ఇక పురపోరు | Sakshi
Sakshi News home page

ఇక పురపోరు

Published Thu, Jun 20 2019 7:43 AM

Telangana Municipal Elections All Is Ready - Sakshi

సాక్షి, నాగర్‌కర్నూల్‌: జిల్లాలో అసెంబ్లీ, సర్పంచ్, ఎంపీ, పరిషత్‌ ఎన్నికలు విజయవంతంగా పూర్తి చేసిన యంత్రాంగం త్వరలో మున్సిపల్‌ ఎన్నికలకు కూడా రంగం సిద్ధం చేసుకుంటుంది. మంగళవారం జరిగిన రాష్ట్ర మంత్రి వర్గ సమావేశంలో పురపాలిక ఎన్నికల ప్రస్తావన వచ్చింది. దీంతో వచ్చే నెలలోనే ఎన్నికలు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. మున్సిపాలిటీల పాలకవర్గాల పదవీకాలం జూలై 3వ తేదీతో ముగియనున్నాయి. గతంలో విలీన గ్రామాలపై కొంత వివాదం నెలకొన్నా హైకోర్టు ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు ఇవ్వడంతో సమస్య పరిష్కారం కావడంతో పురపాలిక ఎన్నికలు నిర్వహించేందుకు ప్రస్తుతం ఎలాంటి అడ్డంకులు లేవు. జిల్లాలో నాగర్‌కర్నూల్, కొల్లాపూర్, కల్వకుర్తి, అచ్చంపేట మున్సిపాలిటీలు ఉన్నా.. అచ్చంపేటలో మార్చి 2016లోనే ఎన్నికలు జరగడంతో అక్కడి పాలకవర్గానికి ఇంకా రెండేళ్ల గడువు ఉండడంతో మిగిలిన మూడు మున్సిపాలిటీలలో ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. జిల్లాలో మున్సిపాలిటీల్లో 13 పంచాయతీలను విలీనం చేయడంతో.. కొన్ని గ్రామాలు విలీనాన్ని వ్యతిరేకిస్తూ కోర్టుకు వెళ్లడంతో వార్డుల విభజన ప్రక్రియను పూర్తి చేయడంలో ఆలస్యమైంది. రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తయితే వచ్చే నెలలోనే ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉంది.
 
వార్డుల పునర్విభజనపై ఉత్కంఠ  
మున్సిపాలిటీల ఎన్నికల నిర్వహణకు ముందు వార్డుల పునర్విభజన కీలకం కానుంది. అయితే వచ్చే నెలలోనే  ఎన్నికలు ఉన్నట్లు ప్రకటిస్తుండటంతో అంత తక్కువ సమయంలో వార్డుల విభజన రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తవుతుందా అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ఉన్నతాధికారుల నుంచి వచ్చిన మార్గదర్శకాల ఆధారంగానే అధికారులు వార్డుల విభజన చేపట్టే అవకాశం ఉంది. గత ఎన్నికల్లో వార్డుల విభజన సరిగ్గా లేకపోవడంతో కొన్ని వార్డులలో ఓటర్ల సంఖ్య హెచ్చు తగ్గులయ్యాయి. కొన్ని వార్డుల్లో 800 ఓటర్లు ఉంటే కొన్ని వార్డుల్లో 1,600 వరకు ఓటర్లు ఉన్నారు. అయితే వార్డుల విభజన పూర్తి అయినా వార్డుల పెంపుపై కూడా స్పష్టత రావాల్సి ఉంది. ప్రస్తుతం జిల్లాలో ప్రతి మున్సిపాలిటీలో 20 వార్డులు ఉన్నాయి. గతంలో నగరపంచాయతీలు ఉన్నప్పుడు ఎన్ని వార్డులు ఉన్నాయో మున్సిపాలిటీలుగా అప్‌గ్రేడ్‌ అయిన తరువాత కూడా 20వార్డులనే కొనసాగిస్తారా లేదా అనే అంశంపై స్పష్టత రావాల్సి ఉంది. నాగర్‌కర్నూల్‌లో ఎండబెట్ల, నాగనూలు, దేశిటిక్యాల, ఉయ్యాలవాడ, కొల్లాపూర్‌ పరిధిలో చుక్కాయిపల్లి, చౌటబెట్ల, తాళ్ల నర్సింగాపురం, నర్సింగరావుపల్లి, కల్వకుర్తి పరిధిలో సంజాపూర్, తిమ్మరాసిపల్లి, కొట్రతండా గ్రామాలు మున్సిపాలిటీల్లో విలీనం చేశారు. అయితే విస్తీర్ణం పెరగడంతో వార్డుల సంఖ్య కూడా పెంచాలని కొందరు ఆశావహులు అభిప్రాయపడుతున్నారు.
 
తొలగిన అడ్డంకులు  
నాగర్‌కర్నూల్‌ మున్సిపాలిటీలో విలీన గ్రామాల్లో ఒకటైన ఉయ్యాలవాడ గ్రామానికి చెందిన వారు మున్సిపాలిటీల్లో విలీనాన్ని వ్యతిరేకిస్తూ కోర్టుకు వెళ్లడంతో వార్డుల విభజన ప్రక్రియను పూర్తి చేయలేదు. కొల్లాపూర్‌ నగరపంచాయతీగా అవతరించి ఏడేళ్లు గడుస్తున్నా ఇప్పటి వరకు ఎన్నికలు జరగలేదు. నర్సింగారావుపల్లి గ్రామస్తులు కోర్టులో కేసు వేయడంతో అక్కడ కూడా ఎన్నికల నిర్వహణకు అడ్డంకిగా మారింది. అయితే హైకోర్టులో అనుకూలంగా తీర్పు రావడంతో ఆ ప్రక్రియకు కూడా అడ్డంకులు తొలగిపోయాయి. మూడు మున్సిపాలిటీలలో బీసీ గణన కూడా పూర్తయింది. మూడు మున్సిపాలిటీలలో కలిపి ప్రస్తుతం ఉన్న జాబితా ప్రకారం 43,684మంది బీసీ ఓటర్లు, 9,182మంది ఎస్సీ ఓటర్లు, 1912 మంది ఎస్టీ ఓటర్లు, 11,026 మంది ఇతర ఓటర్లు మొత్తం 65,802 మంది ఓటర్లు ఉన్నారు.  నాగర్‌కర్నూల్‌ మున్సిపాలిటీ లెక్కల ప్రకారం ఓటర్లు 27,021 ఉండగా ఇందులో బీసీలు 18,007, ఎస్సీలు 3,885, ఎస్టీలు 238, ఇతరులు 4,891 ఉన్నారు. కల్వకుర్తిలో మొత్తం 19,918 మంది ఓటర్లు ఉండగా బీసీలు 11,998, ఎస్సీలు 2,167, ఎస్టీలు 1422, ఇతరులు 4331 మంది ఓటర్లు ఉన్నారు. కొల్లాపూర్‌ మున్సిపాలిటీలో మొత్తం 18418 మంది ఓటర్లు ఉండగా బీసీలు 13,492, ఎస్సీలు 3,130, ఎస్టీలు 252, ఇతరులు 1,544 మంది ఉన్నారు. అయితే గతంలో జరిగిన బీసీ ఓటర్ల గణన ప్రకారం రిజర్వేషన్లు ఖరారు చేస్తారా లేక కొత్త చట్టంతో ఏవైన మార్పులు చేర్పులు జరుగుతాయా అనే విషయంపై స్పష్టత రావాల్సి ఉంది. ఇక మున్సిపల్‌ ఎన్నికలు ప్రత్యక్ష పద్ధతిలోనా, పరోక్ష పద్ధతిలో నిర్వహిస్తారా అనే అంశం తేలాల్సి ఉంది. ప్రత్యక్ష పద్ధతిలో అయితే బడానేతలంతా రిజర్వేషన్‌ అనుకూలిస్తే పోటీలో ఉండే అవకాశం ఉంది.  

ఆశావహుల ఎదురుచూపు  
మున్సిపల్‌ ఎన్నికల విధివిధానాలు ఖరారు ఎప్పుడవుతుందోనని ఆశావహులు ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం ఉన్న కౌన్సిలర్లు తమకు మరోసారి రిజర్వేషన్‌ అనుకూలిస్తే పోటీ చేసేందుకు సిద్ధపడుతున్నారు. మరోవైపు పార్టీలు సైతం చైర్మన్‌కు సంబంధించి ఏ రిజర్వేషన్‌ వస్తుంది, ఎవరిని పోటీలో ఉంచాలనే అంశంపై కసరత్తులు ప్రారంభిస్తున్నారు. ఆశావహులు తమ వార్డులలో జనాన్ని మచ్చిక చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు. వార్డుల్లో పర్యటిస్తూ ప్రజలకు అవసరమైన పనులు చేసి పెడుతూ మద్దతు కూడగట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. తమ పార్టీలకు చెందిన నేతలతో ఇప్పటికే తాను అభ్యర్థిగా పోటీలో ఉంటాననే సంకేతాలు అందిస్తున్నారు. వచ్చే నెలలోనే ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉండటంతో పట్టణాల్లో రాజకీయాలు క్రమంగా ఊపందుకుంటున్నాయి. ఇదివరకే మున్సిపాలిల్లో బీసీ ఓటర్ల గణన పూర్తయింది. దీంతో చైర్మన్, వార్డు సభ్యుల రిజర్వేషన్లు ఖరారు చేయడమే మిగిలింది.

సిద్ధంగా ఉన్నాం

ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా ఎన్నికల నిర్వహణపై చర్యలు తీసుకుంటాం. ఇప్పటి వరకు మున్సిపల్‌ ఎన్నికల నిర్వహణకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు అందలేదు. ఒకవేళ ఏవైనా ఆదేశాలు వస్తే ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేసేందుకు సిద్ధంగా ఉన్నాం. 
– జయంత్‌కుమార్‌రెడ్డి, మున్సిపల్‌ కమిషనర్, నాగర్‌కర్నూల్‌   

Advertisement
 
Advertisement
 
Advertisement