కేపీసీసీ పీఠం కోసం కొనసాగుతున్న వార్‌

War Between Leaders For KPCC Presidency Continues In Karnataka - Sakshi

సాక్షి,బెంగళూరు: కేపీసీసీ అధ్యక్ష పీఠం కోసం నేతల మధ్య వార్‌ కొనసాగుతూనే ఉంది. కాంగ్రెస్‌ పార్టీ ట్రబుల్‌ షూటర్, మాజీ మంత్రి డీకే శివకుమార్‌కు కేపీసీసీ పదవి కేటాయిస్తారని అనుకుంటుండగా మాజీ సీఎం సిద్దరామయ్య సామాజిక అడ్డంకులను సాకుగా చూపించడంతో అధిష్టానానికి తలనొప్పిగా మారింది. ఇటు సిద్ధును, అటు డీకేశిని కాదనలేక అధిష్టానం మదనపడుతోంది. ఇప్పటికే ఢిల్లీ వెళ్లి వచ్చిన సిద్ధరామయ్యకు, డీకే శివకుమార్‌కు కేపీసీసీ చీఫ్‌ పదవి ఇస్తామని ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా చెప్పడంతో అందుకు అంగీకరించిన సిద్ధు రాష్ట్రంలో సామాజిక వర్గాలను దృష్టిలో పెట్టుకుని నలుగురికి కేపీసీసీ కార్యాధ్యక్ష పదవులు ఇవ్వాలని కొత్త డిమాండ్‌ను తెరపైకి తీసుకురావడం ద్వారా తన మద్దతుదారులకు పదవులు ఇప్పించే పావులు కదుపుతున్నారు.

దీంతో ఈ వ్యవహారం అధిష్టానానికి తలనొప్పిగా మారింది. మైనార్టీ నాయకుడు, మాజీ మంత్రి జమీర్‌ అహ్మద్‌ ఖాన్‌ను లేదా యూటీ ఖాదర్, ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన సతీశ్‌ జార్కిహోళి, లింగాయత్‌ వర్గానికి చెందిన ఈశ్వర్‌ ఖండ్రే, ఎస్సీ సామాజికి వర్గానికి చెందిన ఆంజనేయ లేదా ధృవనారాయణలను ఎంపిక చేయాలని డిమాండ్‌ పెట్టారు. అయితే నలుగురికి ఇవ్వడం కష్టమని, ఇద్దరికి మాత్రమే ఇస్తామని అధిష్టానం చెప్పినా సిద్ధరామయ్య నిరాకరించారు. నలుగురు కార్యాధ్యక్షుల నియామకానికి మాజీ కేంద్రమంత్రి మల్లికార్జున ఖర్గేతో పాటు మరికొందరు సీనియర్లు వ్యతిరేకించారు. పార్టీ బలోపేతానికి తన నిర్ణయం అధిష్టానం ముందు ఉంచానని, తుది నిర్ణయం రావాల్సి ఉందని సిద్ధు తన సహచరుల వద్ద చెప్పినట్లు సమాచారం.   

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top