విజయనగరం టీడీపీలో కొనసాగుతున్న అసమ్మతి జ్వాలలు

Uncertainty In Vizianagaram TDP Over MLA Tickets - Sakshi

సాక్షి, విజయనగరం: జిల్లాలో టీడీపీలో అసమ్మతి జ్వాలలు కొనసాగుతున్నాయి. నేటి నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం అవుతున్నప్పటికీ పలు స్థానాల్లో అభ్యర్థుల ఎంపికపై అనిశ్చితి నెలకొంది. కొన్ని చోట్ల టికెట్లపై స్పష్టత రాకపోవడం.. మరికొన్ని చోట్ల టీడీపీ ప్రకటించిన అభ్యర్థులపై తీవ్ర అసంతృప్తి చెలరేగడం పార్టీకి తలనొప్పిగా మారింది. నెలిమర్ల నియోజకవర్గం టీడీపీ అభ్యర్థి ఎవరనేది ఇంకా స్పష్టత రాలేదు. నియోజకవర్గంలో మరోసారి ఐవీఆర్‌ఎస్‌ ద్వారా సర్వే చేపట్టాలని టీడీపీ భావిస్తోంది. దీంతో ఆశావహులు తమ వంతుగా గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ సీటు కోసం సిట్టింగ్‌ ఎమ్మెల్యే పత్తివాడ నారాయణ స్వామి నాయుడు, భోగాపురం ఎంపీపీ కర్రోతు బంగర్రాజుల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. 

స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలవనున్న త్రిమూర్తులు రాజు..
చీపురుపల్లి నియోజకవర్గం టీడీపీ టికెట్‌ను ఆ పార్టీ అధిష్టానం సిట్టింగ్‌ ఎమ్మెల్యే కిమిడి మృణాళిని కుమారుడు కిమిడి నాగర్జునకు కేటాయించింది. నాగర్జునకు టికెట్‌ కేటాయించడంపై కె త్రిమూర్తులు రాజు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఎలాగైన ఈ సారి ఎమ్మెల్యేగా బరిలో నిలిచేందుకు త్రిమూర్తులు రాజు రంగం సిద్దం చేసుకుంటున్నారు. అందులో భాగంగా సోమవారం స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్‌ దాఖలు చేయనున్నారు.

సిట్టింగ్‌ ఎమ్మెల్యే గీతకు మొండిచేయి...
విజయనగరం టిక్కెట్టుపై ఎన్నో ఆశలు పెట్టుకున్న సిట్టింగ్‌ ఎమ్మెల్యే మీసాల గీతకు మాజీ కేంద్ర మంత్రి, టీడీపీ ఎంపీ అశోక్‌ గజపతి రూపంలో గట్టి షాక్‌ తగిలింది. ఈ స్థానానికి తొలుత గీత, అశోక్‌ కుమార్తె ఆదితి గజపతిరాజు మధ్య పోటీ నెలకొంది. అయితే అశోక్‌ గట్టిగా పట్టుపట్టడంతో ఈ స్థానాన్ని టీడీపీ అధిష్టానం ఆదితికి కేటాయించినట్టుగా ప్రచారం సాగుతోంది. సిట్టింగ్‌ను కాదని ఆదితికి టికెటు కేటాయించడంపై బీసీ నేతలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పార్టీ నిర్ణయం పట్ల ఆగ్రహంతో ఉన్న గీత ఇండిపెండెంట్‌గా పోటీ చేసే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తోంది.

గజపతినగరంలో అసమ్మతి జ్వాలలు..
మరోవైపు గజపతినగరం నియోజకవర్గం టీడీపీలో అసమ్మతి చోటుచేసుకుంది. సిట్టింగ్‌ ఎమ్మెల్యే కొండపల్లి అప్పలనాయుడుకు మళ్లీ టికెట్‌ కేటాయించడంపై తీవ్ర వ్యతిరేకత నెలకొంది. అప్పలనాయుడు సోదరుడు, జిల్లా టీడీపీ ఉపాధ్యక్షుడు కొండపల్లి కొండలరావుకు టికెటు కేటాయించాలని డిమాండ్‌ చేస్తున్నారు. టీడీపీ తనకు కేటాయించని పక్షంలో కొండలరావు స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలువాలని భావిస్తున్నారు. కాగా, జిల్లాలో పూర్తి స్థాయిలో పార్టీ అభ్యర్థులను ప్రకటించకుండానే సీఎం చంద్రబాబు నాయుడు ఎన్నికల ప్రచార సభను నిర్వహించారు.
 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top