స్థానిక ఎమ్మెల్సీ ఎన్నికలపై హైకోర్టుకు..  | TPCC decision to go High Court about Local MLC Elections | Sakshi
Sakshi News home page

స్థానిక ఎమ్మెల్సీ ఎన్నికలపై హైకోర్టుకు.. 

May 12 2019 2:30 AM | Updated on May 12 2019 8:29 AM

TPCC decision to go High Court about Local MLC Elections - Sakshi

శనివారం గాంధీభవన్‌లో జరిగిన సమావేశంలో పాల్గొన్న టీపీసీసీ నేతలు ఉత్తమ్, కుంతియా, జానారెడ్డి, పొన్నాల లక్ష్మయ్య, పొన్నం ప్రభాకర్‌ తదితరులు

సాక్షి, హైదరాబాద్‌: స్థానికసంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల రద్దు కోరుతూ కాంగ్రెస్‌ పార్టీ న్యాయస్థానాన్ని ఆశ్రయించనుంది. హైకోర్టులో వెకేషన్‌ బెంచ్‌కుగానీ, లంచ్‌మోషన్‌ ద్వారా చీఫ్‌ జస్టిస్‌ బెంచ్‌కుగానీ పిటిషన్‌ దాఖలు చేయాలని ఆ పార్టీ నేతలు నిర్ణయించారు. అదే సమయంలో సుప్రీంకోర్టులో కూడా పిటిషన్‌ దాఖలు చేయనున్నారు. ఈ మేరకు శనివారం గాంధీభవన్‌లో జరిగిన పార్టీ సీనియర్‌ నేతల సమావేశంలో నిర్ణయించారు. సమావేశానికి టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, సీఎల్పీ మాజీనేత జానారెడ్డి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి ఆర్‌సీ కుంతియా, టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్లు పొన్నం ప్రభాకర్, జి కుసుమకుమార్, మాజీమంత్రులు పొన్నాల లక్ష్మయ్య, షబ్బీర్‌అలీ, మాజీ ఎంపీ వి. హనుమంతరావు, చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి, ఏఐసీసీ ప్రొటోకాల్‌ ఇన్‌చార్జి హెచ్‌. వేణుగోపాల్‌ తదితరులు హాజరయ్యారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓట్లు వేసే వారి జాబితా ప్రచురించకుండానే నోటిఫికేషన్‌ విడుదల చేయడం సమంజసం కాదని నేతలు అభిప్రాయపడ్డారు. మరో నెలరోజుల్లో కొత్త జెడ్పీటీసీ, ఎంపీటీసీలు వస్తున్న నేపథ్యంలో పాత ఎంపీటీసీలు, జెడ్పీటీసీల చేత ఓట్లు వేయించడం అన్యాయమని అన్నారు. ఎమ్మెల్సీ స్థానం ఖాళీ అయిన ఆరు నెలల్లోపు ఎన్నికలు నిర్వహించాలన్న నిబంధనలేదని, ఈ మూడు అంశాల ప్రాతిపదికగా నోటిఫికేషన్‌ రద్దు కోసం న్యాయస్థానాలను ఆశ్రయించాలని నిర్ణయించారు. న్యాయ స్థానాల్లో దాఖలు చేసే పిటిషన్లను నల్లగొండ, రంగారెడ్డి, వరంగల్‌ జిల్లాల్లో ప్రస్తుత జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల చేత దాఖలు చేయించాలని, సోమవారం హైకోర్టు, సుప్రీంకోర్టులో ఈ పిటిషన్లు వేయాలని నిర్ణయించారు.  

అభ్యర్థుల పేర్లు డీసీసీల ద్వారా... 
న్యాయపోరాటం చేస్తూనే ఎన్నికలు అనివార్యమైతే పార్టీ అభ్యర్థుల ఎంపికపై చర్చ జరిగింది. వరంగల్‌ స్థానం నుంచి ఇనుగాల వెంకట్రామిరెడ్డిని బరిలో దించాలని దాదాపు నిర్ణయించారు. ఇక్కడి నుంచి పోటీకి మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి విముఖత వ్యక్తం చేశారు. నల్లగొండ స్థానం నుంచి గూడూరు నారాయణరెడ్డి, పటేల్‌ రమేశ్‌రెడ్డి పేర్లను పరిశీలించినప్పటికీ మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి సతీమణి లక్ష్మి అయితే బాగుంటుందని పలువురు నేతలు అభిప్రాయపడ్డారు. గత స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈ స్థానం నుంచి రాజగోపాల్‌రెడ్డి గెలవడంతోపాటు ఎంపీటీసీ, జెడ్పీటీసీలతో కోమటిరెడ్డి బ్రదర్స్‌కు ఉన్న సంబంధాల నేపథ్యంలో లక్ష్మి పేరు దాదాపు ఖరారు చేశారు. రంగారెడ్డి స్థానం నుంచి మాజీ ఎమ్మెల్యే కిచ్చన్నగారిలక్ష్మారెడ్డిని బరిలోకి దించాలనే దానిపై చర్చ జరిగింది. అయితే, ఇక్కడి అభ్యర్థిని నిర్ణయించే బాధ్యతను చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డికి అప్పగించారు. మొత్తం మీద సోమవారం మధ్యాహ్నం వరకు అభ్యర్థులను ఖరారు చేయాలని, ఈలోపు మూడు జిల్లాల డీసీసీ అధ్యక్షుల నుంచి ఎవరు పోటీలో ఉంటే బాగుంటుందో వారి పేర్లను తెప్పించుకోవాలని నిర్ణయించారు.  

కోవర్టులను ఏం చేశారు... 
వీహెచ్‌ మాట్లాడుతూ కాంగ్రెస్‌ పార్టీలో టీఆర్‌ఎస్‌ కోవర్టులున్నారని, వారి ద్వారానే ఎమ్మెల్యేలు సబితాఇంద్రారెడ్డి, సుధీర్‌రెడ్డిలు పార్టీ మారారని ఆరోపించారు. ఆ కోవర్టులపై చర్యలు ఎందుకు తీసుకోవడంలేదని ప్రశ్నించబోగా దీనిపై చర్చించేందుకు ఈ సమయం సరైందని కాదని వీహెచ్‌ను ఇతర నేతలు సముదాయించారు.  

సుప్రీంకోర్టుకు వెళ్తాం: ఉత్తమ్‌ 
చనిపోయిన ఎంపీటీసీ, జెడ్పీటీసీల పేర్లను ఓటర్ల జాబితా నుంచి తీసేయలేదని సమావేశం అనంతరం విలేకరులతో ఉత్తమ్‌ అన్నారు. రాజీనామా చేసిన తర్వాత ఆరునెలల్లోగా ఎన్నికలు జరపాలన్న నిబంధన ఎక్కడాలేదని చెప్పారు. ఎమ్మెల్సీ ఎన్నికలపై సుప్రీంకోర్టుకు వెళ్తామన్నారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఓటర్ల జాబితా లేకుండా ఎలా ఎన్నికలు నిర్వహిస్తారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక సోమవారంలోగా కొలిక్కి వస్తుందని తెలిపారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement