గ్రాఫిక్స్‌ ఉంది.. రాజధాని ఏది బాబూ?: వైఎస్‌ జగన్‌

YS Jagan Critics Chandrababu Naidu Over Amaravati Construction - Sakshi

సాక్షి, విజయనగరం: అగ్రిగోల్డ్‌ ఆస్తులను కాజేసేందుకు చంద్రబాబు, లోకేష్, వాళ్ల బినామీలు ప్రయత్నిస్తున్నారని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, రాష్ట్ర ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ఆరోపించారు. అగ్రిగోల్డ్‌ బాధితులను ఆదుకునే వారే కరువయ్యారని ఆవేదన చెందారు. ప్రజాసంకల్పయాత్రలో భాగంగా విజయనగరం జిల్లా పార్వతీపురంలోని పాత బస్టాండ్‌ సెంటర్‌లో భారీ బహిరంగ సభలో అశేష జనాన్ని ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. అధికారంలోకి వచ్చి నాలుగున్నర సంవత్సరాలు అవుతున్నా రాజధానిలో ఒక్క శాశ్వత కట్టడం కూడా కట్టలేదని విమర్శించారు.

‘2014 ఎన్నికలకు ముందు ఇదే నేను కట్టబోయే రాజధాని అంటూ చంద్రబాబు గ్రాఫిక్స్‌ చూపించాడు. తొమ్మిదేళ్ల అనుభవముందని నమ్మబలికాడు. 2019 ఎన్నికలు కూడా రాబోతున్నాయి. నాలుగున్నరేళ్ల పాలన పూర్తయింది. అయినా, ఇంకా.. రాజధాని నిర్మాణానికి సంబంధించి గ్రాఫిక్స్‌ చూపిస్తూనే ఉన్నాడు. ఓరోజు జపాన్‌ అంటాడు. మరో రోజు లండన్‌ అంటాడు. ఇప్పటివరకు రాజధానికి సంబంధించి ఒక్క శాశ్వత నిర్మాణం కూడా జరగలేదు’ అని వైఎస్‌ జగన్‌ ఎద్దేవా చేశారు.

పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తుకు రాలేదా..!
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో దాదాపు 90 శాతం పూర్తయిన ప్రాజెక్టులను చంద్రబాబు ప్రభుత్వం పట్టించుకోలేదని వైఎస్‌ జగన్‌ మండిపడ్డారు. విజయనగరం జిల్లా ప్రజలకు ఎంతో ఉపయోగకరమైన జంఝావతి ప్రాజెక్టు నిర్మాణాన్ని గత ప్రభుత్వాలు పట్టించుకోలేదని అన్నారు. దశాబ్దాలుగా నిర్లక్ష్యానికి గురైన ఈ ప్రాజెక్టుకు వైఎస్‌ రాజశేఖర రెడ్డి అధికారంలోకి వచ్చాక మంచి రోజులొచ్చాయని చెప్పారు. దేశంలో ఎక్కడాలేని విధంగా వైఎస్సార్‌ జంఝావతి రబ్బర్‌ డ్యాంను నిర్మించారని గుర్తు చేశారు. చం‍ద్రబాబు జంఝావతి ప్రాజెక్టు నిర్వహణను పట్టించుకోకపోవడంతో అది నిర్లక్ష్యానికి గురైందని అన్నారు. ప్రత్యేక హెలికాప్టర్‌లో దేశంలోని ముఖ్యమంత్రుల వద్దకు వెళ్లే చంద్రబాబు..  పక్క రాష్ట్రమైన ఒడిషా ముఖ్యమంత్రిని మాత్రం కలవడు అని ఎద్దేవా చేశారు.

అగ్రిగోల్డ్ ఆస్తులు కొట్టేయాలని చూస్తున్నారు
‘బాబు వల్ల చెరుకు రైతులు నాశనం అయిపోయారు. నిజాం షుగర్స్ ప్రైవేటు సంస్థకు అమ్మి రైతులకు అన్యాయం చేసారు. పార్వతీపురం మున్సిపాలిటీలో తాగడానికి నీరు మూడురోజులకు ఒకసారి ఇస్తున్న పరిస్థితి ఉంది. అభివృద్ధి గురించి ఆలోచిస్తే పార్వతిపురంలో అసలు అభివృద్ధి లేదు. పార్వతీపురం ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు ఉద్యోగాలు అమ్ముకుంటున్నారు, అగ్రిగోల్డ్ బాధితులు ఇక్కడ ఎక్కువ. వారిని పట్టించుకునే నాథుడు లేడు. అగ్రిగోల్డ్ ఆస్తులను అన్నింటినీ చంద్రబాబు, లోకేష్, బినామిలు కాజేస్తున్నారు. అగ్రిగోల్డ్ ఆస్తుల విలువను పధకం ప్రకారం తగ్గిస్తున్నారు. అత్యంత విలువైన హాయ్‌లాండ్ భూములు చంద్రబాబు లాక్కుని అది ఆగ్రోగోల్డ్ ది కాదని చెబుతున్నారు. అగ్రిగోల్డ్ ఎండీని ఎందుకు అరెస్టు చెయ్యలేదు? ఆ ఆస్తిని తప్పించడానికి బాబు పథకం వేస్తున్నార’ని జగన్‌ విమర్శించారు.

జిమ్మిక్కులు మొదలు పెట్టాడు
‘రాష్ట్రం మొత్తం కరవు కాటకాలతో అల్లాడుతోంది.  ఏడు జిల్లా పరిస్థితి దారుణం, విజయనగరం జిల్లా 26 మండలకు కరువు ఉంటే చంద్రబాబు 4 మండలాల్లో మాత్రమే కరువు ఉందని చెబుతున్నారు. రైతులకు ఇన్‌ఫుట్‌ సబ్సిడీకి 2 వేలకోట్లు ఇవ్వాల్సి ఉంది కాని చంద్రబాబు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు, రుణాలు రీషెడ్యూలు చెయ్యలేదు. బాబు ముఖ్యమంత్రిగా ఉండి ఏం సాధించారు? మాట్లాడితే పట్టిసీమ నుంచి నీరు తెచ్చానని చెబుతాడు. రైన్‌గన్‌లు ఏమయ్యాయి? పోలవరం పరిస్థితి దారుణం.. నాలుగున్నర సంవత్సరాలలో పునాది గోడ తప్ప మరేం కట్టలేదు. పోలవరం ప్రాజెక్టును లంచాలు ప్రాజెక్టుగా మార్చిన ఘనత బాబుదే. యనమల వియ్యంకుడు కూడా ఇందులో కాంట్రాక్టర్. ఎన్నికల సమయం సమీపిస్తున్న తరుణంలో మళ్ళీ చంద్రబాబు జిమ్మిక్కులు మొదలు పెట్టాడు. ఇప్పుడు ఉత్తరాంధ్ర సుజల స్రవంతి అంటూ శంకుస్థాపన చేశారు. ఇది గతంలో రాజన్న ప్రారంభం చేసిన పథకానికి చంద్రబాబు మళ్ళీ టెంకాయ కొడుతున్నారు. హామీలు ఒక్కసారి చూస్తే రైతులకు, మహిళలకు రుణమాఫీ అన్నాడు. ఎన్నికలు అయిపోయాయి అధికారం కూడా అయిపోయింది ఇప్పటికి రుణాలు లేవు మాఫీ లేద’ని వైఎస్‌ జగన్‌ దుయ్యబట్టారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top