అదిరేలా ఆరంభ సభ..!

Trs meeting at siddipet - Sakshi

హుస్నాబాద్‌లో నేడు కేసీఆర్‌ ఎన్నికల శంఖారావం

మధ్యాహ్నం 2.30 గంటలకు సభ

సాక్షి, సిద్దిపేట: అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికలకు వెళ్లేందుకు సిద్ధమైన టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ ఎప్పటిలాగే తన సెంటిమెంట్‌ సభకు సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌ను ఎంపిక చేసుకున్నారు. శుక్రవారం హుస్నాబాద్‌లో జరిగే ఎన్నికల ఆరంభ సభ అదిరేలా మంత్రి హరీశ్‌రావు, స్థానిక ఎమ్మెల్యే ఒడితల సతీశ్‌కుమార్‌లు అన్ని ఏర్పాట్లూ పూర్తి చేశారు.

ఎన్నికలకు వెళ్లేందుకు ముందుగా అభ్యర్థులను ప్రకటించిన కేసీఆర్‌.. అదే ఊపుతో పాల్గొనే హుస్నాబాద్‌ సభను విజయవంతం చేయడం టీఆర్‌ఎస్‌ శ్రేణులకు కీలకం కాగా.. ఇది ఎన్నికల తొలి ప్రచార సభ కావడంతో రాష్ట్రవ్యాప్తంగా అందరిచూపూ హుస్నాబాద్‌పైనే ఉంది. ఈ సభ భారీ స్థాయిలో ఉంటుందని, దీని ద్వారా నాయకులు, కార్యకర్తల్లో కేసీఆర్‌ ఉత్సాహాన్ని నింపుతారని పార్టీ ప్రముఖులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.  

హుస్నాబాద్‌ నుంచి ఎన్నికల శంఖారావం
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత రెండవసారి జరగనున్న సార్వత్రిక ఎన్నికలకు సీఎం కేసీఆర్‌ హుస్నాబాద్‌ నుంచి సమర శంఖం పూరించనున్నారు. ఇక్కడ మొదలు పెట్టిన ఎన్నికల సభలను నిరంతరాయంగా 50 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా 100 నియోజకవర్గాల్లో నిర్వహించనున్నారు. నాలుగేళ్లలో ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించడంతోపాటు.. కొత్త హామీలు, గెలిచిన తర్వాత చేయబోయే పనులను ప్రజలకు వివరించనున్నారు. అలాగే స్థానిక టీఆర్‌ఎస్‌ అభ్యర్థి ఒడితల సతీశ్‌కుమార్‌ను గెలిపించాలని ఈ సభ ద్వారా ప్రజలను అభ్యర్థించనున్నారు. సభకు జనాన్ని తరలించే బాధ్యతను హరీశ్‌రావు, ఈటల రాజేందర్‌తోపాటు, కొందరు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలకు అప్పగించారు.  

గజ్వేల్‌ నుంచి నేరుగా సభకు..  
హుస్నాబాద్‌ సభకు సీఎం కేసీఆర్‌ హెలికాప్టర్‌ ద్వారా వచ్చేలా అన్ని ఏర్పాట్లు చేశారు. కేసీఆర్‌ గజ్వేల్‌ నుంచి మధ్యాహ్నం 2.30కు నేరుగా సభా ప్రాంగణా నికి రానున్నారు. 2 గంటలపాటు సభ ఉంటుందని నిర్వాహకులు తెలిపారు. అనంతరం కేసీఆర్‌ హెలికాప్టర్‌ ద్వారా నేరుగా హైదరాబాద్‌ తిరిగి వెళ్తారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top