మోదీకి అధికారం దక్కనివ్వం!

We Will Not Let Modi Come Back To Power: Sonia Gandhi - Sakshi

ఇందుకోసం విపక్షాలన్నీ ఏకమవుతాం

దేశ ప్రజల్లో భయం, ఆందోళన నెలకొన్నాయి

చరిత్రను తిరగరాసే ప్రయత్నం.. ప్రశ్నిస్తే అణచివేతలా?

ఇండియాటుడే సదస్సులో సోనియా గాంధీ  

ముంబై: ప్రధాని మోదీ ప్రభుత్వంలో దేశ పౌరుల్లో భయం, ఆందోళన పెరిగిపోయాయని యూపీఏ చైర్‌పర్సన్, కాంగ్రెస్‌ మాజీ అధినేత్రి సోనియాగాంధీ తీవ్ర ఆరోపణలు చేశారు. మోదీ ప్రభుత్వం దేశాన్ని తిరోగమనంలోకి తీసుకెళ్తోందన్నారు. కాంగ్రెస్, మిత్రపక్షాలన్నీ కలిసికట్టుగా పోరాడి 2019 ఎన్నికల్లో మోదీకి అధికారం దక్కకుండా అడ్డుకుంటామని ఆమె ఉద్ఘాటించారు. ముంబైలో ఇండియాటుడే సదస్సులో పాల్గొన్న సోనియా.. మోదీ సర్కారుపై నిప్పులు చెరిగారు.

ప్రజాస్వామ్యం అంటే ఒక్కరే మాట్లాడటం కాదని.. వ్యవస్థలో భిన్నాభిప్రాయాలు, చర్చ ఉండాలని పరోక్షంగా మోదీనుద్దేశించి వ్యాఖ్యానించారు. మూడున్నరేళ్లుగా దేశ ప్రజల స్వాతంత్య్రం పద్ధతిప్రకారం ప్రమాదంలో పడుతోందని.. భారతీయ మౌళిక సిద్ధాంతాలను పునర్నిర్వచించే ప్రయత్నం జరుగుతోందన్నారు. మూడున్నరేళ్లుగా దేశ చరిత్రను తిరగరాసేందుకు, వాస్తవాలను అబద్ధాలుగా చెప్పే ప్రయత్నం జరుగుతోందని సోనియా విమర్శించారు.

మే, 2014 ముందు దేశంలో భారీగా అవినీతి జరుగుతోందని దుష్ప్రచారం చేశారని.. మరి బీజేపీ అధికారంలోకి వచ్చాక అభివృద్ధి దిశగా వెళ్తోందా? అని ఆమె ప్రశ్నించారు. 2019 ఎన్నికల్లో రాయ్‌బరేలీలో పోటీ చేయటంపై పార్టీదే తుదినిర్ణయమన్నారు. ఈ సదస్సులో దేశంలో ప్రజాస్వామ్యం పాత్ర, ప్రభుత్వం నడుస్తున్న తీరు, దేశవ్యాప్తంగా పరిస్థితులు, ఆమె కుటుంబం, బయటకు తక్కువగా రావటం వంటి విస్తృతాంశాలపై తొలిసారిగా ఆమె మనసువిప్పి మాట్లాడారు.

టార్గెట్‌ ప్రధాని మోదీ
బీజేపీ ప్రభుత్వంలో అందరినీ కలుపుకుపోయే స్ఫూర్తి లేదని సోనియా విమర్శించారు. దీని కారణంగానే వారం రోజులుగా పార్లమెంటు సమావేశాలు రసాభాసగా మారుతున్నాయన్నారు. దేశంలో దళితులు, మహిళలపై అత్యాచారాలు పెరుగుతున్నాయని అయినా వీటిని నియంత్రించటంలో ప్రభుత్వం విఫలమైందని సోనియా విమర్శించారు.

దేశ రాజ్యాంగాన్ని మార్చేందుకు, దేశ ప్రతిష్టను మసకబార్చేందుకు పదేపదే ప్రయత్నాలు జరుగుతున్నాయని తీవ్ర ఆరోపణలు చేశారు. ‘2014కు ముందు దేశం తీవ్రమైన ప్రమాదంలో ఉందా? నాలుగేళ్లలోనే దేశం అభివృద్ధివైపు పరిగెడుతోందా? ప్రజల మేధస్సును అవమానించే ప్రయత్నం కాదా ఇది?’ అని ఆమె ప్రశ్నించారు. ‘జాతి నిర్మాతలను దూషిస్తున్నారు. స్వాతంత్య్రం అనంతరం కాంగ్రెస్‌ పార్టీ, ప్రధానులు సాధించిన విజయాలను రంధ్రాన్వేషణతో తక్కువచేసి చూపించేందుకు ప్రయత్నిస్తున్నారు’ అని అన్నారు.

వాజ్‌పేయితో మోదీని పోల్చలేం: ‘2014 ఎన్నికల్లో మేం నరేంద్ర మోదీ ప్రచారంతో పోటీపడలేకపోయాం. అందుకే ఓటమిపాలయ్యాం. కానీ 2019లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయేను మేం గెలవనివ్వం’ అని ఆమె వెల్లడించారు. ‘మోదీకి నేను సలహాలిచ్చే ధైర్యం చేయను. మోదీ వ్యక్తిగతంగా నాకు తెలియదు. వాజ్‌పేయితో మోదీని పోల్చలేం. వాజ్‌పేయి పార్లమెంటరీ విధానాలను గౌరవించారు. అప్పుడు కూడా మేం రాజకీయ ప్రత్యర్థులమే. చాలా అంశాల్లో భిన్నాభిప్రాయాలుండేవి. కానీ.. సభ సజావుగా సాగింది’ అని సోనియా పేర్కొన్నారు.

ప్రమాదంలో దేశం: ‘అధికార పార్టీనుంచి రెచ్చగొట్టే ప్రకటనలు రావటం ఓ వ్యూహాత్మక విధానంలో భాగం. ఇది రాబోయే ప్రమాదానికి సంకేతం’ అని అన్నారు. ‘ప్రభుత్వ నిర్ణయంతో విభేదించేందుకు, నచ్చింది తినేందుకు స్వేచ్ఛ లేదు. ఓవైపు నిరుద్యోగులు ఉపాధికోసం అలమటిస్తుంటే.. 2017లో ఏడున్నర లక్షల ఉద్యోగాలు సృష్టించామని ప్రకటించటంలో వాస్తవముందా?’ అని ఆమె ప్రశ్నించారు.

ప్రశ్నించే గొంతుకల అణచివేత: ప్రభుత్వ విధానాలను ప్రశ్నిస్తే వారిని అణచివేసే ప్రయత్నాలు జరగుతున్నాయని సోనియా విమర్శించారు. ‘దేశాన్ని బలమైన శక్తిగా నిలిపిన సిద్ధాంతాలు, విధానాలు యథేచ్ఛగా ఉల్లంఘనకు గురవుతున్నాయి. పార్లమెంటులో మెజారిటీని.. చర్చ జరగకుండా అణచివేయటం, చట్టాలను బలవంతంగా అమలుచేసేందుకు ఇచ్చిన లైసెన్స్‌గా భావిస్తున్నారు. విచారణ సంస్థలను దుర్వినియోగం చేస్తూ రాజకీయ ప్రత్యర్థులను లక్ష్యంగా చేసుకుంటున్నారు’ అని సోనియా ఆరోపించారు.

మన్మోహన్‌ నాకన్నా సమర్థుడు: 2004 ఎన్నికల ఫలితాల తర్వాత ప్రధాని మంత్రిగా ఎవరిని నియమించాలనే ప్రశ్న ఎదురైనపుడు.. మన్మోహన్‌ సింగ్‌ కన్నా సమర్థుడైన వ్యక్తి తనకు కనిపించలేదన్నారు. ‘నా పరిమితులు నాకు తెలుసు. నాకన్నా మన్మోహన్‌ సింగ్‌ సమర్థుడైన ప్రధాని అని తెలుసు’ అని స్పష్టం చేశారు. ‘బహిరంగ వేదికలపై సహజంగా మాట్లాడటం నాకు రాదు. అందుకే నన్ను ఓ లీడర్‌ కన్నా రీడర్‌గానే చూస్తారు’ అని తెలిపారు.  

రాజకీయ పార్టీలపై..: భావసారూప్యత ఉన్న పార్టీ్టలు దేశ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని స్థానిక సమస్యలను పరిష్కరించుకోవాలి. ‘కాంగ్రెస్‌ పార్టీ భావసారూప్యత ఉన్న పార్టీల నేతలతో తరచూ సమావేశమవుతోంది. పార్లమెంటులోనూ ఈ పార్టీలతో చక్కటి సమన్వయం ఉంది. అయితే జాతీయస్థాయిలో అందరినీ కలుపుకుని పోవటం అంత సులువేం కాదు. అయినా.. దేశ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ముందుకెళ్తాం’ అని అన్నారు.

ఏం చేయాలో రాహుల్‌కు తెలుసు
‘రాహుల్‌కు తన బాధ్యతలేంటో బాగా తెలుసు. అవసరమైతే నేనున్నా. అంతేగానీ.. అతని ప్రయత్నాల్లో జోక్యం చేసుకోను. యువ రక్తంతో సీనియర్ల అనుభవాన్ని జోడించాలని రాహుల్‌ ఆలోచిస్తున్నారు ’ అన్నారు. భవిష్యత్తులో కాంగ్రెస్‌ పార్టీ పీఠంపై గాంధీ కుటుంబానికి చెందిన వ్యక్తి కాకుండా బయటివారు ఉండేందుకు అవకాశముందని సోనియా పేర్కొన్నారు. ‘ప్రియాంక రాయ్‌బరేలీ, అమేథీలకు పరిమితమైంది. రాజకీయాల్లోకి రావటం ఆమె వ్యక్తిగత నిర్ణయం’ అని ఆమె చెప్పారు. ‘నా గురించి ఆలోచించుకునేందుకు కొంత సమయం దొరికింది. నా భర్త (రాజీవ్‌), అత్త (ఇందిర)లకు సంబంధించిన పాత లేఖలను సేకరిస్తున్నాను. వాటిని డిజిటలైజ్‌ చేయిస్తాను’ అని సోనియా పేర్కొన్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top