వైఎస్సార్‌సీపీలోకి తోట త్రిమూర్తులు

Thota Trimurthulu joins in YSRCP - Sakshi

సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో పార్టీలో చేరిక

సీఎం తీసుకునే నిర్ణయాల అమలుకు నావంతు కృషి చేస్తా..  

కేవలం అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొనే వైఎస్సార్‌సీపీలో చేరా

పవన్‌ కల్యాణ్‌పై కాపులకు నమ్మకం సడలిపోయింది

సాక్షి, అమరావతి: తెలుగుదేశం పార్టీ సీనియర్‌ నేత, తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురం మాజీ ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని సీఎం నివాసంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో ఆదివారం పార్టీ కండువా కప్పుకున్నారు. ఆయనతోపాటు రామచంద్రాపురం నాయకులు పి.బాబ్జి, వంటికూటి అబ్బు, విశ్వేశ్వరరావు, తోట పృథ్వీరాజ్, రేవు శ్రీను, పేకేరు బాబ్జీ, బాలాంతరం రాజా, రావూరు సుబ్బారావు, తోట బాబు, వారి అనుచరులు వైఎస్సార్‌సీపీలో చేరారు. టీడీపీకి రాజీనామా చేస్తున్నట్లు త్రిమూర్తులు రెండు రోజుల క్రితం ప్రకటించిన విషయం తెలిసిందే. 

వైఎస్‌ జగన్‌తోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యం  
రాష్ట్ర అభివృద్ధి కోసం సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీసుకునే నిర్ణయాల అమలుకు తనవంతు కృషి చేస్తానని తోట త్రిమూర్తులు చెప్పారు. ఆయన తాడేపల్లిలోని సీఎం క్యాంప్‌ కార్యాలయం వద్ద విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రాభివృద్ధి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డితోనే సాధ్యమని అన్నారు. ఆయన ప్రజలకు అన్ని విధాలా మేలు చేస్తారన్న నమ్మకం తనకు ఉందన్నారు. ఆ నమ్మకంతోనే వైఎస్సార్‌సీపీలో చేరానని తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్రానికి సమర్థవంతమైన నాయకత్వం అవసరమన్నారు. అది వైఎస్‌ జగన్‌ వల్లే సాధ్యమవుతుందని తేల్చిచెప్పారు. రాజకీయంగా పిల్లి సుభాష్‌ చంద్రబోస్, తాను పోటీ పడుతూ వచ్చామన్నారు. కులాల మధ్య గానీ, తమ మధ్య గానీ ఎలాంటి వైరం లేదని పేర్కొన్నారు. కేవలం అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొనే తాను వైఎస్సార్‌సీపీలో  చేరానన్నారు. పార్టీలో సీనియర్లతో కలిసి పని చేస్తానని, అభివృద్ధికి సహకరిస్తానని చెప్పారు. పవన్‌ కల్యాణ్‌ కాపుల తరపున మాట్లాడటం లేదని తోట త్రిమూర్తులు విమర్శించారు. అందుకే పవన్‌ కల్యాణ్‌పై కాపులకు నమ్మకం సడలిపోయిందని స్పష్టం చేశారు. 

త్రిమూర్తులు రాక సంతోషకరం: బోస్‌ 
తాను మొదటి నుంచీ వైఎస్సార్‌సీపీకి విధేయుడిగా ఉన్నానని, పార్టీ తీసుకునే ఏ నిర్ణయానికైనా కట్టుబడి ఉంటానని మంత్రి పిల్లి సుభాష్‌చంద్రబోస్‌ అన్నారు. అందరం కలిసి పార్టీ అభివృద్ధి కోసం కృషి చేస్తామన్నారు. తోట త్రిమూర్తులు వైఎస్సార్‌సీపీలో చేరడం సంతోషంగా ఉందన్నారు. భవిష్యత్తులో చరిత్ర పుటల్లో టీడీపీ కనిపించదని రాజ్యసభ సభ్యుడు వి.విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. చంద్రబాబు పాలనలో తీసుకున్న పీపీఎల నిర్ణయాలతో రోజుకు రూ.700 కోట్లు నుంచి రూ.1,000 కోట్ల నçష్టం జరుగుతోందని చెప్పారు.  ముఖ్యమంత్రికి వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు భయపడుతున్నారని పవన్‌ చేసిన వ్యాఖ్యలు పూర్తిగా అవాస్తవాలని మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్‌ అన్నారు. రానున్న రోజుల్లో చాలామంది టీడీపీ నేతలు వైఎస్సార్‌సీపీలో చేరతారని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు సామినేని ఉదయభాను, సి.వేణుగోపాలకృష్ణ, వైఎస్సార్‌సీపీ నేత పిల్లి రవీంద్రనాథ్‌ తదితరులు పాల్గొన్నారు.  

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top