తెలంగాణ ప్రయోజనాలే పరమావధి

TRS to adopt cautious approach with BJP-led govt at Centre - Sakshi

విభజన హామీలపై కేంద్రాన్ని కోరాలి

టీఆర్‌ఎస్‌ ఎంపీలకు కేసీఆర్‌ ఉపదేశం

టీఆర్‌ఎస్‌పీపీ నేతగా కేకే, లోక్‌సభాపక్ష నేతగా నామా

ఉభయసభలకు ఉప నేతలు, విప్‌ల ఏకగ్రీవ ఎన్నిక

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలే పరమావధిగా కేంద్ర ప్రభుత్వంతో వ్యవహరించాలని టీఆర్‌ఎస్‌ ఎంపీలకు ఆ పార్టీ అధినేత కేసీఆర్‌ ఉద్బోధించారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఎంపీలు పని చేయాలని ఆదేశించారు. ఉమ్మడి ఆంధ్రఫ్రదేశ్‌ పునర్విభజన చట్టంలోని హామీలు నెరవేరే వరకు కేంద్రంతో సంప్రదింపులు కొనసాగించాలని, అన్ని రంగాల్లో తెలంగాణ అభివృద్ధే ధ్యేయంగా కేంద్ర ప్రభుత్వంతో వ్యహరించాలని సూచించారు. ఈ నెల 17 నుంచి పార్లమెంటు సమావేశాలు మొదలవుతున్న నేపథ్యంలో గురువారం ప్రగతి భవన్‌లో టీఆర్‌ఎస్‌ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది. టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఆ పార్టీ లోక్‌సభ, రాజ్యసభ సభ్యులు పాల్గొన్నారు. పార్లమెంటు సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. కేంద్ర ప్రభుత్వంతో సామరస్య ధోరణితో వ్యవహరించాలని కేసీఆర్‌ ఈ సందర్భంగా ఎంపీలకు సూచించారు. నిరంతర సంప్రదింపుల ప్రక్రియతో రాష్ట్ర ప్రయోజనాలను నెరవేర్చుకోవాలని ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వపరంగా రాష్ట్రానికి వచ్చే నిధులు, నిర్ణయాల విషయంలో ఆయా మంత్రిత్వశాఖలతో నిత్యం సంప్రదింపులు జరపాలని సూచించారు.  

ఏకగ్రీవంగా ఎన్నిక...
లోక్‌సభ కొత్తగా కొలువుదీరుతున్న నేపథ్యంలో టీఆర్‌ఎస్‌ పార్లమెంటరీపక్ష ఎన్నికల ప్రక్రియను ఈ సమావేశంలో పూర్తి చేశారు. టీఆర్‌ఎస్‌ పార్లమెంటరీ పార్టీ నేతగా కె. కేశవరావును తిరిగి ఎన్నుకున్నారు. రాజ్యసభలోనూ టీఆర్‌ఎస్‌పక్ష నేతగా కేశవరావు వ్యవహరిస్తారు. లోక్‌సభలో టీఆర్‌ఎస్‌పక్ష నేతగా ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వర్‌రావు ఎన్నికయ్యారు. అలాగే లోక్‌సభలో టీఆర్‌ఎస్‌ ఉప నేతగా మెదక్‌ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, విప్‌గా జహీరాబాద్‌ ఎంపీ బి.బి.పాటిల్‌ను ఎన్నుకున్నారు. రాజ్యసభలో టీఆర్‌ఎస్‌పక్ష ఉప నేతగా బండ ప్రకాశ్, విప్‌గా జోగినిపల్లి సంతోష్‌కుమార్‌ ఎన్నికయ్యారు. టీఆర్‌ఎస్‌ పార్లమెంటరీ పార్టీ నాయకుల ఎన్నిక సమాచారంతో టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ పార్లమెంటరీ వ్యవహారాలశాఖ మంత్రి ప్రహ్లాద్‌ జోషీకి లేఖ రాశారు.
 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top