2019లో రెండు రాష్ట్రాల్లో పోటీ చేస్తాం | Will tour Ananthapur by Karuvu Yatra says Pawan | Sakshi
Sakshi News home page

2019లో రెండు రాష్ట్రాల్లో పోటీ చేస్తాం

Jan 22 2018 7:14 PM | Updated on Mar 22 2019 5:33 PM

Will tour Ananthapur by Karuvu Yatra says Pawan - Sakshi

సాక్షి ప్రతినిధి, కరీంనగర్‌/సాక్షి, జగిత్యాల: వచ్చే ఎన్నికల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లో పోటీ చేస్తామని సినీనటుడు, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ ప్రకటించారు. పార్టీ బలాన్ని, సామర్థ్యాన్నిబట్టి ఎన్ని సీట్లలో పోటీ చేయాలనేది ఎన్నికలకు రెండు నెలల ముందు నిర్ణయిస్తామని స్పష్టం చేశారు. ప్రస్తుతం ఇరు రాష్ట్రాల్లో నెలకొన్న ప్రజా సమస్యలపై అధ్యయనం చేస్తున్నట్లు వెల్లడించారు. ప్రజా చైతన్య యాత్రలో భాగంగా కరీంనగర్‌కు వచ్చిన పవన్‌ కల్యాణ్‌ సోమవారం సాయంత్రం ఇక్కడి ఓ హోటల్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.

తెలంగాణ రాష్ట్రం అంటే తనకెంతో ప్రేమ, ఇష్టమన్న పవన్‌...తెలంగాణపై పూర్తి అవగాహన ఉండి జనసేనతో కలసి వచ్చే మేధావులతో చర్చిస్తున్నానన్నారు. సినిమాలు పక్కనబెట్టి పూర్తిస్థాయి రాజకీయాల్లోకి వస్తున్నానని చెప్పారు. తన ఇలవేల్పు ఆంజనేయస్వామి అని, అందుకే కొండగట్టు ఆంజనేయస్వామి ఆశీర్వాదంతో యాత్ర మొదలు పెడుతున్నానని పేర్కొన్నారు. జనసేన పార్టీలోకి రావడానికి చాలా మంది సిద్ధంగా ఉన్నారని, కార్యకర్తలు, అభిమానులతో సమావేశమై వారి అభిప్రాయాలు సేకరించాకే ఒక నిర్ణయానికి వస్తామని తెలిపారు.

సమస్యలపై కార్యాచరణ....
రెండు రాష్ట్రాల్లో సున్నితమైన సమస్యలు ఉన్నాయని, వాటి పరిష్కారం కోసం కార్యాచరణ రూపొందించి, ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్తామని పవన్‌ కల్యాణ్‌ వివరించారు. రెండు రాష్ట్రాలుగా విడిపోయాక తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రులు చాలెంజింగ్‌గా పనిచేస్తున్నారని పవన్‌ కితాబిచ్చారు. తెలంగాణలో పార్టీ కార్యాలయాన్ని గతంలోనే ఏర్పాటు చేసుకున్నామని, ఆంధ్రప్రదేశ్‌లో పార్టీ కార్యాలయం ప్రారంభించి ఈ నెల 27 నుంచి అనంతపురంలో కరువుపై పరిశీలన యాత్ర చేస్తామన్నారు.

జనసేన పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రతి అడుగునూ నిర్మాణాత్మకంగా వేస్తున్నామని తెలిపారు. తననెవరూ రాజకీయంగా వాడుకోలేదని, ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చే అవసరం తనకు లేదని పవన్‌ స్పష్టం చేశారు. తెలంగాణ సీఎం కేసీఆర్‌ హార్డ్‌వర్కర్‌ అని, తెలంగాణ సాధనలో ఆయన కీలక పాత్ర పోషించారని కొనియాడారు. జనసేన ఆవిర్భావం తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో అప్పటి పరిస్థితులను బట్టి తెలుగుదేశం, బీజేపీలకు మద్దతు ఇచ్చామన్నారు.

‘ఓటుకు కోట్లు’కేసు సున్నితమైందని, అందుకే తానంతగా స్పందించలేదన్నారు. అధికార పార్టీలపై విమర్శలే పనిగా పెట్టుకోబోమని, గొడవ పెట్టుకునే అంశాలున్నా సున్నితంగా వ్యవహరిస్తామన్నారు. జనసేన పార్టీకి చిరంజీవికి ఎలాంటి సంబంధమూ లేదని, భవిష్యత్తులో మద్దతు ఇస్తే ఆలోచిస్తానన్నారు.


కొండగట్టులో పవన్‌ పూజలు...
పవన్‌ కల్యాణ్‌ జగిత్యాల జిల్లా కొండగట్టు అంజన్న సాక్షిగా ప్రజా చైతన్య యాత్రకు శ్రీకారం చుట్టారు. తమ కుటుంబ ఇలవేల్పు ఆంజనేయస్వామి దర్శనం కోసం ఉదయం 10 గంటల ప్రాంతంలో హైదరాబాద్‌ నుంచి బయలుదేరిన పవన్‌ కల్యాణ్‌... షెడ్యూల్‌కన్నా గంటన్నర ముందుగానే మధ్యాహ్నం 1.25 గంటలకు అంజన్న క్షేత్రానికి చేరుకొని దైవ దర్శనం చేసుకున్నారు.

ఈ సందర్భంగా ఆలయ అభివృద్ధికి రూ. 11 లక్షల విరాళం ప్రకటించారు. పూజలు, సన్మానాలతో 33 నిమిషాలపాటు ఆలయంలో గడిపిన పవన్‌... మీడియాతో ఏమీ మాట్లాడకుండానే కరీంనగర్‌ బయలుదేరారు. ఆలయ ప్రాంగణంలో తన వాహనంపైకి ఎక్కి అభిమానులకు అభివాదం చేసి మళ్లీ కారులో కూర్చున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement