మోదీ శ్రమిస్తుంటే... సిద్దరామయ్య నిద్ర..

Union Minister Ananth Kumar comments on Yeddyurappa - Sakshi

సంపూర్ణ మెజారిటీతో సీఎం పీఠాన్ని అధిరోహించనున్న యడ్యూరప్ప 

మీట్‌ ది ప్రెస్‌లో కేంద్రమంత్రి అనంతకుమార్‌

శివాజీనగర: దేశవ్యాప్తంగా 21 రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉండటంతో కాంగ్రెస్‌ పార్టీ అధోగతికి చేరుకుందని, ఉత్తరప్రదేశ్, త్రిపుర, హర్యానా తదితర రాష్ట్రాల్లో బీజేపీకి వచ్చిన సీట్లకంటే అత్యధికంగా స్థానాలు వచ్చాయని, అదే విధంగానే ఈసారి రాష్ట్రంలో బీజేపీకి ఊహించిన అత్యధిక మెజారిటీ వస్తుందని కేంద్ర మంత్రి అనంతకుమార్‌ ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. మంగళవారం బెంగళూరు ప్రెస్‌క్లబ్‌లో నిర్వహిచిన మీట్‌ది ప్రెస్‌లో ఆయన మాట్లాడుతూ... స్వాతంత్య్రం వచ్చిన తరువాత 55 ఏళ్ల పాటు సుదీర్ఘ పరిపాలన చేసిన కాంగ్రెస్‌ పరిస్థితి ప్రస్తుతం ఆధ్వాన్న స్థితిలో ఉందన్నారు.

 దేశ ప్రధాని నరేంద్ర మోదీ 18 గంటల పాటు ప్రజల కోసం శ్రమిస్తుంటే సిద్దరామయ్య 18 గంటల పాటు నిద్రపోతున్నారని విమర్శించారు. రాష్ట్రంలో గత ఐదేళ్ల పాలనలో అస్తవ్యస్థంగా శాంతిభద్రతలు, అత్యాచారాలు, హత్యలు, దోపిడీ, దొంగతనాలు అధికమయ్యాయని పేర్కొన్నారు. బీహర్‌లో లాలు ప్రసాద్‌ను సిద్దరామయ్య కూడా అనుసరిస్తూ పరిపాలన చేశారన్నారు. ఓటు బ్యాంకు రాజకీయ చేస్తూ మత ఘర్షణలు సృష్టించటం లాంటి కార్యకలాపాలు అ«ధికంగా కాంగ్రెస్‌ ప్రభుత్వంలో జరిగాయని ఆరోపించారు. 

రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా బాధ్యతలను చేపట్టిన యడ్యూరప్పను సీఎం అభ్యర్థిగా బీజేపీ హైకమాండ్‌ నిర్ణయించిందని, అదే విధంగానే యడ్యూరప్ప సంపూర్ణ మెజారిటితో సీఎం పీఠాన్ని అధిరోహిస్తారని విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. సిద్దరామయ్య బీజేపీ–జేడీఎస్‌ల మధ్య పొత్తు ఉందని ప్రచారం చేస్తున్నారని, అయితే కాంగ్రెస్‌–జేడీఎస్‌ల మధ్య ఉన్న సంబంధాలు లేవని ప్రజలను నమ్మించటానికి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని తెలిపారు.  

 యడ్యూరప్ప శివమొగ్గ జిల్లా శికారిపురలో ఏడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచాడని ఈసారి 50 వేల మెజారిటీతో గెలుపొందుతారని అనంతకుమార్‌ విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. సీఎం సిద్దరామయ్య చాముండేశ్వరిలో ఓటమి తప్పదని తెలుసుకొని బాదామి నుంచి పోటీ చేశారని తెలిపారు. సిద్దరామయ్య రాజకీయ జీవితంలో వలస పక్షిగా ఉన్నాడని, ముందుగా జనతా పార్టీలో ఉండి ఆ తరువాత జనతాదళ, అహింద తరువాత కాంగ్రెస్‌లోకి చేరుకున్నారని విమర్శించారు. కార్యక్రమంలో బెంగళూరు ప్రెస్‌క్లబ్‌ అధ్యక్షుడు సదాశివ శెణై, ప్రధాన కార్యదర్శి కిరణ్, రిపోర్టర్స్‌ గిల్డ్‌ ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్‌ పాల్గొన్నారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top