రాజకీయ సంక్షోభం | Uttam Kumar Reddy Fires On KCR | Sakshi
Sakshi News home page

రాజకీయ సంక్షోభం

Mar 24 2019 1:07 AM | Updated on Sep 19 2019 8:44 PM

Uttam Kumar Reddy Fires On KCR - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: సీఎం చంద్రశేఖర్‌రావు చర్యలతో రాష్ట్రం రాజకీయ, రాజ్యాంగ, నైతిక సంక్షోభంలో కూరుకుపోయిందని కేంద్ర మాజీ మంత్రి వీరప్ప మొయిలీ ఆరోపించారు. కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణ ఇచ్చింది ప్రజల కోసం కానీ, కేసీఆర్‌ కోసం కాదని ఆయన వ్యాఖ్యానించారు. తెలంగాణ ప్రజలు కేసీఆర్‌ను గెలిపించింది కూడా పరిపాలించాలనిగానీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి రాజ్యాంగాన్ని ఉల్లంఘించమని కాదన్నారు. శనివారం గాంధీ భవన్‌లో ఏర్పాటు చేసిన విలే కరుల సమావేశంలో టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి, సీఎల్పీ నేత భట్టి, పార్టీ రాష్ట్ర వ్యవహా రాల ఇన్‌చార్జి కుంతియా, పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, పార్టీ సీనియర్‌ నేతలు షబ్బీర్‌ అలీ, గీతారెడ్డి, గూడూరు నారాయణరెడ్డి, ఏఐసీసీ కార్యదర్శులు బోసురాజు, శ్రీనివాస కృష్ణన్‌తో కలసి మొయిలీ మాట్లాడారు. చట్టాలకు విరుద్ధంగా, రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఒక రాజ కీయ నిధిని ఏర్పాటు చేసి ఎమ్మెల్యేల కొను గోలు ద్వారా కేసీఆర్‌ శాసన వ్యవస్థను సర్వనాశనం చేస్తున్నారని ఆయన ఆరోపించారు.

ప్రజా స్వామ్యానికి బ్లడ్‌ కేన్సర్‌లా పరిణమించిన ఈ సంస్కృతికి ఫుల్‌స్టాప్‌ పెట్టాలనే ఆలోచనలో ఏఐసీసీ అధ్యక్షుడు ఉన్నారని చెప్పారు. ఆపరేషన్‌ కమలం పేరుతో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఫిరాయింపులను వ్యవస్థీకృతం చేసింద న్నారు. దీన్ని జాతీయ స్థాయిలో చర్చకు తేవాల్సిన అవసరం ఉందన్నారు. కేసీఆర్‌ సాగిస్తున్న అవినీతి ఫిరాయింపులపై లోక్‌పాల్‌ వద్ద ఫిర్యాదు చేస్తామని, లోక్‌పాల్‌ ఏర్పాటైన తర్వాత తొలి ఫిర్యాదు ఇదే అవుతుందని చెప్పారు. పార్టీ మారుతున్నామని చెబుతున్న ఎమ్మెల్యేలు విడుదల చేస్తున్న లేఖలు ఒకే చోట తయారవుతున్నాయని, ఇదే ఈ కేసులో పెద్ద సాక్ష్యం కాబోతుందన్నారు. కేసీఆర్‌ చేతిలో వ్యవస్థలున్నందున ఈ రోజు తప్పించుకోవచ్చు కానీ ఏదో రోజు శిక్ష అనుభవించక తప్పదని మొయిలీ హెచ్చరించారు. ఈ విషయంలో నోటీసులు ఇవ్వకుండా అసెంబ్లీ స్పీకర్‌ను, మండలి చైర్మన్‌ను కేసీఆర్‌ నిలువరించవచ్చు కానీ లోక్‌పాల్‌ను నిలవరించలేరన్నారు. తెలంగాణలో జరుగుతున్న పార్టీ ఫిరాయింపులపై రాజకీయ, న్యాయపరమైన చర్యలు చేపడతామని, దేశంలోని మరే ఇతర ముఖ్యమంత్రి ఇలాంటి ఫిరాయింపులకు పాల్పడకుండా పోరాడతామని చెప్పారు. పార్టీ ఫిరాయింపులపై చట్టంలో ఉన్న లొసుగును ఆసరాగా చేసుకొని కేసీఆర్‌ దుర్మార్గానికి పాల్పడుతున్నారని దుయ్యబట్టారు. ఈ విషయంపై తాము లోక్‌పాల్‌ దగ్గర పోరాడతామన్నారు. 

రాష్ట్రపతిని కలుస్తాం: టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌
అధికార దుర్వినియోగం, ధన ప్రయోగంతో సీఎం కేసీఆర్‌ రాష్ట్రంలో నైతిక విలువలను సర్వనాశనం చేస్తున్నారని టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి దుయ్యబట్టారు. దళితుడు అసెంబ్లీలో, మైనారిటీ నేత మండలిలో ప్రతిపక్ష నాయకులుగా ఉండి ప్రశ్నించడం కేసీఆర్‌కు ఇష్టం లేకనే ఇష్టారాజ్యంగా ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తున్నారని ఆరోపించారు. భూపరిహారం కింద చెల్లించాల్సిన రూ. 26 కోట్లను విడుదల చేస్తామనే హామీతో కొల్లాపూర్‌ ఎమ్మెల్యే హర్షవర్దన్‌రెడ్డి, సాగునీటి కాంట్రాక్టు పనుల బిల్లులిస్తామనే హామీతో పాలేరు ఎమ్మెల్యే కందాల ఉపేందర్‌రెడ్డి పార్టీ నుంచి వెళ్లిపోయారని, మరో ఎమ్మెల్యేకు పెద్ద భూలావాదేవీ విషయంలో ఒప్పందం కుదరడంతో టీఆర్‌ఎస్‌లోకి వెళ్తున్నట్లు ప్రకటించారని ఆరోపించారు. ఇది రాజకీయ అవినీతి కిందకే వస్తుందని, ఈ పార్టీ మార్పుల్లో ఎక్కడా రాజకీయపరమైన అంశం లేదన్నారు. త్వరలోనే ఈ విషయమై రాష్ట్రపతిని కలుస్తామని చెప్పారు. సీఎల్పీ నేత మల్లుభట్టి విక్రమార్క మాట్లాడుతూ రాష్ట్రాన్ని చెప్పుచేతుల్లో ఉంచుకోవాలనే దురుద్దేశంతోనే కేసీఆర్‌ పార్టీ ఫిరాయింపులకు పాల్పడుతున్నారన్నారు. నా రాష్ట్రం–నా ఇష్టం అనే రీతిలో కేసీఆర్‌ చేస్తున్న పాలన ప్రజాస్వామ్యానికి పెను ప్రమాదకరమని, గత ఆరేళ్లుగా పాల్పడుతున్న అవినీతిపై ప్రశ్నించకుండా ఉండేందుకే అసెంబ్లీలో ప్రతిపక్షం లేకుండా చేయాలనే కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement