ఇన్‌.. ఔట్‌!

Who Will Win in 2019 Elections In  Mahabubnagar - Sakshi

ఉమ్మడి జిల్లాలో వేడెక్కిన రాజకీయం

టీఆర్‌ఎస్‌లో చేరేందుకు సిద్ధమైన కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ దామోదర్‌రెడ్డి

కాంగ్రెస్‌లోకి నాగం రాకపై గుర్రుగా ఉన్న ‘కూచుకుళ్ల’

అధికార పార్టీలో చేరేందుకు ఇప్పటికే కీలక మంత్రి మంతనాలు?

సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్‌ : సాధారణ ఎన్నికలకు సరిగ్గా ఏడాది కాలం ఉండగానే ఉమ్మడి పాలమూరు ప్రాంతంలో రాజకీయాల్లో అనేక మలుపులు చోటు చేసుకుంటున్నాయి. ఈ పరిణామాలతో కొంత కాలంగా స్తబ్దుగా ఉన్న రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్‌రెడ్డి కాంగ్రెస్‌ పార్టీని వీడి టీఆర్‌ఎస్‌లో చేరేందుకు ఇప్పటికే స్పష్టత వచ్చింది. నాగర్‌కర్నూల్‌ నియోజకవర్గానికి చెందిన సీనియర్‌ నేత నాగం జనార్దన్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరడాన్ని కూచుకుళ్ల మొదటి నుంచి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ విషయమై అధిష్టానాన్ని కలిసినా ఫలితం లేకపోవడంతో.. మనస్తాపానికి గురైన తానే పార్టీని వీడేందుకు సిద్ధమయ్యారు.

కాంగ్రెస్‌ అధిష్టానంపై కూచుకుళ్ల అసంతృప్తిగా ఉన్నట్లు తెలియగానే ప్రభుత్వంలో కీలక మంత్రి ఒకరు రంగంలోకి దిగారు. మరోవైపు నారాయణపేట నియోజకవర్గానికి చెందిన టీఆర్‌ఎస్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి కుంభం శివకుమార్‌ ఆ పార్టీని వీడనున్నారు. పేటలో బలమైన నేతగా గుర్తింపు పొందిన శివకుమార్‌ కాంగ్రెస్‌లో చేరేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. శివకుమార్‌ను కాంగ్రెస్‌లోకి తీసుకెళ్లేందుకు మాజీ మంత్రి, గద్వాల ఎమ్మెల్యే డీకే.అరుణ తీవ్ర కసరత్తు చేస్తున్నారు. ఇలా టీఆర్‌ఎస్‌లో ఓ కీలక నేత చేరేందుకు, ఆ పార్టీ నుంచి మరో నేత కాంగ్రెస్‌లో వెళ్లేలా ఏర్పాట్లు జరుగుతుండడంతో ఉమ్మడి పాలమూరు జిల్లా రాజకీయాలు హాట్‌టాఫిక్‌గా మారాయి.

 నాగర్‌కర్నూల్‌లో ఉప్పు – నిప్పు

ఇటీవలి కాలంలో నాగర్‌కర్నూల్‌ నియోజకవర్గంలో చోటు చేసుకుంటున్న రాజకీయ పరిణామాలు ఉమ్మడి జిల్లాలో ఆసక్తికరంగా మారాయి. రాజకీయాల్లో అత్యంత సీనియర్‌గా గుర్తింపు పొందిన నాగం జనార్దన్‌రెడ్డి, ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్‌రెడ్డి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. ఇరువురు ఎన్నికల బరిలో ఆరు సార్లు తలపడ్డారు. తద్వారా ఇరువురి మధ్య రాజకీయ వైరం తారాస్థాయికి చేరింది. అయితే రాష్ట్రంలో, జిల్లాలో చోటు చేసుకుంటున్న రాజకీయ పునరేకీకరణలో భాగంగా నాగం జనార్దన్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరాలని భావించారు. అయితే నాగం రాకను దామోదర్‌రెడ్డి తీవ్రంగా వ్యతిరేకించారు. మాజీ మంత్రి డీకే.అరుణ నేతృత్వంలో ఢిల్లీ వెళ్లి అధిష్టానానికి సైతం ఫిర్యాదు చేశారు.

ఎట్టి పరిస్థితిలో నాగంను చేర్చుకోవద్దని గట్టిగా పట్టుబట్టారు. అయితే తెరవెనుక కాంగ్రెస్‌ కురువృద్ధుడు ఎస్‌.జైపాల్‌రెడ్డి చక్రం తిప్పడంతో నాగం చేరికకు లైన్‌ క్లియర్‌ అయింది. ఈ మేరకు అధిష్టానం కూడా పార్టీలోకి వచ్చే వారిని నిలువరించొద్దని, టిక్కెట్ల విషయం తర్వాత చూద్దామని సర్ది చెప్పింది. అలా నాగం కాంగ్రెస్‌లో చేరడంతో దామోదర్‌రెడ్డి పూర్తిగా మౌనం దాల్చారు. గత కొంత కాలంగా స్తబ్ధుగా ఉన్న ఆయనను టీఆర్‌ఎస్‌లోకి లాగేందుకు ముమ్మర కసరత్తు చేసిన ఓ కీలక మంత్రి ఆ ప్రయత్నంలో సఫలీకృతమయ్యారు. వచ్చే ఎన్నికల్లో నాగంను నిలువరించేందుకు ఏం చేసేందుకైనా సిద్ధంగా ఉన్నట్లు కూచుకుళ్ల సంకేతాలు పంపించడంతో అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ ఆయనను చేర్చుకునేందుకు అంగీకరించగా.. రెండు, మూడు రోజుల్లో చేరిక ఉండొచ్చని చెబుతున్నారు.

శివకుమార్‌కు కాంగ్రెస్‌ గాలం 
నారాయణపేట నియోజకవర్గంలో మాస్‌ ఫాలోయింగ్‌ ఏర్పరుచుకున్న టీఆర్‌ఎస్‌ నేత కుంభం శివకుమార్‌ను కాంగ్రెస్‌లోకి చేర్చుకునేందుకు చకచకా ఏర్పాట్లు జరుగుతున్నాయి. టీఆర్‌ఎస్‌ జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఉన్న శివకుమార్‌ పేట నియోజకవర్గంలో బలమైన నేతగా గుర్తింపు పొందారు. 2014 ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ తరఫున పోటీ చేసి స్వల్ప మెజార్టీతో ప్రస్తత ఎమ్మెల్యే, అప్పటి టీడీపీ అభ్యర్థి రాజేందర్‌రెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు. అయినప్పటికీ పార్టీలో కీలకంగా వ్యవహరిస్తూ ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు. అయితే టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన ఎస్‌.రాజేందర్‌రెడ్డి ఆ తర్వాత పరిణామాల్లో టీఆర్‌ఎస్‌లో చేరారు.

అప్పటి నుంచి శివకుమార్‌కు ప్రాధాన్యం తగ్గుతుండడంతో సైలెంట్‌ అయ్యారు. దీంతో ఇటీవలి కాలంలో జిల్లాకు వచ్చిన మంత్రి కేటీఆర్‌ సైతం శివకుమార్‌ బలాన్ని తెలుసుకుని పార్టీలో మంచి ప్రాధాన్యం ఇస్తామని అయితే నారాయణపేటలో కాంగ్రెస్‌ పార్టీకి బలమైన నేతలు లేకపోవడంతో మాజీ మంత్రి డీకే.అరుణ రంగంలోకి దిగి శివకుమార్‌ను చేర్చుకునేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటి వరకు చాలా ఎన్నికల్లో పేట నియోజకవర్గంలో కాంగ్రెస్‌ జెండాకు స్థానం దక్కలేదు. వచ్చే ఎన్నికల్లో మాత్రం ఖచ్చితంగా పేట నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ పార్టీని గెలిపించి తీరుతానని డీకే.అరుణ అధిష్టానానికి గట్టి హామీ ఇచ్చినట్లు ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలో శివకుమార్‌తో మంతనాలు జరపగా ఆయన నుంచి సానుకూలత వచ్చిందని.. వారం, పది రోజుల్లో శివకుమార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరడం దాదాపు ఖాయమైనట్లేనని పార్టీ వర్గాల్లో ప్రచారం సాగుతోంది.

 కాంగ్రెస్‌లో మళ్లీ ఆధిపత్యపోరు 
ఉమ్మడి జిల్లా కాంగ్రెస్‌ పార్టీలో ఆధిపత్య పోరు మరోసారి తెరపైకి వచ్చింది. కాంగ్రెస్‌ పార్టీలో డీకే అరుణ, ఎస్‌.జైపాల్‌రెడ్డి మధ్య ప్రచ్ఛన్న యుద్ధం నడుస్తోంది. ఒకరు అవునంటే.. మరొకరు కాదంటూ పలు అంశాల్లో విబేధాలు వస్తుండడంతో ఇద్దరి మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది. కాంగ్రెస్‌లో నాగం జనార్దన్‌రెడ్డి చేరికను వ్యతిరేకించిన ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్‌రెడ్డికి డీకే.అరుణ మద్దతుగా నిలిచారు. ఇక నాగంకు సీనియర్‌ నేత ఎస్‌.జైపాల్‌రెడ్డి మద్దతుగా నిలిచి పార్టీలోకి తీసుకున్నారు.

ఈ నేపథ్యంలో జిల్లాలో జైపాల్‌రెడ్డికి చెక్‌ పెట్టేందుకు డీకే.అరుణ వేగంగా పావులు కదుపుతున్నారు. ఈ మేరకు ఉమ్మడి జిల్లాలో తన పట్టు ఏ మాత్రం తగ్గకుండా చూసుకునేందుకు నారాయణపేటలో బలమైన నేతగా గుర్తింపు ఉన్న శివకుమార్‌ను పార్టీలోకి తీసుకునేందుకు రంగం సిద్ధం చేశారు. అయితే నాగం విషయంలో డీకే.అరుణ ఏ విధంగా అడ్డు తగిలారో... అదే మాదిరిగా శివకుమార్‌ విషయంలో కూడా జైపాల్‌రెడ్డి అడ్డుపడుతున్నారనే ప్రచారం సాగుతోంది.

అందుకు అనుగుణంగా నారాయణపేటలో జైపాల్‌రెడ్డి అనుచరులుగా గుర్తింపు ఉన్న సరఫ్‌ కృష్ణ, రెడ్డిగారి రవీందర్‌రెడ్డి ఇద్దరూ కూడా శివకుమార్‌ను పార్టీలో చేర్చుకోవద్దంటూ ఫిర్యాదులు చేశారు. అయితే ఇవేమీ పట్టించుకోకుండా డీకే.అరుణ తన పంతం నెగ్గించుకునేందుకు ఢిల్లీ స్థాయిలో గట్టిగా పట్టుబట్టారు. దీంతో శివకుమార్‌ చేరికకు కాంగ్రెస్‌ అధిష్టానం వద్ద లైన్‌ క్లియర్‌ అయింది. ఇలా శివకుమార్‌ కాంగ్రెస్‌లో చేరడం ఖాయమైనట్లేనని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.  

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top