మళ్లీ ఢిల్లీకి హస్తం నేతలు!

Tpcc Screening Committee meeting today - Sakshi

హస్తిన బాట పట్టిన టీపీసీసీ ముఖ్యులు

నేడు స్క్రీనింగ్‌ కమిటీ సమావేశం..

సందిగ్ధత ఉన్న స్థానాల్లో అభ్యర్థుల ఖరారు

రేపు ఏఐసీసీ ఎన్నికల కమిటీ సమావేశం..

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర కాంగ్రెస్‌ నేతలు మళ్లీ ఢిల్లీ పయనమయ్యారు. రానున్న ఎన్నికల్లో పోటీచేసే పార్టీ అభ్యర్థులను ఖరారు చేసేందుకు అధిష్టానంతో చర్చల కోసం సోమవారం రాత్రి కొందరు, మంగళవారం ఉదయమే కొందరు హస్తిన బయల్దేరారు. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌తో పాటు ముఖ్య నేతలు జానారెడ్డి, భట్టి విక్రమార్క, షబ్బీర్‌ అలీ, పొన్నం ప్రభాకర్, రేవంత్‌రెడ్డి, రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇంచార్జి కుంతియా, ఏఐసీసీ కార్యదర్శులు బోసురాజు, శ్రీనివాస కృష్ణన్, సలీం అహ్మద్‌లు ఈ చర్చల్లో పాల్గొననున్నారు. కాగా, మంగళవారం భక్తచరణ్‌దాస్‌ నేతృత్వంలోని స్క్రీనింగ్‌ కమిటీతో టీపీసీసీ ముఖ్యులు సమావేశం కానున్నారు.

స్పష్టత వచ్చిన 54 స్థానాలను వదిలేసి సందిగ్ధత ఉన్న స్థానాల్లో అభ్యర్థులను ఖరారు చేయడంపై చర్చించనున్నారు. రెండు, మూడు పేర్లు పరిశీలనలో ఉన్న స్థానాల్లో టికెట్‌ ఎవరికి కేటాయించాలనే దానిపై అన్ని కోణాల్లో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. ఈ సమావేశంలో పార్టీ పోటీ చేయాలనుకుంటున్న అన్ని స్థానాల అభ్యర్థులపై స్పష్టత వచ్చాక జాబితాను ఏఐసీసీ ఎన్నికల కమిటీకి అందజేస్తారు. ఈ కమిటీ సమావేశం బుధవారం జరగనుంది. ఇందులో అన్ని స్థానాల అభ్యర్థిత్వాలపై మరోసారి చర్చించి తుది జాబితా ఖరారు చేస్తారని గాంధీభవన్‌ వర్గాలు తెలిపాయి. ఇదంతా ఓ కొలిక్కి వచ్చాక 8న రాహుల్‌ ఆమోదముద్ర తీసుకుని 9న అభ్యర్థులను ప్రకటించనున్నట్లు సమాచారం.

మిత్రులకిచ్చే స్థానాల జాబితాతో ఢిల్లీకి
సోమవారం అర్ధరాత్రి వరకు కూటమి భాగస్వామ్య పక్షాలైన టీడీపీ, టీజేఎస్, సీపీఐలతో చర్చలు జరి పిన టీపీసీసీ నేతలు.. మిత్రపక్షాలకు ఇవ్వాలని నిర్ణయించిన స్థానాల జాబితాను తీసుకుని ఢిల్లీ వెళ్లారు. అధిష్టానం వద్ద జరిగే చర్చల్లో మిత్రపక్షాలకిచ్చే స్థానాలను వదిలేసి పార్టీ పోటీచేయాలని నిర్ణయిం చిన చోట్ల అభ్యర్థులను ఖరారు చేయనున్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top