తెలంగాణను ఇచ్చింది, తెచ్చింది మేమే.. | Sakshi
Sakshi News home page

Published Sat, Jun 2 2018 2:36 PM

Uttam Kumar Reddy Speech On Telangana Formation day - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది, తెచ్చింది కాంగ్రెస్‌ పార్టీయే అని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి అన్నారు. రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా అమరులకు నివాళ్లు అర్పించి అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ‘ ప్రపంచంలోనే తెలంగాణ ఉద్యమం విశిష్టత నెలకొన్నది. సోనియా గాంధీ దృఢసంకల్పంతో ప్రజల సెంటిమెంట్‌ను గౌరవించి తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారు. అనేక ఇబ్బందులు ఎదుర్కొని రాష్ట్రాన్ని ఇచ్చారు.సోనియాగాంధీ పేరు చరిత్రలో నిలిచిపోతుంది. మన్మోహన్‌, సోనియా, మీరాకుమార్‌లకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు. ఆనాటి అఖిల పక్ష సమావేశంలో పాల్గొనడం మరిచిపోలేను. ఒకే ఒక ఎంపీతో తెలంగాణ వచ్చిందా? సోనియా గాంధీ వల్లనే తెలంగాణ ఏర్పాటు సాధ్యమైంద’న్నారు. 

తెలంగాణ ఏర్పాటు అనంతరం కేసీఆర్‌ ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా  నెరవేర్చలేదనీ, దళిత సీఎం, దళితులకు మూడెకరాల భూమి, కేజీ టు పీజీ పథకాల ఊసే లేదని ఆరోపించారు. రైతులను కేసీఆర్‌ ఆదుకోలేకపాగా.. ఖమ్మం రైతులకు భేడీలు వేయించారని విమర్శించారు. కానీ.. రైతులకు అండగా కాంగ్రెస్‌ ఉద్యమాలు, పోరాటాలు చేసి మద్దతుగా నిలిచిందని పేర్కొన్నారు. అన్ని వ్యవస్థలను తొక్కేసే ప్రయత్నం చేస్తున్నారని,  వారి కుటుంబం మాత్రం బాగుపడితే చాలన్నట్లుగా పరిపాలిస్తున్నారని ఆరోపించారు. ఆ కుటుంబంలోని నలుగురికి తప్పా మిగిలిన తెలంగాణకు దుఃఖమే మిగిలిందని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణలో నిరుద్యోగ యువత పూర్తిగా నైరాశ్యంలో ఉందని పేర్కొన్నారు. తెలంగాణ ప్రజల పక్షాన కాంగ్రెస్‌ ఉంటుందని వచ్చేది కాంగ్రెస్‌ ప్రభుత్వమేనని ఉత్తమ్‌ కుమార్‌ జోస్యం చెప్పారు. 


 

Advertisement

తప్పక చదవండి

Advertisement