‘బాబు యాత్రకు ప్రజలు మొహం చాటేస్తున్నారు’

TJR Sudhakar Babu Slams On TDP And Chandra Babu - Sakshi

సాక్షి, తాడేపల్లి: భయంకరమైన అబద్దాలు ప్రచారం చేయడంలో టీడీపీ నేతలు దిట్ట అని వైఎస్సార్‌ కాగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే టీజేఆర్‌ సుధాకర్‌బాబు అన్నారు. ఆయన శనివారం మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు మీద వైఎస్సార్‌సీపీ నేతలు దాడులు చేశారని.. ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు. ఎవరైతే శాంతి భద్రతల గురించి మాట్లాడకూడదో వారే ఇప్పుడు మాట్లాడుతున్నారని ఆయన ఎద్దేవా చేశారు. దళిత ఎంపీ సురేష్పై టీడీపీ మహిళలు కారంతో దాడి చేశారని అన్నారు. ప్రభుత్వ విప్ పిన్నెలి రామకృష్ణరెడ్డి, ఎమ్మెల్యే రోజా, శ్రీదేవి, మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్‌పై దాడులు జరిగాయని ఆయన తెలిపారు. చంద్రబాబు, లోకేష్ చేసిన అరాచకాలు ఎవరు మర్చిపోరని ఆయన అన్నారు. ప్రభుత్వ సంస్థలకు నాలుగు కోట్లకు ఎకరా, చంద్రబాబుకు లంచం ఇచ్చిన కంపెనీలకు కోటి యాభై లక్షలకు ఇచ్చారని ఆయన మండిపడ్డారు. చంద్రబాబు మూడు గ్రామాలకు పరిమితమై తన సమాధి తానే తవ్వుకున్నాడని సుధాకర్‌బాబు ఎద్దేవా చేశారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు రాజధానిలో స్థలం ఇస్తే టీడీపీ నేతలు అడ్డుకుంటున్నారని ఆయన మండిపడ్డారు. (రియల్‌ ఎస్టేట్‌ కోసమే చంద్రబాబు చైతన్య యాత్ర..)

మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు బహిరంగంగా విశాఖ పరిపాలన రాజధానికి మద్దతు తెలిపారని టీజేఆర్‌ సుధాకర్‌బాబు గుర్తు చేశారు. ఎందుకు గంటపై చంద్రబాబు చర్యలు తీసుకోలేదని సుధాకర్‌బాబు ప్రశ్నించారు. పరిపాలన రాజధాని వైజాగ్‌లో వద్దన్న చంద్రబాబును అక్కడి ప్రజలు అడ్డుకున్నారని ఆయన తెలిపారు. చంద్రబాబు అడ్డుకోవాల్సిన అవసరం వైఎస్సార్‌సీపీకి లేదని ఆయన అన్నారు. సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేస్తున్న అభివృద్ధి చంద్రబాబు, ఎల్లో మీడియాకు కనిపించదని ఆయన ధ్వజమెత్తారు. ఉత్తరాంధ్ర ప్రాంతంలో చంద్రబాబును అక్కడి ప్రజలు అడుగుపెట్టనివ్వరని అన్నారు. చంద్రబాబుకు రాష్ట్రంలో మిగిలింది రెండు పేపర్లు, మూడు ఛానెళ్లు, 21 మంది ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎంపీలు, మూడు గ్రామాలే మాత్రమే అని ఆయన దుయ్యబట్టారు. చంద్రబాబు ప్రజా చైతన్య యాత్రకు ప్రజలు మొహం చాటేస్తున్నారని తెలిపారు. గవర్నర్ దగ్గరకు టీడీపీ నేతలు ఏ మొహం పెట్టుకొని వెళ్లారని ఆయన ధ్వజమెత్తారు. వైస్సార్‌సీపీ ప్రజా ప్రతినిధుల మీద టీడీపీ నేతలు దాడులు చేయలేదా అని ప్రశ్నించారు. చంద్రబాబును అడ్డుకుంది పోలీసులు కాదు, ఉత్తరాంధ్ర ప్రజలని సుధాకర్‌బాబు అన్నారు. (దేవినేని ఉమా బంధువు అవినీతి.. ఏసీబీ సోదాలు)

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top