కారుకు జై

TRS Party Clean Sweeped In Adilabad District - Sakshi

పదింట తొమ్మిది స్థానాల్లో టీఆర్‌ఎస్‌ విజయం

ఆసిఫాబాద్‌ను గెలుచుకున్న కాంగ్రెస్‌ పార్టీ

‘కారు’ జోరులో కుదేలైన ‘హస్తం’

మంచిర్యాల, నిర్మల్‌లలో గట్టిపోటీ

చెన్నూరు, సిర్పూరు, ఆదిలాబాద్, బోథ్, ముథోల్, ఖానాపూర్‌లలో వన్‌వే..

బెల్లంపల్లిలో పోటీచ్చిన మాజీ మంత్రి వినోద్‌

అసెంబ్లీలో అడుగుపెట్టనున్న ఎంపీ సుమన్‌

ఆదిలాబాద్, ముథోల్‌లో బీజేపీ రెండోస్థానం 

ఊసులో లేని సీపీఐ, టీజేఎస్, బీఎస్పీ, బీఎల్‌ఎఫ్‌

ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా కారుకు జై కొట్టింది. కారు జోరును హస్తం అందుకోలేకపోయింది. రాష్ట్రవ్యాప్తంగా వీచిన టీఆర్‌ఎస్‌ గాలి ఆదిలాబాద్‌ పాత జిల్లాలోనూ కొనసాగింది. కాంగ్రెస్‌కు తిరుగులేదని భావించిన స్థానాల్లో సైతం గులాబీ జెండా ఎగిరింది. ఆదివాసీలు, సింగరేణీయులు, రైతులు, వృద్ధులు, యువతరంతో పాటు అన్ని వర్గాల ప్రజలు టీఆర్‌ఎస్‌నే ఆదరించారు. ఉమ్మడి ఆదిలాబాద్‌లోని పది నియోజకవర్గాల్లో ఆసిఫాబాద్‌ మినహా తొమ్మిది చోట్ల టీఆర్‌ఎస్‌ జయకేతనం ఎగరేసింది. మంత్రులతో పాటు మరో ఆరుగురు తాజా మాజీలు మరోసారి విజయం సాధించారు. సిట్టింగ్‌ ఎమ్మెల్యే నల్లాల ఓదెలును తప్పించి, పెద్దపల్లి ఎంపీ బాల్క సుమన్‌ను పోటీకి నిలిపిన చెన్నూరులో సైతం తొలి నుంచే గులాబీ రెపరెపలాడింది. ఆసిఫాబాద్‌లో మాత్రం కేవలం 171 ఓట్ల స్వల్ప మెజారిటీతో కాంగ్రెస్‌ అభ్యర్థి ఆత్రం సక్కు విజయం సాధించారు. పాత ఆదిలాబాద్‌లోని పది చోట్ల పోటీ చేసిన బీజేపీ కేవలం ఆదిలాబాద్, ముధోల్‌లలో రెండోస్థానంలో నిలవగా, ఖానాపూర్, నిర్మల్‌లలో మెరుగైన ఓట్లు సాధించి ఉనికి చాటుకొంది. మిగతా చోట్ల డిపాజిట్‌ కూడా దక్కించుకోకపోవడం గమనార్హం.

సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్‌:
తొలి రౌండ్‌ నుంచే గులాబీ ఆధిక్యత

శాసనసభ ఎన్నికల కౌంటింగ్‌ మొదలైన పది ని యోజకవర్గాల్లో టీఆర్‌ఎస్‌ మెజారిటీ స్థానాల్లో తొలి రౌండ్‌ నుంచే ఆధిక్యత సాధిస్తూ వచ్చింది. ఖానాపూర్‌లో బీజేపీ,  మంచిర్యాల, నిర్మల్, బోథ్‌లో కాంగ్రెస్‌ తొలుత ఆధిక్యత కనబరిచినా, తరువాత టీఆర్‌ఎస్‌ హవానే కొనసాగింది. మంచిర్యాలలో తొలి మూడు రౌండ్ల వరకు కాంగ్రెస్‌ ఆధిక్యతలో కొనసాగినా, నాలుగో రౌండ్‌ నుంచి టీఆర్‌ఎస్‌ పుంజుకొంది. మధ్యమధ్యలో ఒక్కో రౌండ్‌లో కాంగ్రెస్‌ స్వల్పంగా ఆధిక్యత ప్రదర్శించినా, టీఆ ర్‌ఎస్‌ను అందుకోలేకపోయింది. ఆసిఫాబాద్‌లో కూడా ఇదే పరిస్థితి కొనసాగింది. తొలుత టీఆర్‌ఎస్‌కు లభించిన ఆధిక్యత తరువాత తగ్గి కాంగ్రెస్‌ వైపు సాగింది. చివరికి కాంగ్రెస్‌ విజయం సాధిం చింది. ఆదిలాబాద్, ముథోల్, సిర్పూరు, చెన్నూ రు, బెల్లంపల్లిలో తొలి రౌండ్‌ నుంచి మొదలైన కా రు జోరు చివరి వరకు సాగింది. రికార్డు స్థాయిలో పదింట తొమ్మిది స్థానాల్లో గులాబీ జెండా ఎగిరింది. 

సత్తా చాటిన ఇద్దరు మంత్రులు.. 
ఆదిలాబాద్‌ ఉమ్మడి జిల్లా నుంచి గత ప్రభుత్వంలో మంత్రులుగా వ్యవహరించిన జోగు రామన్న (ఆదిలాబాద్‌), అల్లోల్ల ఇంద్రకరణ్‌ రెడ్డి (నిర్మల్‌) ఘన విజయం సాధించారు. ఆదిలాబాద్‌లో జోగు రామన్న మొదటి రౌండ్‌ నుంచే బీజేపీ అభ్యర్థి పాయల్‌ శంకర్‌పై 26,606 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఇక్కడ టీఆర్‌ఎస్‌కు 74,050 ఓట్లు రాగా, బీజేపీకి 47,444 , కాంగ్రెస్‌ అభ్యర్థి గండ్రత్‌ సుజాతకు 32,200 ఓట్లు మాత్రమే లభించాయి. 
నిర్మల్‌లో హోరాహోరీగా సాగిన పోరులో మంత్రి అల్లోల్ల ఇంద్రకరణ్‌రెడ్డి 79,985 ఓట్లు రాగా, కాంగ్రెస్‌ అభ్యర్థి ఏలేటి మహేశ్వర్‌రెడ్డికి 70,714 ఓట్లు లభించాయి. 9,271 ఓట్ల మెజారిటీతో ఐకే రెడ్డి విజయం సాధించారు. ఇక్కడ తొలి రౌండ్‌లో కాంగ్రెస్‌కు మెజారిటీ లభించినా, రెండో రౌండ్‌ నుంచే టీఆర్‌ఎస్‌ విజయం దిశగా సాగిపోయింది. ఇక్కడ బీజేపీ 16,900 ఓట్లు మాత్రమే సాధించగలిగింది. 

మళ్లీ గెలిచి... నిలిచారు
మంచిర్యాలలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి నడిపెల్లి దివాకర్‌రావు నాలుగోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. కాంగ్రెస్‌ అభ్యర్థి కొక్కిరాల ప్రేంసాగర్‌రావు మూ డేళ్లుగా మంచిర్యాల నియోజకవర్గంలో చేపట్టిన సేవా కార్యక్రమాలు కేసీఆర్‌ హవా ముందు ఉపయోగపడలేదు. 4వేల పైచిలుకు ఓట్లతో దివాకర్‌రావు నాలుగోసారి విజయం సాధించారు. ఆదిలా బాద్‌లో ప్రస్తుత తరంలో సీనియర్‌ రాజకీయవేత్త అల్లోల్ల ఇంద్రకరణ్‌రెడ్డి మరోసారి విజయం సాధించి, తన సత్తా చాటారు. ఆదిలాబాద్‌ చరిత్రలో వరుసగా మూడుసార్లు గెలిచి రికార్డు సృష్టించిన జోగు రామన్న నాలుగోసారి ఎమ్మెల్యే అయ్యారు. సెటిలర్‌ అయినప్పటికీ, నిత్యం ప్రజలతో మమేకమవుతారనే పేరున్న కోనేరు కోనప్ప సిర్పూరు నుంచి మూడోసారి ఎమ్మెల్యే అయ్యారు. బెల్లంపల్లిలో దుర్గం చిన్నయ్య, ముథోల్‌లో జి.విఠల్‌రెడ్డి, బోథ్‌లో రాథోడ్‌ బాపూరావు స్థానికంగా ఉన్న అవరోధాలను అధిగమించి రెండోసారి ఎమ్మెల్యేలుగా గెలిచారు. వివాదాస్పద నియోజకవర్గంగా రాష్ట్రంలోనే అందరి నోళ్లలో నానిన చెన్నూరు నుంచి పోటీచేసిన యువ నాయకుడు, పెద్దపల్లి ఎంపీ బాల్క సుమన్‌ తొలిసారిగా అసెంబ్లీలోకి అడుగు పెట్టబోతున్నారు. ఆసిఫాబాద్‌లో గెలిచిన ఆత్రం సక్కు కూడా మాజీ ఎమ్మెల్యే కావడం విశేషం. 

ఆదివాసీ ప్రాబల్యం ఉన్నప్రాంతాల్లో సైతం..
ఐదు నియోజకవరాలలో ప్రభావం చూపే ఆదివాసీలు, ఇతర గిరిజనులు కేసీఆర్‌నే నమ్మినట్లు ఫలితాల సరళిని బట్టి తెలుస్తోంది. ఆదివాసీ ఆందోళనలతో ఏడాదిన్నర కాలం అట్టుడికిన ఆదిలాబాద్‌లో ఆ ప్రభావం ఎన్నికలపై పడుతుందని చేసిన అంచనాలు తలకిందులయ్యాయి. ఆదివాసీ ప్రాంతాల్లో కూడా ఆసిఫాబాద్‌ మినహా మిగతా చోట్ల టీఆర్‌ఎస్‌ ఘన విజయం సాధించింది. ఆసిఫాబాద్‌లో కాంగ్రెస్‌ అభ్యర్థి ఆత్రం సక్కు మాత్రమే కేవలం 170 ఓట్ల స్వల్ప మెజారిటీతో విజయం సాధించారు. సిర్పూరులో ఆదివాసీలు సైతం టీఆర్‌ఎస్‌కే పట్టం కట్టారు. 

బోథ్‌లో తుడుందెబ్బ రాష్ట్ర అధ్యక్షుడు సోయం బాపూరావు కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేసినప్పటికీ, టీఆర్‌ఎస్‌ అభ్యర్థి రాథోడ్‌ బాపూరావు చేతిలో 6,639 ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఇక్కడ స్వతంత్ర అభ్యర్థిగా ఉన్న కాంగ్రెస్‌ రెబల్‌ జాదవ్‌ అనిల్‌కుమార్‌ భారీగా ఓట్లు సాధించడం సోయం బాబూరావుకు నష్టం కలిగించింది. అనిల్‌కు 27,988 ఓట్లు రావడంతో చీలిన ఓట్ల కారణంగా సోయం బాపూరావు పరాజయం పొందారు.
ఖానాపూర్‌లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి రేఖా నాయక్‌ 20,722 ఓట్ల మెజారిటీతో కాంగ్రెస్‌ అభ్యర్థి రాథోడ్‌ రమేష్‌పై విజయం సాధించారు. ఇక్కడ ఆదివాసీలు బీజేపీ అభ్యర్థి సట్ల అశోక్‌కు అండగా నిలిచారు. అశోక్‌కు 23,770 ఓట్లు పోలు కావడం గమనార్హం. 
అడవుల్లో సాగు చేసుకుంటున్న గిరిజనులకు పట్టాలు రావడం, రైతుబంధు కింద ఎకరానికి రూ.4వేలు వస్తుండడంతో గిరిజనులు మళ్లీ కారుకే తమ ఓటు వేసినట్లు తెలుస్తోంది. రాత్రి వరకు క్యూలైన్లలో నిలబడి పడిన ఓట్లన్నీ టీఆర్‌ఎస్‌కేనని స్పష్టమైంది. సిర్పూరు, బోథ్, ముథోల్, బెల్లంపల్లిలోని గిరిజన గ్రామాల్లో ఈ పరిస్థితి కనిపించింది.

సింగరేణీయులు కారుకే..
మంచిర్యాల జిల్లాలోని శ్రీరాంపూర్, మందమర్రి, బెల్లంపల్లి, కాసిపేట, తాండూర్, కుమురం భీం జిల్లా గోలేటి, రెబ్బెన ప్రాంతాల్లోని సింగరేణి కుటుంబాలన్నీ గంపగుత్తగా టీఆర్‌ఎస్‌కే ఓటేసినట్లు సరళిని బట్టి తెలుస్తోంది. మంచిర్యాలలో టీఆర్‌ఎస్‌ గెలుపు సింగరేణి ప్రాంతం ఓట్లతోనే సాధ్యమైందని స్పష్టమవుతోంది. దీంతో మంచిర్యాల, చెన్నూరు, బెల్లంపల్లి నియోజకవర్గాలు మూడింట టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు ఘన విజయం సాధించారు. పట్టణ ఓటర్లు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు, వ్యాపారులు, ప్రైవేటు రంగంలో పనిచేస్తున్న వారు కూడా టీఆర్‌ఎస్‌కే ఓట్ల పట్టం కట్టారని స్పష్టమవుతోంది. 
మంచిర్యాలలో తొలి రౌండ్లలో కాంగ్రెస్‌ ఆధిక్యంలో ఉన్నప్పటికీ, తరువాత టీఆర్‌ఎస్‌కు అధిక ఓట్లు పోలవడంతో ఆ పార్టీ మెజారిటీ కొనసాగింది. స్వల్ప మెజారిటీతో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి నడిపెల్లి దివాకర్‌రావునే విజయం వరించింది.
చెన్నూరులో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి, పెద్దపల్లి ఎంపీ బాల్క సుమన్‌ తొలి రౌండ్‌ నుంచే ఆధిక్యత ప్రదర్శించారు. ఆయన సమీప ప్రత్యర్థి బోర్లకుంట వెంకటేష్‌ నేతపై 24,286 ఓట్ల తేడాతో విజయం సాధించారు. టీఆర్‌ఎస్‌కు 56,280 ఓట్లు రాగా, కాంగ్రెస్‌కు 31,994 ఓట్లు లభించాయి.
మాజీ మంత్రి గడ్డం వినోద్‌ బీఎస్‌పీ అభ్యర్థిగా పోటీ చేసిన బెల్లంపల్లి రాష్ట్రంలో చర్చనీయాం శం కాగా, ఇక్కడ కూడా టీఆర్‌ఎస్‌ తొలి రౌండ్‌ నుంచే ఆధిక్యత ప్రదర్శిస్తూ వచ్చింది. బెల్లంపల్లిలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి దుర్గం చిన్నయ్య 10, 107 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. 

బీజేపీ బొక్కబోర్లా!
2014 ఎన్నికల్లో ఆదిలాబాద్, ముథోల్‌లలో రెం డో స్థానంలో నిలిచిన బీజేపీ ఈసారి కూడా ఆ ని యోజకవర్గాల్లో అవే స్థానాలకు పరిమితమైంది. ఆదిలాబాద్‌లో పాయల్‌ శంకర్, ముథోల్‌లో రమాదేవి గట్టిపోటీ ఇచ్చినప్పటికీ, ఏ రౌండ్‌లోనూ టీఆర్‌ఎస్‌ కన్నా అధిక ఓట్లు రాబట్టలేకపోయారు. ఆదిలాబాద్‌లో 47,444 ఓట్లు సాధించిన బీజేపీ, ముథోల్‌లో 40,339 ఓట్లు పొందింది. ఖానాపూర్‌లో ఆదివాసీ వర్గం నుంచి పోటీలో నిలిచిన సట్ల అశోక్‌ ఐదు రౌండ్ల వరకు ఆధిక్యతలో కొనసాగినప్పటికీ, తరువాత టీఆర్‌ఎస్, కాం గ్రెస్‌ మొదటి రెండు స్థానాల్లోకి ఎగబాకాయి. నిర్మల్‌లో పోటీ చేసిన సువర్ణరెడ్డి కేవలం 16,900 ఓట్ల కే పరిమితమయ్యారు. పట్టణ ఓటర్లు కూడా బీజేపీని ఆదరించలేదని తెలుస్తోంది. మిగతా నియోజ కవర్గాల్లో ఎక్కడా కనీసం పోటీ ఇవ్వలేకపోయిం ది. మంచిర్యాల బరిలోకి దిగిన వెరబెల్లి రఘునాథరావు గత ఎన్నికల్లో బీజేపీ సాధించిన ఓట్ల లోసగం కూడా తెచ్చుకోలేక డిపాజిట్‌ కోల్పోయారు. 

ప్రభావం చూపని బీఎస్‌పీ, బీఎల్‌ఎఫ్‌ 
బెల్లంపల్లిలో గెలుపు గుర్రంగా చివరి నిమిషంలో బీఎస్‌పీ గుర్తు మీద బరిలోకి దిగిన గడ్డం వినోద్‌ ఒక్కరే టీఆర్‌ఎస్‌ అభ్యర్థి దుర్గం చిన్నయ్యకు గట్టిపోటీ ఇచ్చారు. ఇక్కడ పదివేల ఓట్ల తేడాతో వినోద్‌ పరాజయం పాలయ్యారు. మిగతా ఏ నియోజకవర్గంలో కూడా బీఎస్‌పీ అభ్యర్థులు గానీ బీఎల్‌ఎఫ్‌ అభ్యర్థులు గానీ ప్రభావం చూపలేదు. చెన్నూరులో కాంగ్రెస్‌ టికెట్టు రాక బీఎల్‌ఎఫ్‌ నుంచి పోటీపడ్డ మాజీ మంత్రి బోడ జనార్ధన్‌ కేవలం 926 ఓట్లకే పరిమితమయ్యారు. ఇక్కడ ఇండిపెండెంట్‌గా పోటీచేసిన సోగాల సంజయ్‌కు 6,274 ఓట్లు సాధించడం గమనార్హం. అదే తరహాలో మరికొన్ని నియోజకవర్గాల్లో బీఎస్‌పీ, బీఎల్‌ఎఫ్‌ అభ్యర్థుల కన్నా స్వతంత్రులకే ఎక్కువ ఓట్లు పోలయ్యాయి. 

సోదిలో లేని మహాకూటమి పక్షాలు 
కాంగ్రెస్‌తో కలిసి మహాకూటమిగా ఏర్పాటైన టీడీపీ, సీపీఐ, టీజేఎస్‌ ఉమ్మడి జిల్లాలో ప్రభావం చూపలేదు. బెల్లంపల్లిలో పోటీ చేసిన సీపీఐ కేవలం 3,600 ఓట్లకే పరిమితం అయింది. ఆసిఫా బాద్, ఖానాపూర్‌లో కాంగ్రెస్‌ ఉన్నప్పటికీ, ఫ్రెండ్లీ ఫైట్‌ పేరుతో బరిలో నిలిచిన టీజేఎస్‌ కనీస ఓట్లు కూడా సాధించలేదు. ఆసిఫాబాద్‌లో కోదండరాం వచ్చి ప్రచారం చేసినప్పటికీ ఆ పార్టీ అభ్యర్థి విజయ్‌కు 6,183 ఓట్లు మాత్రమే లభించాయి. ఖానాపూర్‌లో భీంరావు 2,412 ఓట్లు సాధించారు. టీడీపీ నుంచి మంచిర్యాలలో మినహా పెద్ద గాకూటమి అభ్యర్థులకు సహకారం అందలేదు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top