌తో కుమ్మక్కై అక్రమ కేసులు పెట్టించావ్‌. నాడు సీబీఐ ముద్దు అన్నావ్‌. నేడు వద్దు అంటున్నావ్‌. రాష్ట్రంలో సీబీఐ అడుగు పెట్టొద్దని ఏకంగా జీవో జారీ చేశావ్‌. నాపై జరిగిన హత్యాయత్నంపై గానీ, నీ అవినీతి పాలనపై గానీ, ఓటుకు కోట్లు కేసులో గానీ సీబీఐతో విచారణ చేయిస్తే... చంద్రబాబు జైలుకు పోవడం ఖాయం. అందుకే సీబీఐకి వ్యతిరేకంగా ఇంతటి నీచమైన చర్యలు చేపట్టావ్‌’ అని వైఎస్‌ జగన్‌ ధ్వజమెత్తారు. అప్పటికే ఆలస్యం అయినందున ‘నవరత్నాలు’ గురించి మరో సభలో వివరిస్తానన్నారు. తనపై జరిగిన హత్యాయత్నంపై టీడీపీ దిగజారుడు రాజకీయాలు చేయడంతో తీవ్రంగా కలత చెందినట్టు జననేత వెల్లడించారు. తన కోసం వచ్చిన ప్రజలకు పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top