సింగిల్‌గానే కాంగ్రెస్‌! | TPCC Party Ready For Municipal Elections In Telangana | Sakshi
Sakshi News home page

సింగిల్‌గానే కాంగ్రెస్‌!

Dec 24 2019 2:37 AM | Updated on Dec 24 2019 2:37 AM

TPCC Party Ready For Municipal Elections In Telangana - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కనీసం సగం పురపాలికల్లో పాగా వేయడమే లక్ష్యంగా ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్‌ పార్టీ పావులు కదుపుతోంది. మున్సిపాలిటీల వారీ మేనిఫెస్టోలు, రాష్ట్రస్థాయిలో మరో మేనిఫెస్టో, యువతకు టికెట్ల కేటాయిం పులో పెద్దపీట, టీఆర్‌ఎస్‌ అసంతృప్తులపై గురి, సామాజిక వర్గాల వారీగా తగిన ప్రాధాన్యం, స్థానిక సమస్యలపై స్పష్టమైన విధానం, పార్టీ నేతల మధ్య ఐక్యత అంశాలే ప్రాతిపదికగా ఆ పార్టీ మున్సిపల్‌ ఎన్నికలకు సిద్ధమవుతోంది. ఎన్నికల షెడ్యూల్‌ కూడా రావడంతో తన కసరత్తును టీపీసీసీ మరింత ముమ్మరం చేయనుంది.

అవసరాన్ని బట్టి ‘స్థానికం’గా.. 
ఈ మున్సిపల్‌ ఎన్నికలను ఒంటరిగానే ఎదుర్కో వాలని కాంగ్రెస్‌ భావిస్తోంది. ప్రతిపక్షాలతో రాష్ట్రస్థాయిలో పొత్తులు పెట్టుకుని సీట్లు పంచుకునే దానికంటే అవసరాన్ని బట్టి స్థానికంగా టీజేఎస్, కొన్నిచోట్ల వామపక్షాలను కలుపుకుని పోవాలని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. మున్సిపల్‌ ఎన్నికల షెడ్యూల్‌ వెలువడిన తరుణంలో దీనిపై త్వరలోనే టీపీసీసీ ఓ నిర్ణయం తీసుకుంటుందని గాంధీభవన్‌ వర్గాలు చెబుతున్నాయి.

అసంతృప్తిని సొమ్ము చేసుకోవాల్సిందే.. 
ఈసారి అధికార టీఆర్‌ఎస్‌ను ధీటుగా ఎదుర్కొనేందుకు రెండు రకాల అసంతృప్తులు సద్వినియోగం చేసుకోవాలని టీపీసీసీ నేతలు భావిస్తున్నారు. ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లోని ప్రజల్లో అధికార టీఆర్‌ఎస్‌పై ఉన్న అసంతృప్తిని ఓట్ల రూపంలో మలుచుకోవాలని, అదేవిధంగా అంతర్గతంగా టీఆర్‌ఎస్‌లో ఉన్న అసంతృప్తిని కూడా తమకు అనుకూలంగా మలచుకోవాలని యోచిస్తోంది. టీఆర్‌ఎస్‌లో టికెట్లు రాకుండా అసంతృప్తితో ఉండే నేతలకు గాలం వేసి వారికి అవకాశం ఇవ్వడం ద్వారా టీఆర్‌ఎస్‌ నుంచి కొంత కేడర్‌ను పార్టీలో ఇముడ్చుకోవడంతో పాటు ఆ నాయకుల చరిష్మా, పార్టీ ఇమేజ్‌ ఆధారంగా అధికార పార్టీపై పైచేయి సాధించాలనేది ఆ పార్టీ వ్యూహంగా కనిపిస్తోంది.

ఉమ్మడి బాధ్యతతోనే విజయం 
ఇక ఈ ఎన్నికల్లో విజయం కోసం సమష్టి కృషి చేయాలని, ఈ నెల రోజుల పాటు కీలక నేతలంతా మున్సిపాలిటీల్లో ఉండి పనిచేయాలని నిర్ణయించారు. అభ్యర్థుల ఖరారుతో పాటు ఎన్నికల్లో విజయం చేకూర్చే బాధ్యతలను డీసీసీ అధ్యక్షులు, పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, గత ఎన్నికల్లో పార్టీ తరఫున పోటీ చేసిన వారికే అప్పగిస్తోంది. మున్సిపాలిటీల వారీగా ఇప్పటికే సమావేశాలు నిర్వహిస్తోన్న కాంగ్రెస్‌ స్థానిక సమస్యలపై అవగాహన ఉన్న స్థానిక తటస్థులతో కమిటీ ఏర్పాటు చేసి మున్సిపాలిటీల వారీగా మేనిఫెస్టోలు తయారు చేయాలని యోచిస్తోంది.

టికెట్ల ఎంపికలో సామాజిక న్యాయాన్ని పాటించాలని, బీసీలకు సగం సీట్లు ఇవ్వాలని, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు కూడా తగిన స్థాయిలో ప్రాతినిధ్యం ఇవ్వాలని భావిస్తోంది. ఎన్నికల షెడ్యూల్‌ వెలువడిన తరుణంలో మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్, మాజీ ఎమ్మెల్యేలు సంపత్, వంశీచందర్‌రెడ్డిల ఆధ్వర్యంలోని టీపీసీసీ మున్సిపల్‌ ఎన్నికల కమిటీ మంగళవారం గాంధీభవన్‌లో భేటీ అయి కార్యాచరణ రూపొందించనుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement