
సాక్షి, హైదరాబాద్ : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై హత్యాయత్నం జరిగిన విశాఖపట్టణం విమానాశ్రయం తమ పరిధిలోకి రాదని, అక్కడ సీఐఎస్‌ఎఫ్ పర్యవేక్షణ ఉంటుందని చెబుతున్న టీడీపీ నేతలు, రాష్ట్ర ప్రభుత్వం థర్డ్ పార్టీ విచారణకు ముందుకు రావాలని వైఎస్సార్ సీపీ మాజీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఆయన మంగళవారం జగన్ నివాసం వద్ద మీడియాతో మాట్లాడుతూ జగన్‌పై హత్యాయత్నం జరిగిన తరువాత తామెవ్వరం (వైఎస్సార్ కాంగ్రెస్) ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుపై గానీ, మరెవరిపైగానీ అనుమానాలు వ్యక్తం చేస్తూ మాట్లాడలేదని, ఎలాంటి విమర్శలు చేయలేదని చెప్పారు. అయితే డీజీపీ, చంద్రబాబు వ్యవహరించిన తీరు, ఇచ్చిన ప్రకటనలు చూశాక తమకు అనుమానాలు బలపడ్డాయన్నారు.
ఈ కేసుకు సంబంధించిన రిమాండ్ రిపోర్టులో జగన్‌ను హత్య చేయడానికి ప్రయత్నించాడని, కానీ ఆయన తప్పించుకున్నారని స్పష్టంగా పేర్కొన్నారని తెలిపారు. అప్పటి వరకు ఆగకుండా దానిని తక్కువ చేసి చూపేందుకు డీజీపీ, చంద్రబాబు ప్రయత్నం చేశారన్నారు. సంఘటన జరిగిన ప్రదేశం తమ పరిధిలోకి రాదని రాష్ట్ర ప్రభుత్వమే చెబుతున్నందున.. కేంద్రం దర్యాప్తు సంస్థతో విచారణ జరిపించాలని తమ పార్టీ కేంద్ర హోంమంత్రిని కోరిందని తెలిపారు. అసలు ఏపీలో ఏమాత్రం భద్రత లేదని, విమానాశ్రయంలోకే కత్తిని తీసుకు వెళ్లారంటే పరిస్థితులు ఎలా ఉన్నాయో ఊహించవచ్చన్నారు. విమానాశ్రయం లోపల సీఐఎస్‌ఎఫ్ బలగాల ఆధీనంలో ఉంటుందని.. బయట పర్యవేక్షణ అంతా రాష్ట్ర పోలీసులదే కదా అని ప్రశ్నించారు. హత్యాయత్నం జరిగినపుడు తాను జగన్ వద్దనే ఉన్నానని.. నిందితుడు శ్రీనివాస్ మానసిక పరిస్థితి చాలా బాగుందని, హుషారుగా ఉన్నాడన్నారు.
అతను జగన్ వద్దకు చాలా నిబ్బరంగా రావడం దాడి చేయడం అంతా క్షణాల్లో జరిగి పోయిందన్నారు. ఆ సమయంలో అతని వద్ద ఎలాంటి లేఖ లేదన్నారు. రక్తం కారిన చొక్కాను మార్చుకుని జగన్ హైదరాబాద్‌కు బయలు దేరారంటే.. అక్కడే ఉండి సమస్యలు సృష్టించకూడదనే ఉద్దేశంతోనేనని మిథున్‌రెడ్డి వివరించారు. పైగా ఆ సమయంలో జగన్ ప్రజల గురించే ఆలోచించారని.. తనపై దాడి జరిగిందని సురక్షితంగా ఉన్నానని ట్వీట్ చేయండని కూడా తమతో చెప్పారని మిథున్ చెప్పారు. శనివారం (నవంబర్ 3 నుంచి) నుంచి పాదయాత్ర యథావిధిగా సాగుతుందని వెల్లడించారు. కోడి కత్తితో అపాయం ఉండదని చెప్పే వారు తన వద్దకు రావాలని వారికి దాని పదునెంత ఉంటుందో చూపిస్తానని మిథున్‌రెడ్డి ఒక టీవీ చానెల్ చర్చలో పేర్కొన్నారు.,