లంచాల్లేని ‘సంక్షేమ పాలన’

YS Jagan Comments On Chandrababu And Janmabhoomi Committees - Sakshi

వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ హామీ

చంద్రబాబు గ్రామాల్లో జన్మభూమి కమిటీలు అనే మాఫియాలు పెట్టాడు  

పేదలతో రాజకీయమేంటి?.. బాబులాంటి మోసగాడు పెద్దకొడుకుగా అవసరమా?

నారాసురుడి పాలన త్వరగా అంతమయ్యేలా దేవుడు చూస్తున్నాడు  

వైఎస్సార్‌సీపీకి ఒక్క అవకాశం ఇవ్వండి.. మళ్లీ రాజన్న రాజ్యం తీసుకొస్తాం  

పెట్టుబడి కోసం ఏటా ప్రతి రైతన్న చేతిలో రూ.12,500 పెడతాం  

నాలుగేళ్లలో ఒక్కొక్కరికి రూ.50,000 ఇస్తాం  

అన్నదాతలకు వడ్డీ లేని రుణాలు ఇప్పిస్తాం.. బీమా సొమ్ము మేమే చెల్లిస్తాం

అన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత అన్ని వర్గాల ప్రజలకు మేలు చేస్తాడని రాష్ట్రంలో ప్రతి గ్రామంలో చెప్పండి. మన పిల్లలను పెద్ద చదువులు చదివిస్తాడని, అందుకు ఎన్ని రూ.లక్షలు ఖర్చయినా తానే
భరిస్తాడని చెప్పండి. సున్నా వడ్డీకే రుణాలు ఇచ్చే ఆ రాజన్న రాజ్యాన్ని మళ్లీ తెచ్చుకుందామని, లక్షాధికారులం అవుదామని చెప్పండి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ అక్కచెల్లెమ్మల కోసం ‘వైఎస్సార్‌ చేయూత’ అనే పథకాన్ని అన్న తీసుకొస్తాడని తెలియజేయండి. పెన్షన్‌ను రూ.3,000 దాకా పెంచుకుంటూ పోతాడని అవ్వాతాతలకు చెప్పండి.

– కొయ్యలగూడెం సభలో వైఎస్‌ జగన్‌

‘‘కృష్ణా జిల్లాను చంద్రబాబు కాల్‌మనీ–సెక్స్‌రాకెట్‌కు కేంద్రంగా మార్చేశాడు. విజయవాడ నడిబొడ్డున ఆడవాళ్ల మానాలతో ఆడుకున్నాడు. విజయవాడలో ఒక ఐపీఎస్‌ అధికారిని తెలుగుదేశం పార్టీ నేతలు చొక్కా పట్టుకున్నా చంద్రబాబు చూస్తూ కూర్చున్నాడు. ఇదే జిల్లాలో ఎక్కడిపడితే అక్కడ భూములను కబ్జా చేశాడు. లైసెన్స్‌ లేకుండా బోటు నడిపి 23 మంది ప్రాణాలను బలిగొన్నాడు. పవిత్రమైన కనకదుర్గమ్మ ఆలయంలో తాంత్రిక పూజలు చేసి భ్రష్టు పట్టించిన ముఖ్యమంత్రి చంద్రబాబు మాత్రమే’’  
– అవనిగడ్డ సభలో...  

‘‘ప్రత్యేక హోదా ఐదేళ్లు కాదు, 15 ఏళ్లు తీసుకొస్తానని గత ఎన్నికల ముందు చంద్రబాబు హామీ ఇచ్చాడు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంతో కలిసి నాలుగేళ్లపాటు సంసారం చేశాడు. నాలుగేళ్లు ఇద్దరూ చిలకా గోరింకలకు కూడా అసూయ పుట్టేలా కాపురం చేశారు. టీడీపీ ఎంపీలు కేంద్రంలో బీజేపీ సర్కారులో మంత్రులుగా కొనసాగారు. అయినా బీజేపీ ప్రభుత్వాన్ని, ప్రధాని మోదీని వీళ్లు ఏనాడూ ప్రత్యేక హోదా కోసం అడగలేదు’’  
– వేమూరు సభలో...  

సాక్షి ప్రతినిధి, ఏలూరు/సాక్షి, అమరావతి బ్యూరో:  ‘‘రైతన్నల కష్టాలు నాకు తెలుసు. మీకు కొండంత అండగా నేనుంటాను అని హామీ ఇస్తున్నా. మన ప్రభుత్వం రాగానే పెట్టుబడి కోసం ప్రతి ఏటా ప్రతి రైతన్న చేతిలో రూ.12,500 పెడతాం. నాలుగేళ్లలో ఒక్కొక్కరికి రూ.50,000 ఇస్తాం. వడ్డీ లేని రుణాలు ఇప్పిస్తాం, బీమా సొమ్ము కూడా మేమే చెల్లిస్తాం. ఉచితంగా బోర్లు వేయిస్తాం, వ్యవసాయానికి పగటి పూటే 9 గంటలు కరెంటు సరఫరా చేస్తాం. వ్యవసాయ ట్రాక్టర్లకు రోడ్డు ట్యాక్స్‌ రద్దు చేస్తాం. టోల్‌ ట్యాక్స్‌ లేకుండా చేస్తాం. రూ.3,000 కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తాం. పంటలకు కచ్చితంగా గిట్టుబాటు ధరలు కల్పిస్తాం. తుపాను, వరదలు, కరువు వచ్చినప్పుడు అన్నదాతలను ఆదుకోవడానికి రూ.4,000 కోట్లతో ప్రకృతి విపత్తుల సహాయ నిధి ఏర్పాటు చేస్తాం. ప్రమాదవశత్తు రైతులు మరణించినా, ఆత్మహత్య చేసుకున్నా వారి కుటుంబాలను ఆదుకోవడానికి రూ.7 లక్షలు ఇస్తాం. ప్రభుత్వం ఇచ్చే ఆ సొమ్ముపై అప్పుల వాళ్లకు ఎలాంటి అధికారం ఉండదంటూ చట్టం చేస్తాం.

పోలవరం ప్రాజెక్టు కోసం భూములు త్యాగం చేసిన రైతులకు ప్రతి ఎకరాకు రూ.5 లక్షలు అదనంగా ఇస్తాం. ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీ కింద రూ.10 లక్షలు ఇస్తాం’’ అని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హామీ ఇచ్చారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన మంగళవారం పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం నియోజకవర్గం కొయ్యలగూడెం, కృష్ణా జిల్లా అవనిగడ్డ, గుంటూరు జిల్లా వేమూరులో బహిరంగ సభల్లో ప్రసంగించారు. మండుటెండను కూడా లెక్కచేయకుండా భారీగా తరలివచ్చిన ప్రజలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఎంపీ, ఎమ్మెల్యేలుగా పోటీ చేస్తున్న వైఎస్సార్‌సీపీ అభ్యర్థులకు అఖండమైన విజయం కట్టబెట్టాలని పిలుపునిచ్చారు. మూడు సభల్లో జగన్‌ ఇంకా ఏం చెప్పారంటే...  

చంద్రబాబు లాంటి పెద్ద కొడుకు కావాలా?
అవనిగడ్డ సభలో.. 
చంద్రబాబు వయసు 69 ఏళ్లు. చేయాల్సిన దుర్మార్గాలన్నీ ఈ ఐదు సంవత్సరాల్లో చేసేశాడు. ప్రతి ఇంటిలో పెద్దకొడుకుగా తాను ఉంటానని చెబుతున్నాడు. ఇలాంటి పెద్దకొడుకు కావాలా? అని ప్రజలను అడుగుతున్నా(వద్దు అంటూ జనం సమాధానం) మీరు ఆయనను దత్తత తీసుకుంటారా?(తీసుకోం అంటూ సమాధానం) నమ్మి పిల్లనిచ్చిన మామ ఎన్టీఆర్‌కే వెన్నుపోటు పొడిచాడు. ఇలాంటి వ్యక్తిని పెద్దకొడుకుగా దత్తత తీసుకుంటే మనం బతుకుతామా? గత ఎన్నికల సమయంలో చంద్రబాబు రకరకాల హామీలు ఇచ్చాడు. చివరకు ఆ హామీలన్నీ విస్మరించాడు. ప్రజలకు ఎన్నిరకాలుగా వెన్నుపోట్లు పొడవాలో అన్ని రకాలుగా వెన్నుపోట్లు పొడిచాడు. ముఖ్యమంత్రి అయ్యాక చంద్రబాబు నాయుడు సాక్షాత్తూ అసెంబ్లీలోనే కృష్ణా జిల్లాకు ఎన్నో హామీలిచ్చాడు. మచిలీపట్నం పోర్టు, మచిలీపట్నంలో రిఫైనరీ, పింగాణి పరిశ్రమ, వీజీటీఎం మెట్రో రైలు, అటోమొబైల్‌ లాజిస్టిక్‌ హబ్, ఫుడ్‌పార్కు, విజయవాడ మెగాసిటీ, స్మార్ట్‌సిటీ, ఆక్వాకల్చర్‌ ప్రాసెసింగ్‌ యూనిట్, టెక్స్‌టైట్‌ పార్కు, ఐటీ హబ్, నూజివీడులో మామిడి పరిశోధనా కేంద్రం.. ఇవన్నీ ఏర్పాటు చేస్తానన్నాడు.

ఐదేళ్ల తర్వాత ఇందులో ఒక్కటైనా వచ్చిందా అని అడుగుతున్నా. ఐదేళ్ల పాలనలో కృష్ణా జిల్లాకు చంద్రబాబు చేసిందేమిటో తెలుసా? కృష్ణా జిల్లాను కాల్‌మనీ–సెక్స్‌రాకెట్‌కు కేంద్రంగా చేశాడు. విజయవాడ నడిబొడ్డున ఆడవాళ్ల మానాలతో ఆడుకున్నాడు. విజయవాడలో ఒక ఐపీఎస్‌ అధికారిని తెలుగుదేశం పార్టీ నేతలు చొక్కా పట్టుకున్నా చంద్రబాబు చూస్తూ కూర్చున్నాడు. ఇదే జిల్లాలో ఎక్కడపడితే అక్కడ భూములను కబ్జా చేశాడు. లైసెన్స్‌ లేకుండా బోటు నడిపి 23 మంది ప్రాణాలను బలిగొన్నాడు. పవిత్రమైన కనకదుర్గమ్మ ఆలయంలో తాంత్రిక పూజలు చేసి భ్రష్టు పట్టించిన సీఎం చంద్రబాబు మాత్రమే. సెల్‌ఫోన్, కంప్యూటర్‌ తానే కనిపెట్టాను అని చెబుతాడు. కానీ, విజయవాడలో ఐదేళ్లయినా ఫ్లైఓవర్‌ నిర్మాణాన్ని పూర్తి చేయలేకపోయాడు.

ఇలాంటి వ్యక్తి రాజధాని నిర్మిస్తాడట!  రాజధాని ఎక్కడుంది? అని మనం అడిగితే, బాహుబలి సినిమా చూశారా అని మనల్నే తిరిగి ప్రశ్నిస్తాడు. విజయవాడలో డివిజన్‌కు 5 చొప్పున మద్యం దుకాణాలు ఏర్పాటు చేశాడు. మద్యం బాగా తాగించి ప్రజలను చెడిగొట్టించే కార్యక్రమం చేస్తున్నాడు. చంద్రబాబు తన ఇంటికి నాలుగైదు కిలోమీటర్ల దూరంలోనే ప్రొక్లెయినర్లు పెట్టి, వందలాది లారీలతో రోజూ కోట్లాది రూపాయల ఇసుకను కొల్లగొట్టాడు. పైగా ఇసుక ఉచితం అని చెబుతున్నాడు. మీకు ఎక్కడైనా ఇసుక ఉచితంగా లభించిందా?(లేదు అంటూ జనం సమాధానం) మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఉల్లిపాలెం–భవానిపురం వారధికి అంబటి బ్రాహ్మణయ్య పేరు పెడతాం. అలాగే ఏటిమొగ–ఎదురుమొండి బ్రిడ్జి నిర్మాణాన్ని పూర్తిచేస్తాం.  

రోజుకొక సినిమా, డ్రామా  
5 సంవత్సరాలు అంటే 60 నెలలు పరిపాలన చేయండి అని ప్రజలు చంద్రబాబుకు అధికారం ఇచ్చారు. ఇందులో 57 నెలల పాలనలో మనకు నరకమే కనిపిస్తుంది. చివరి మూడు నెలల్లో మాత్రం రోజుకొక సినిమా, రోజుకొక డ్రామా కనిపిస్తుంది. ఇలాంటి పాలన మళ్లీ కావాలా? అని ప్రజలను అడుగుతున్నా(వద్దే వద్దంటూ జనం కేకలు) దివంగత మహానేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి గొప్ప పరిపాలన అందించారు కాబట్టి రెండోసారి కూడా ఆయనను గెలిపించారు.  

పేదలతో రాజకీయమా?  
మన పరిపాలన చంద్రబాబు పాలనలాగా ఉండదు. ప్రతి సంక్షేమ పథకాన్ని కులాలు, మతాలు, రాజకీయాలు, పార్టీలకు అతీతంగా ప్రతి పేదవాడి చెంతకే చేరుస్తామని హామీ ఇస్తున్నా. రాష్ట్రంలో ఇప్పటి పాలన చూస్తే బాధ కలుగుతోంది. పేదలతో రాజకీయం ఏమిటని చంద్రబాబును ప్రశ్నిస్తున్నా. కష్టాల్లో ఉన్నామంటూ సాయం కోరి వస్తే జన్మభూమి కమిటీల వద్దకు పంపిస్తారా?  గ్రామాల్లో పెన్షన్‌ కావాలని కోరితే మీరు ఏ పార్టీవారు అని మొదటి ప్రశ్న వేస్తున్నారు.  

బాబుకు ఓటు వేసి మోసపోయాం.. 
ఇప్పుడున్న రాజకీయ వ్యవస్థ మారాలి. ఈ వ్యవస్థలో విశ్వసనీయత, నిజాయతీ అనే పదాలకు అర్థం రావాలి. ఇచ్చిన హామీలను అమలు చేయని నాయకులు ఇంటికి వెళ్లిపోయే పరిస్థితిని తీసుకురావాలి. ఐదేళ్ల చంద్రబాబు పాలన చూశాం. ఆయనకు ఓటు వేసి మోసపోయాం. ఇలాంటి అన్యాయమైన పాలన పోవాలన్నా, మంచి పాలన రావాలన్నా అది ప్రజల చేతిలోనే ఉంది. మనం ప్రకటించిన నవరత్నాల్లోని ప్రతి అంశాన్ని ప్రతి ఇంటికీ చేర్చండి. నవరత్నాలతో ప్రజల జీవితాలు బాగుపడుతాయని గట్టిగా నమ్ముతున్నా. రేపు మన ప్రభుత్వం వచ్చాక నాన్నగారి పాలన కంటే మరింత గొప్ప పాలన అందించేందుకు కృషి చేస్తానని హామీ ఇస్తున్నా.  

వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి ఒక్క అవకాశం ఇవ్వండి. రాజన్న రాజ్యాన్ని మళ్లీ తీసుకొస్తానని హామీ ఇస్తున్నా. పాదయాత్రలో ప్రజలందరి కష్టాలను ప్రత్యక్షంగా చూశాను, బాధలు విన్నాను. అందుకే మరోసారి చెబుతున్నా.. మీకు నేనున్నాను. 

విష్ణుచక్రానికి ప్రతిరూపం ఫ్యాన్‌ చక్రం 
గతంలో శిశుపాలుడు అనే రాక్షసుడు ఉండేవాడు. అతడు వంద తప్పులు చేసేదాకా దేవుడు ఓపిక పట్టాడు. 101వ తప్పు చేశాక విష్ణుచక్రం ప్రయోగించి, శిశుపాలుడిని అంతం చేశాడు. శిశుపాలుడు నరకంలో ఉన్నాడట, యముడిని ఒక మాట అడిగాడట. అప్పట్లో 101 తప్పులకే నాపై విష్ణుచక్రం ప్రయోగించారు, మరి చంద్రబాబు ఐదేళ్లలో వందల కొద్దీ మోసాలు, అన్యాయాలు చేశాడు, వెన్నుపోట్లు పొడిచాడు. అలాంటి వ్యక్తిపై విష్ణుచక్రం ఎందుకు ప్రయోగించలేదని ప్రశ్నించాడట. అప్పుడు యముడు ఏమన్నాడంటే.. చూడు శిశుపాలా.. అప్పటి విష్ణుచక్రం లాంటిదే ఇప్పటి ఫ్యాన్‌చక్రం. అప్పట్లో శ్రీకృష్ణుడు నిన్ను వధించాడు, ఇప్పుడు ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ యంత్రంపై ఆంధ్రప్రదేశ్‌ ప్రజలంతా వేలు పెట్టి నొక్కి, చంద్రబాబును దించేయబోతున్నారని చెప్పాడట. ఈ యుగంలో విష్ణుచక్రానికి ప్రతిరూపం ఫ్యాన్‌చక్రం, శ్రీకృష్ణుడికి ప్రతిరూపం ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు అని యముడు చెప్పాడట. శిశుపాలుడితోపాటు నరకాసురుడు, రావణాసురుడు, బకాసురుడు.. వీళ్లందరినీ కలిపిన ప్రతిరూపంగా చంద్రబాబు పుట్టాడని అన్నాడట. నారాసురుడి పాలన త్వరగా అంతమయ్యేలా దేవుడు చూస్తున్నాడు.  

మాఫియాల్లా జన్మభూమి కమిటీలు
కొయ్యలగూడెం సభలో.. 
‘‘14 నెలలు.. 3,648 కిలోమీటర్లు పాదయాత్ర చేశా. మీతో కలిసి నడిచాను. మీ కష్టాలు విన్నాను. మీ బాధలను అర్థం చేసుకున్నాను. ప్రతి పేదవాడి గుండె చప్పుడు విన్నాను. 13 జిల్లాల్లో ఏ గ్రామంలో చూసినా ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిందేమిటో చూస్తే.. అధికారంలోకి రాగానే రేషన్‌ కార్డులు తీసేశాడు. అప్పటిదాకా ఉన్న పెన్షన్లను కూడా తీసేయడం మొదలుపెట్టాడు. గ్రామాల్లో ప్రజల ద్వారా ఎన్నికైన సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలను పక్కనపెట్టి, జన్మభూమి కమిటీలు అనే మాఫియాలను తీసుకొచ్చాడు. గ్రామాల్లో మట్టి, ఇసుక లాంటి వాటిని దోచేయడమే ఈ మాఫియాల లక్ష్యం. లంచాలు ఇవ్వనిదే ప్రజల కోసం ఏ పనీ చేయరు. ప్రతి గ్రామంలోనూ జన్మభూమి కమిటీల అరాచకాల గురించి ప్రజలు చెప్పారు. బాత్రూమ్‌ మంజూరుకు లంచం రూ.1,800, ఇంటి మంజూరుకు లంచం రూ.15,000, చంద్రన్న బీమాకు లంచం రూ.20,000, ప్రమాద బీమాకు లంచం రూ.5,000, డెత్‌ సర్టిఫికెట్, బర్త్‌ సర్టిఫికెట్‌ కావాలన్నా లంచమే, కొత్త పెన్షన్‌ మంజూరు కావాలంటే లంచం, ప్రతినెలా పెన్షన్‌ తీసుకోవాలంటే కూడా లంచం, రేషన్‌కార్డు కోసం దరఖాస్తు చేసుకోవాలన్నా లంచం... ఈ లంచాల పాలనతో ప్రజలు ఎన్ని ఇబ్బందులు పడ్డారో నేను విన్నాను. పేదలు ఎన్ని కష్టాలు పడ్డారో చూశాను. లంచాల ప్రసక్తి లేని సంక్షేమ పాలన అందించడానికి నేనున్నాను అని ప్రజలకు మాట ఇస్తున్నా.  

బ్యాంకర్లు మహిళల ఇళ్లకు తాళాలు వేస్తున్నారు   
ఎన్నికలకు మూడు నెలల ముందు ఓట్లు కొనుగోలు చేయడానికి చంద్రబాబు రూ.10,000 చెక్కు ఇస్తానన్నాడని డ్వాక్రా మహిళలు నాకు చెప్పారు. రాష్ట్రంలో 93 లక్షల మంది డ్వాక్రా అక్కచెల్లెమ్మలు ఉన్నారు. ఎన్నికల ముందు వారికి చెక్కుల రూపంలో చంద్రబాబు ఇస్తానన్న సొమ్ము ఎంతంటే.. రూ.6,000 కోట్లు కూడా దాటలేదు. 2016 అక్టోబర్‌ నుంచి సున్నా వడ్డీ కింద ఇవ్వాల్సిన బకాయిలను చంద్రబాబు ఎగ్గొట్టాడు. రుణాలను ప్రభుత్వం మాఫీ చేయకపోవడంతో అప్పులు చెల్లించాలంటూ బ్యాంకర్లు వచ్చి తమ ఇళ్లకు తాళాలు వేస్తున్నారని మహిళలు గోడు వెళ్లబోసుకున్నారు. గతంలో బ్యాంకుల్లో సున్నా వడ్డీకే రుణాలు వచ్చేవని గుర్తుచేసుకున్నారు.  

డ్వాక్రా మహిళలపై రుణభారం  
తడిసిమోపెడైన అప్పుల భారంతో పొదుపు సంఘాల మహిళలు బాధపడుతున్నారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చేనాటికి డ్వాక్రా మహిళల రుణాలు రూ.14,200 కోట్లు ఉండగా, ఆ రుణాలను ప్రభుత్వం మాఫీ చేయకపోవడంతో ఇప్పుడు అవి వడ్డీలతో కలిపి ఏకంగా రూ.25,500 కోట్లకు ఎగబాకాయి. పొదుపు సంఘాల్లో ఉన్న ప్రతి అక్కచెల్లెమ్మకు నేను హామీ ఇస్తున్నా. మీ బాధలను నేను విన్నాను, మీకు నేనున్నాను.  

పంటలకు గిట్టుబాటు ధర కల్పిస్తాం.. 
పాదయాత్రలో దారిపొడవునా రైతన్నల కష్టాలు విన్నాను, వారి అవేదన చూశాను. మీకు కొండంత అండగా నేనుంటాను అని ప్రతి రైతన్నకూ హామీ ఇస్తున్నా. పెట్టుబడి కోసం రైతులు అధిక వడ్డీలకు అప్పులు తెచ్చుకోవాల్సి వస్తోంది. మన ప్రభుత్వం రాగానే పెట్టుబడి కోసం ప్రతి ఏటా మే నెలలో ప్రతి రైతన్న చేతిలో రూ.12,500 పెడతాం. నాలుగేళ్లలో ఒక్కొక్కరికి రూ.50,000 ఇస్తాం. అన్నదాతలకు వడ్డీ లేని రుణాలు ఇప్పిస్తాం, బీమా సొమ్ము కూడా మేమే చెల్లిస్తాం. ఉచితంగా బోర్లు వేయిస్తాం, వ్యవసాయానికి పగటి పూటే 9 గంటలు కరెంటు సరఫరా చేస్తాం. వ్యవసాయ ట్రాక్టర్లకు రోడ్డు ట్యాక్స్‌ రద్దు చేస్తాం. టోల్‌ ట్యాక్స్‌ కూడా లేకుండా చేస్తామని హామీ ఇస్తున్నా. రైతులకు తోడుగా ఉండడానికి రూ.3,000 కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తాం. పామాయిల్‌కు మన రాష్ట్రంలో ఒక ధర ఉంది, తెలంగాణలో మరో ధర కనిపిస్తోంది.

ఇక్కడి కంటే తెలంగాణలో అమ్ముకుంటే ఎక్కువ ధర వస్తోంది. జగన్‌ వచ్చి పొగాకు కొనుగోలు కేంద్రాల్లో ధర్నా చేస్తేగానే ధర పెరగని పరిస్థితి మనం చూశాం. వరి రైతుల పరిస్థితి మరింత దారుణం. పంట చేతికొచ్చే సరికి కొనేవారు ఉండరు. గిట్టుబాటు ధర ఉండదు. ప్రతి రైతన్నకూ మళ్లీ చెబుతున్నా.. పంటలకు కచ్చితంగా గిట్టుబాటు ధరలు కల్పిస్తాం. గిట్టుబాటు ధరలకు గ్యారంటీ ఇస్తాం. తుపాను, వరదలు, కరువు వచ్చినప్పుడు అన్నదాతలను ఆదుకోవడానికి రూ.4,000 కోట్లతో ప్రకృతి విపత్తుల సహాయ నిధి ఏర్పాటు చేస్తాం. ప్రమాదవశాత్తు రైతులు మరణించినా, ఆత్మహత్య చేసుకున్నా వారి కుటుంబాలను ఆదుకోవడానికి రూ.7 లక్షలు ఇస్తాం. ప్రభుత్వం ఇచ్చే ఆ సొమ్ముపై అప్పుల వాళ్లకు ఎలాంటి అధికారం ఉండదంటూ తొలి అసెంబ్లీ సమావేశాల్లోనే చట్టాన్ని తీసుకొస్తాం.  

పోలవరం నిర్మాణం పూర్తిచేస్తాం.. 
పోలవరం ప్రాజెక్టు బాధితులు, నిర్వాసితుల పక్షాన ధర్నాలు, పోరాటాలు చేసింది జగన్, వైఎస్సార్‌సీపీ అని గర్వంగా చెబుతున్నా. మన ప్రభుత్వం వచ్చాక పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని పూర్తి చేయడమే కాకుండా, భూములు కోల్పోయిన రైతులకు ‘భూసేకరణ చట్టం–2013’ను అమలు చేస్తామని హామీ ఇస్తున్నా. పోలవరం ప్రాజెక్టు కోసం రైతులు తమ భూములను ఎకరా రూ.లక్ష, రూ.లక్షన్నరకే త్యాగం చేశారు. అలాంటి రైతులకు మానవతా దృక్పథంతో ప్రతి ఎకరాకు రూ.5 లక్షలు అదనంగా ఇస్తామని గతంలోనే చెప్పాను.  ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీ కింద నేను రూ.10 లక్షలు ఇస్తానని గతంలో వారికి చెప్పా. ఆ సొమ్మును మీ చేతుల్లో పెట్టే కార్యక్రమం కచ్చితంగా చేస్తాం.  

‘పోలవరం’ పూర్తిగా అవినీతిమయం  
2017లోనే పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తి కావాల్సి ఉండగా, ఇప్పటికి కూడా నత్తనడకన పనులు సాగుతున్నాయి. ఐదేళ్లు చంద్రబాబుకు అధికారం ఇస్తే పోలవరం ప్రాజెక్టు పరిస్థితి పునాదులను కూడా దాటలేదు. తన వైఫల్యం గురించి ప్రజలు వేలెత్తి చూపుతుండడంతో చంద్రబాబు కొత్తకొత్త సినిమాలు చూపిస్తున్నాడు. డయాఫ్రం వాల్‌ అంటూ ఒకరోజు రిబ్బన్‌ కట్‌ చేస్తాడు. స్పిల్‌ వే గ్యాలరీ పేరిట మరో రోజు రిబ్బన్‌ కట్‌ చేస్తాడు. 48 గేట్లకు గాను 3 గేట్లు పెడతాడు, టెంకాయ కొడతాడు, ప్రాజెక్టు అయిపోయిందంటూ బిల్డప్‌ ఇస్తాడు. 

ఈ లంచాల పాలనతో ప్రజలు ఎన్ని ఇబ్బందులు పడ్డారో నేను విన్నాను. పేదలు ఎన్ని కష్టాలు పడ్డారో చూశాను. లంచాల ప్రసక్తి లేని సంక్షేమ పాలన అందించడానికి నేనున్నాను అని ప్రజలకు మాట ఇస్తున్నా.  

బాబుకు ఎల్లో మీడియా తానతందాన  
రాబోయే రోజుల్లో చంద్రబాబు చేయని గిమ్మిక్కులు ఉండవు. ఎన్నికలు దగ్గరకొచ్చేసరికి చూపించని సినిమా ఉండదు. వేయని డ్రామా ఉండదు, చెప్పని అబద్ధం ఉండదు, చేయని మోసం ఉండదు. చంద్రబాబుకు తానతందాన అనడానికి ఈనాడు ఉంది, ఆంధ్రజ్యోతి ఉంది, టీవీ5, అమ్ముడుపోయిన టీవీ చానళ్లు ఉన్నాయి. వీళ్లంతా కలిసి ఎన్నికల దాకా ప్రజలకు రోజుకొక సినిమా చూపిస్తారు. వాళ్లే హత్యలు చేయిస్తారు, ఎదుటివారిపై నెపం నెట్టేస్తారు. వాళ్లే హత్యలు చేయిస్తారు, వాళ్ల పోలీసులతోనే దర్యాప్తు చేయిస్తారు. అదే విషయాన్ని వాళ్ల పత్రికలు, టీవీ చానళ్లలో వక్రీకరిస్తారు. హంతకుడే ఇతరులు హంతకులు అంటూ కేకలు వేస్తాడు.  

అన్న ముఖ్యమంత్రి అయితే...  
ఎన్నికలు వచ్చేసరికి చంద్రబాబు మన గ్రామాలకు మూటల కొద్దీ డబ్బులు పంపిస్తాడు. ప్రతి ఒక్కరి చేతిలో రూ.3,000 పెడతాడు. చంద్రబాబు ఇచ్చే డబ్బులకు మోసపోవద్దని గ్రామాల్లో ప్రతి ఒక్కరికీ చెప్పండి.  
- ఎన్నికల నాటి వరకూ పొదుపు సంఘాల మహిళలకు ఎంత అప్పు ఉంటే అంత సొమ్మును నాలుగు దఫాల్లో నేరుగా వారి చేతికే ఇస్తాడని చెప్పండి.  
సున్నా వడ్డీకే రుణాలు ఇచ్చే ఆ రాజన్న రాజ్యాన్ని మళ్లీ తెచ్చుకుందామని, లక్షాధికారులం అవుదామని చెప్పండి.  
45 ఏళ్ల నుంచి 60 ఏళ్లలోపు వయసున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ అక్కచెల్లెమ్మలకు ‘వైఎస్సార్‌ చేయూత’ పథకం కింద ప్రతి ఏటా రూ.75,000 నాలుగు దఫాల్లో ఇస్తాడని చెప్పండి.  
పెట్టుబడి సాయం ప్రతి రైతన్నకు ప్రతి ఏటా మే నెలలో రూ.12,500 ఇస్తాడని చెప్పండి. పెన్షన్‌ను రూ.3,000 దాకా పెంచుకుంటూ పోతాడని అవ్వాతాతలకు చెప్పండి.  

అన్న సీఎం అయిన తర్వాత మన పిల్లలను బడికి పంపిస్తే చాలు ప్రతి సంవత్సరం రూ.15,000 ఇస్తాడని ప్రతి అక్కకు, ప్రతి చెల్లెమ్మకు తెలియజేయండి.  మన ప్రభుత్వాన్ని తెచ్చుకుంటే, అన్నను ముఖ్యమంత్రి చేసుకుంటే మన పిల్లలను పెద్ద చదువులు చదివిస్తాడని, అందుకు ఎన్ని రూ.లక్షలు ఖర్చయినా తానే భరిస్తాడని చెప్పండి.  

వేమూరు సభలో...
2016 సెప్టెంబర్‌ 8న కేంద్ర మంత్రి అరుణ్‌ జైట్లీ చంద్రబాబుకు సంబంధించిన మంత్రులను, టీడీపీ నాయకులను తన పక్కన కూర్చోబెట్టుకున్నాడు. వీళ్లంతా కలిసి ప్రత్యేక హోదా బదులు ఒక అబద్ధపు ప్యాకేజీపై అరుణ్‌ జైట్లీతో ప్రకటన చేయించారు. జైట్లీ అర్ధరాత్రి ప్రకటన చేస్తే, చంద్రబాబు వెంటనే నిద్రనుంచి లేచి, ఆ ప్యాకేజీ అద్భుతంగా ఉందని పొగిడేశాడు. ప్యాకేజీ అలా ఉంటే బాగుంటుంది, ఇలా ఉంటే బాగుంటుంది అని చంద్రబాబే సలహా ఇచ్చారట! కేంద్రంతో కుమ్మక్కై ఈ ప్రకటన ఎందుకు చేయించారో చెప్పాలని చంద్రబాబును నిలదీస్తున్నా. కేంద్ర ప్రభుత్వాన్ని, నరేంద్రమోదీని, అరుణ్‌జైట్లీని పొగుడుతూ అసెంబ్లీలో ఎందుకు తీర్మానం చేశారని అడుగుతున్నా. ప్రత్యేక హోదా వల్ల ఈశాన్య రాష్ట్రాలు ఏం బాగుపడ్డాయని బాబు అన్నాడు. కోడలు మగబిడ్డ కంటానంటే అత్త వద్దంటుందా? అని వ్యాఖ్యానించాడు.

ప్రత్యేక హోదా కోసం చేసిన ధర్నాలు, నిరాహార దీక్షలు, ఉద్యమాలను నీరుగార్చింది చంద్రబాబు కాదా? హోదా కావాలని అడిగిన పిల్లలపై పీడీ యాక్ట్‌ పెడతానని బెదిరించింది చంద్రబాబు కాదా? ఏపీకి ప్రత్యేక హోదా అవసరం లేదన్న ఆలోచనను కేంద్రానికి చంద్రబాబు కలుగజేయలేదా? ప్రత్యేక హోదా కోసం కేంద్రంపై వైఎస్సార్‌సీపీ అవిశ్వాస తీర్మానం పెట్టకపోతే చంద్రబాబు తాను కూడా అవిశ్వాసం పెట్టాలన్న ఆలోచన చేసేవాడా? హోదా కోసం వైఎస్సార్‌సీపీ లోక్‌సభ సభ్యులు రాజీనామా చేసి, ఆమరణ నిరాహార దీక్షకు కూర్చున్నారు. టీడీపీ ఎంపీలు కూడా రాజీనామా చేసి ఆమరణ నిరాహార దీక్షలో కూర్చుంటే ప్రత్యేక హోదా రాకపోయేదా? అని అడుగుతున్నా. హోదా విషయంలో మోసం చేయడమే కాకుండా ప్రజల సొమ్ముతో ధర్మపోరాట దీక్షలంటూ సినిమా చూపిస్తున్నాడు. అన్ని విషయాల్లోనూ, అన్ని వర్గాల ప్రజలను చంద్రబాబు ఇలాగే మోసాలు చేశాడు. ఎన్నికలు వచ్చేసరికి ఇప్పుడు బాబుకు ఎల్లో మీడియా వంత పాడుతోంది. వీళ్లంతా కలిసి లేనిది ఉన్నట్టు, ఉన్నది లేనట్టు చూపిస్తారు.   

అడ్డగోలుగా అబద్ధాలు: చంద్రబాబు అడ్డగోలుగా అబద్ధాలు చెబుతున్నాడు. డ్వాక్రా మహిళల రుణాలు, రైతుల రుణాలన్నీ మాఫీ చేశానని అంటున్నాడు. నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి కింద 60 నెలలకు గాను ఒక్కొక్కరికి రూ.1.20 లక్షలు బాకీ పడ్డాడు. కానీ అందరికీ ఇచ్చేశానని నమ్మబలుకుతున్నాడు. రాజధానిలో శాశ్వత నిర్మాణాలకు ఒక్క ఇటుక కూడా వేయకుండానే రాజధాని నగరాన్ని కట్టేశానని ఊదరగొడుతున్నాడు. ప్రతి ఊళ్లో కనీసం నాలుగైదు మద్యం బెల్టు దుకాణాలు కనిపిస్తున్నాయి. కిరాణా షాపుల్లోనూ మద్యం అమ్ముతున్నారు. అయినా బెల్టు షాపులన్నీ మూసేశానని చంద్రబాబు చెబుతున్నాడు. అలాగే కాపులను బీసీల్లో, బోయలను ఎస్టీల్లో, మత్స్యకారులను ఎస్టీల్లో చేర్చానని అంటున్నాడు.

వీరికి రిజర్వేషన్లు ఇవ్వకుండానే ఇచ్చేశానని ప్రచారం చేసుకుంటున్నాడు. 2014 నాటి టీడీపీ మేనిఫెస్టోలో చంద్రబాబు అక్షరాలా 650 హామీలిచ్చాడు. ప్రతి కులానికీ ఒక పేజీ కేటాయించాడు, హామీలు అమలు చేయకుండా మోసం చేశాడు. ఆ మేనిఫెస్టో వెబ్‌సైట్‌ నుంచి కనిపించకుండా చేశాడు. ఐదేళ్లపాటు చేసిన మోసాలు, మింగిన లంచాలు చాలవన్నట్టుగా ఇప్పుడు మళ్లీ మోసం చేయాలని చూస్తున్నాడు. ప్రజల భవిష్యత్తు చంద్రబాబు బాధ్యతట! ఇన్ని మోసాలు, అన్యాయాలు చేసిన వ్యక్తి సీఎం పదవిలో కొనసాగడానికి అర్హుడేనా అని అడుగుతున్నా(కాదు కాదు అంటూ జనం కేకలు).  

పంటలకు గిట్టుబాటు ధర దక్కిందా?  
వేమూరు నియోజకవర్గంలో ప్రజలంతా వ్యవసాయంపై ఆధారపడినవారే. మీరు పండించిన వరి, అరటి, కంది, జొన్న, మినుము, పెసర పంటలకు ఈ ఐదేళ్లలో ఎప్పుడైనా గిట్టుబాటు ధర లభించిందా?(లేదు లేదు అంటూ ప్రజల సమాధానం) క్వింటాల్‌కు రూ.10 వేలు పలికితే తప్ప పసుపునకు గిట్టుబాటు ధర రాదు. కానీ, మార్కెట్‌ రేటు చూస్తే రూ.5,500 కూడా లేదు. సాగుకు కృష్ణా జలాలు అందక రైతులు నానా కష్టాలు పడుతున్నారు. వేమూరులో ప్రభుత్వ డిగ్రీ కళాశాల లేదు, జూనియర్‌ కాలేజీ లేదు. చెప్పుకోదగ్గ విద్యాసంస్థ ఒక్కటి కూడా లేదు. మీ కష్టాలు, బాధలు నేను విన్నా. నేనున్నాను అని మీ అందరికీ మాట ఇస్తున్నా.  

అగ్రిగోల్డ్‌ ఆస్తులు కొట్టేయడానికి చీకటి ఒప్పందాలు  
రాష్ట్రంలో అగ్రిగోల్డ్‌ బాధితులు దాదాపు 19 లక్షల మంది ఉన్నారు. పెదబాబు, చినబాబు, వారి అనుచరులు, బినామీలు కలిసి విలువైన అగ్రిగోల్డ్‌ ఆస్తులను సిగ్గులేకుండా కొట్టేశారు. చంద్రబాబు ఢిల్లీలో కూర్చుని అగ్రిగోల్డ్‌లో మిగిలిన ఆస్తులను తక్కువ ధర ఎలా కొట్టేయాలనేదానిపై చీకటి ఒప్పందాలు చేసుకుంటాడు. కేవలం రూ.1,138 కోట్లు ఇస్తే 14 లక్షల మంది అగ్రిగోల్డ్‌ బాధితులకు వారి సొమ్ము వారికి ఇచ్చేయొచ్చు. ఆ సొమ్ము ఇవ్వాలని బాధితులు ధర్నాలు, ఉద్యమాలు చేసినా చంద్రబాబు పట్టించుకోలేదు. ప్రతి అగ్రిగోల్డ్‌ బాధితుడికి నేను చెబుతున్నా.. మీ బాధలు విన్నాను, మీకు నేనున్నాను.  

నేను అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పాలి  
చంద్రబాబుకు సిగ్గు లజ్జా, దమ్ము ధైర్యం ఉంటే నేను అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పాలి. 2014 మార్చి 2న అంటే ఎన్నికలకు ముందే అప్పటి కేంద్ర కేబినెట్‌ ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వడానికి ఆమోదం తెలిపింది, దీన్ని అమలు చేయండి అని సూచిస్తూ ప్రణాళిక సంఘానికి పంపించింది. తర్వాత ఎన్నికలు వచ్చాయి, చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాడు. ఏడు నెలలపాటు.. అంటే 2014 డిసెంబర్‌ 31 దాకా ప్రణాళిక సంఘం మనుగడలోనే ఉంది. ఏపీకి ప్రత్యేక హోదాను అమలు చేయండి అని చంద్రబాబు ఈ ఏడు నెలల్లో ఒక్కసారైనా ప్రణాళికా సంఘాన్ని కలిశాడా? ఒక్క లేఖ అయినా రాశాడా? అని ప్రశ్నిస్తున్నా.  

హోదా కోసం ఏనాడైనా అడిగారా? 
ప్రత్యేక హోదా విషయంలో చంద్రబాబు దగా చేశాడు. మన రాష్ట్రానికి రావాల్సిన హక్కుల కోసం మన ముఖ్యమంత్రి గట్టిగా నిలదీస్తాడని, పోరాడుతాడని మనం అనుకుంటాం. కానీ, జరిగిందేమిటి? ప్రత్యేక హోదా ఐదేళ్లు కాదు, 15 ఏళ్లు తీసుకొస్తానని గత ఎన్నికల ముందు చంద్రబాబు చెప్పాడు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంతో కలిసి నాలుగేళ్లపాటు సంసారం చేశాడు. నాలుగేళ్లు ఇద్దరూ చిలకా గోరింకలకు కూడా అసూయ పుట్టేలా కాపురం చేశారు. టీడీపీ ఎంపీలు కేంద్రంలో బీజేపీ సర్కారులో మంత్రులుగా కొనసాగారు. అయినా బీజేపీ ప్రభుత్వాన్ని, ప్రధాని మోదీని వీళ్లు ఏనాడూ ప్రత్యేక హోదా కోసం అడగలేదు. నాలుగేళ్ల తర్వాత బీజేపీ ప్రభుత్వం నుంచి బాబు విడాకులు తీసుకున్నట్టు ఒక సినిమా చూపించాడు. ప్రత్యేక హోదాకు వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు మళ్లీ అదే హోదా కోసం అంటూ నల్లచొక్కాలు వేసుకుని ధర్మపోరాట దీక్షల పేరిట డ్రామాలు చూపించాడు. పిల్లనిచ్చిన మామ ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచాడు. ఎన్నికలు వచ్చేసరికి అదే ఎన్టీఆర్‌ ఫొటోకు దండలు వేస్తాడు.  

వైఎస్సార్‌సీపీలోకి గుంటూరు జెడ్పీ చైర్‌పర్సన్‌  షేక్‌ జానీమూన్‌
వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వేమూరు పర్యటన సందర్భంగా తెలుగుదేశం, కాంగ్రెస్‌ పార్టీలకు చెందిన పలువురు ప్రముఖులు వైఎస్సార్‌ కాంగ్రెస్‌పార్టీలో చేరారు. గుంటూరు జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ షేక్‌ జానీమూన్‌ తెలుగుదేశం పార్టీని వీడి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. జగన్‌మోహన్‌రెడ్డి ఆమెకు పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. గతంలో మంగళగిరి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీచేసిన మర్రెడ్డి రామకృష్ణారెడ్డి కూడా జగన్‌ సమక్షంలో పార్టీలో చేరారు. నరసరావుపేటకు చెందిన టీడీపీ నేత కపిలవాయి విజయకుమార్, తెనాలి నియోజకవర్గం తూములూరుకు చెందిన వేమూరు డిస్ట్రిబ్యూటరీ కమిటి చైర్మన్‌ కొల్లి రాఘవరెడ్డి టీడీపీని వీడారు. వీరికి కండువాలను కప్పిన జగన్‌మోహన్‌రెడ్డి పార్టీలోకి స్వాగతించారు. తెనాలికి చెందిన ప్రముఖ న్యాయవాది, కాంగ్రెస్‌ పార్టీ మాజీ కౌన్సిలర్‌ హరిదాసు గౌరీశంకర్‌ కూడా జగన్‌ సమక్షంలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు.

వైఎస్‌ జగన్‌  నేటి పర్యటన ఇలా..
కొండెపి, కావలి, పలమనేరు నియోజకవర్గాల్లో ప్రచారం  
వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం మూడు జిల్లాల్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. ఉదయం 9.30 గంటలకు ప్రకాశం జిల్లా కొండెపి నియోజకవర్గంలోని టంగుటూరు, మధ్యాహ్నం 11.30 గంటలకు నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గ కేంద్రం, మధ్యాహ్నం 2 గంటలకు చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గ కేంద్రంలో జరిగే బహిరంగ సభల్లో వైఎస్‌ జగన్‌ ప్రసంగిస్తారని పార్టీ ప్రధాన కార్యదర్శి తలశిల రఘురామ్‌ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top