కాంగ్రెస్‌ హయాంలోనే అభివృద్ధి

TPCC Chief Uttam Kumar Reddy Criticize On KCR - Sakshi

నిర్మల్‌ : అన్నివర్గాల ప్రజలకు అభివృద్ధిని అందించిన ఘనత కాంగ్రెస్‌దేనని, అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల్లోనే ముస్లింలకు 12శాతం రిజర్వేషన్లను ఇస్తామన్న కేసీఆర్‌ నాలుగేళ్లయినా ఇవ్వడం లేదని టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. మైనార్టీలను మోసగించిన టీఆర్‌ఎస్‌ పార్టీకి వారిని ఓట్లడిగే హక్కు లేదన్నారు. నిర్మల్‌ జిల్లా కేంద్రంలోని ఆర్‌ఆర్‌ గార్డెన్‌లో శుక్రవారం సాయంత్రం ఉమ్మడి ఆదిలాబాద్‌ డీసీసీ అధ్యక్షుడు ఏలేటి మహేశ్వర్‌రెడ్డి, స్థానిక రియల్టర్‌ సయ్యద్‌ అర్జుమంద్‌అలీ ఆధ్వర్యంలో భారీ ఇఫ్తార్‌ విందు నిర్వహించారు. ఇందులో ముఖ్య అతిథులుగా ఉత్తమ్‌కుమార్‌రెడ్డితోపాటు సీఎల్పీ, మండలి నేతలు జానారెడ్డి, షబ్బీర్‌అలీ తదితరులు పాల్గొన్నారు.

ముందుగా మహేశ్వర్‌రెడ్డి నివాసంలో విలేకరులతో మాట్లాడారు. గత ఎన్నికల్లో హామీలు గుప్పించిన సీఎం కేసీఆర్‌ వాటిని నెరవేర్చడంలో విఫలమయ్యారని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆరోపించారు.ప్రధానంగా 12శాతం రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి కేసీఆర్‌ మైనార్టీలను మోసగించారన్నారు. రిజర్వేషన్ల అమలుకు ప్రధానమంత్రి ఒప్పుకున్నారని, త్వరలో ఇవ్వనున్నామని కట్టుకథలు చెబుతూ తప్పించుకుంటున్నాడని విమర్శించారు.

కాంగ్రెస్‌ హయాంలోనే ముస్లింమైనార్టీలకు నాలుగుశాతం రిజర్వేషన్లు ఇచ్చామన్నారు. జనాభా ఆధారంగా ముస్లింలకు 12శాతం రిజర్వేషను ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. లేనిపక్షంలో టీఆర్‌ఎస్‌కు మైనార్టీలను ఓట్లడిగే హక్కు లేదని చెప్పారు. కేంద్రంలో ఎన్‌డీఏ అధికారంలోకి వచ్చిన తర్వాత దేశంలో మతకలహాలు పెరిగాయని, మైనార్టీలలో అభద్రతాభావం పెరిగిందన్నారు. చాలాచోట్ల మైనార్టీలకు రక్షణ కొరవడిందని ఆందోళన వ్యక్తంచేశారు.

టీఆర్‌ఎస్, బీజేపీల మధ్య రహస్య ఒప్పందముందని ఆరోపించారు. రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి ఎన్నికలు, నోట్లరద్దు, జీఎస్టీ అంశాల్లో కేంద్రానికి మద్దతునివ్వడమే తప్పా ఒక్క ఆరోపణ కూడా టీఆర్‌ఎస్‌ చేయకపోవడమే ఇందుకు నిదర్శనమన్నారు. టీఆర్‌ఎస్, ఎంఐఎం, బీజేపీలకు ఓట్లు వేస్తే వృథా అవుతాయని, కాంగ్రెస్‌తోనే అభివృద్ధి సాధ్యమని ఆయన పేర్కొన్నారు. తమ అధినేత రాహుల్‌గాంధీ నిర్మల్‌లో పాదయాత్ర చేశారని, ఆ రోజులు ఎప్పటికీ మర్చిపోలేమని గుర్తుచేసుకున్నారు.

ఒకపూట విందు కాదు.. జీవితాంతం భరోసా కావాలి

సీఎం కేసీఆర్‌ ప్రభుత్వ ధనంతో రాష్ట్రంలో 800 చోట్ల మైనార్టీలకు ఇఫ్తార్‌ విందు ఇస్తున్నారని, ఇలాంటి ఒకపూట విందు ఇవ్వడం కాదని, జీవితాంతం ఉపయోగపడేలా ముస్లింమైనార్టీలకు 12శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని షబ్బీర్‌అలీ డిమాండ్‌ చేశారు. రాష్ట్రంలో, దేశంలో మైనార్టీలకు ప్రాధాన్యత తగ్గుతోందన్నారు. ప్రభుత్వ పన్నుల ద్వారా వచ్చే డబ్బులతో తాను ఇఫ్తార్‌ విందు ఇవ్వనని చెప్పిన రాష్ట్రపతి కోవింద్‌ తన సంఘ్‌ మూలాల చాటుతూ తప్పించుకున్నారని అన్నారు. ఇందుకు తాము కూడా గవర్నర్‌ ఇచ్చే ఇఫ్తార్‌ను బహిష్కరిస్తామని చెప్పారు. రాష్ట్రంలో కేసీఆర్‌ ఎంఐఎంను అడ్డుపెట్టుకుని ముస్లింలతో గేమ్‌ ఆడుతున్నారని ఆరోపించారు. హైదరాబాద్‌ పాతబస్తీలో ఐదెకరాల బంగ్లాలో ఉండే ఓవైసీలకు గరీబుల కష్టాలు పట్టించుకునే తీరిక లేదన్నారు. కాంగ్రెస్‌ మాత్రమే అన్నివర్గాలకు సమన్యాయం చేస్తుందని చెప్పారు.

అభద్రత, అసహనం పెరిగాయి..

గత ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన వాగ్ధానాలను రాష్ట్రంలో టీఆర్‌ఎస్, కేంద్రంలో బీజేపీ ప్రభుత్వాలు మర్చిపోయాయని, వీళ్ల పాలనతో అభద్రత, అసహనం పెరిగాయని జానారెడ్డి అన్నారు. స్వతంత్రం కోసం పోరాడటంతో పాటు దేశాన్ని అభివృద్ధి చేసి, సామరస్యతను కాపాడుతున్న ఘనత ఒక్క కాంగ్రెస్‌దేనన్నారు. కేసీఆర్‌ రిజర్వేషన్లను ఇవ్వడం ఇక కల్లనేని, మైనార్టీల అభివృద్ధి కోసం కాంగ్రెస్‌ పాటుపడుతుందని ఆయన పేర్కొన్నారు. రానున్న ఎన్నికల్లో టీఆర్‌ఎస్, బీజేపీలకు గుణపాఠం చెప్పాలన్నారు. అనంతరం స్థానిక ఆర్‌ఆర్‌ గార్డెన్‌లో రియల్టర్‌ అర్జుమంద్‌అలీ ఆధ్వర్యంలో భారీ ఇఫ్తార్‌ ఏర్పాటు చేశారు. ముఫ్తీ ఖలీమ్‌ ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు.

రంజాన్‌మాసం గొప్పతనం, అందులోని విశేషాలను షబ్బీర్‌ అలీ వివరించారు. అనంతరం సామూహికంగా ప్రార్థనలు చేసి ఇఫ్తార్‌ విందు ఆరగించారు. ఆయా కార్యక్రమాల్లో మాజీ ఎమ్మెల్యే అరవింద్‌రెడ్డి, కాంగ్రెస్‌ ఉమ్మడి జిల్లా నాయకులు రామారావు పటేల్, భార్గవ్‌దేశ్‌పాండే, అనిల్‌జాదవ్, అజర్, హైదర్, రామలింగం, సత్యంచంద్రకాంత్, అయన్నగారి పోశెట్టి, జుట్టు దినేశ్, నాందేడపు చిన్ను, సంతోష్, సయ్యద్‌ అక్తర్, జునైద్‌ మెమన్, ఇమ్రానుద్దీన్, మోయిన్, అల్మాస్, ముత్యంరెడ్డి, బాపురెడ్డి, ఆయా జిల్లా నాయకులు పాల్గొన్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top