సీట్లూ తక్కువే... గెలిచిన స్థానాలూ తక్కువే

Telangana Assembly Election Results List Of Women Who Won - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : ఆకాశంలో సగం అంటూ ‘ఆమె’ను ఆకాశానికి ఎత్తేసే ప్రభృతులు రాజకీయంగా మాత్రం మహిళలకు తగిన ప్రాధాన్యం ఇవ్వడం లేదు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాన పార్టీలు సైతం మహిళలకు ఈసారి తక్కువ సీట్లు కేటాయించడమే ఇందుకు నిదర్శనం. గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి మహిళలకు వివిధ పార్టీలు కేటాయించిన సీట్లు తక్కువగా ఉండగా, గెలుపొందిన స్థానాలు కూడా తక్కువే. 2014లో టీఆర్‌ఎస్ 11 మంది మహిళా అభ్యర్థులకు అవకాశం ఇవ్వగా, బీజేపీ- టీడీపీ కూటమి 14 మందికి, కాంగ్రెస్‌ పార్టీ 9 మంది మహిళలను ఎన్నికల బరిలో నిలిపాయి. అయితే ఈ అభ్యర్థుల్లో కేవలం 9 మంది మాత్రమే గెలుపొందగా.. అధికారంలోకి వచ్చిన టీఆర్‌ఎస్‌ ఒక్క మహిళకు కూడా మంత్రివర్గంలో చోటివ్వకపోవడంతో మహిళా ప్రాతినిథ్యమే లేకుండా పోయింది.

అయితే ఈ ఎన్నికల్లో ఒంటరిగా బరిలోకి దిగిన బీజేపీ అత్యధికంగా 13 మంది మహిళా అభ్యర్థులకు సీట్లు కేటాయించగా.. ఒక్కరు కూడా విజయం సాధించలేకపోయారు. కాంగ్రెస్‌ తరఫున మొత్తంగా 11 మంది టికెట్లు దక్కించుకున్నారు. వీరిలో ముగ్గురు అభ్యర్థులు(మాజీ హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డి, హరిప్రియ నాయక్, సీతక్క‌) మాత్రమే గెలుపొందారు. తెలంగాణలో ఉనికి కోల్పోయిన టీడీపీ కూకట్‌పల్లి నియోజకవర్గంలో నందమూరి సుహాసినికి అవకాశం ఇచ్చినప్పటికీ ఆమె ఓటమి పాలయ్యారు. ఇక మంత్రివర్గంలో మహిళలకు స్థానం కల్పించలేదని తీవ్ర స్థాయిలో విమర్శలు ఎదుర్కొన్నప్పటికీ టీఆర్‌ఎస్‌ ఈ దఫా కేవలం నలుగురు మహిళలకు మాత్రమే సీట్లు కేటాయించింది. కాగా వీరిలో ముగ్గురు అభ్యర్థులు గెలుపొందడం విశేషం.

టీఆర్‌ఎస్‌ నుంచి అసెంబ్లీకి పోటీచేసిన మహిళలు
పద్మాదేవేందర్‌ రెడ్డి (మెదక్‌), రేఖా శ్యాం నాయక్‌(ఖానాపూర్‌), కోవా లక్ష్మి (అసిఫాబాద్‌), గొంగిడి సునీతా మహేందర్‌రెడ్డి(ఆలేరు)

కాంగ్రెస్‌ నుంచి టిక్కెట్లు దక్కించుకున్న మహిళా అభ్యర్థులు
గండ్రత్‌ సుజాత (ఆదిలాబాద్‌), ఆకుల లలిత(ఆర్మూర్‌), సునీతాలక్ష్మారెడ్డి (నర్సాపూర్‌), జె.గీతారెడ్డి (జహీరాబాద్‌), సబితాఇంద్రారెడ్డి (మహేశ్వరం), డీకే అరుణ (గద్వాల), పద్మావతీరెడ్డి (కోదాడ), కొండా సురేఖ (పరకాల), సీతక్క (ములుగు), హరిప్రియ (ఇల్లందు), సింగాపురం ఇందిర (స్టేషన్‌ ఘన్‌పూర్‌) ఎన్నికల బరిలో నిలిచారు.

బీజేపీ నుంచి బరిలో దిగిన మహిళా అభ్యర్థులు
స్వర్ణారెడ్డి(నిర్మల్‌), అరుణతార(జుక్కల్‌ ), బొడిగె శోభ(చొప్పదండి), ఆకుల విజయ(గజ్వేల్‌), సయ్యద్‌షెహజాది(చాంద్రాయణగుట్ట), పద్మజారెడ్డి(మహబూబ్‌నగర్‌), రజనీ మాధవరెడ్డి(ఆలంపూర్‌), కంకణాల నివేదిత(నాగార్జునసాగర్‌), నాగ స్రవంతి(), రేష్మారాథోడ్‌(వైరా), కుంజా సత్యవతి(భద్రాచలం), పుప్పాల శారద(ఖమ్మం), చందుపట్ల కీర్తిరెడ్డి (భూపాలపల్లి).

కాగా 2014 ఎన్నికల్లో మొత్తంగా 85 మంది మహిళా అభ్యర్థులు బరిలో దిగగా(ఏడీఆర్‌ నివేదిక ప్రకారం)... 9 మంది విజయం సాధించారు. ఈసారి 135 మంది పోటీ చేయగా కేవలం ఆరుగురు మాత్రమే శాసనసభలో అడుగుపెట్టనున్నారు.

2018 ఎన్నికల్లో గెలిచిన మహిళా అభ్యర్థులు

అభ్యర్థి పేరు     నియోజకవర్గం  పార్టీ ప్రత్యర్థి  పార్టీ మెజారిటీ
పద్మాదేవేందర్‌ రెడ్డి      మెదక్‌  టీఆర్‌ఎస్‌      ఉపేందర్‌రెడ్డి   కాంగ్రెస్‌ 47983
గొంగిడి సునీతామహేందర్‌ రెడ్డి  ఆలేరు  టీఆర్‌ఎస్‌     బూడిద భిక్షమయ్య  కాంగ్రెస్‌ 33086
 సీతక్క ములుగు కాంగ్రెస్‌ అజ్మీరా చందూలాల్‌  టీఆర్‌ఎస్ 22671
రేఖా శ్యాం నాయక్ ఖానాపూర్‌ టీఆర్‌ఎస్‌  రమేష్‌ రాథోడ్‌  కాంగ్రెస్‌ 20710
సబితాఇంద్రారెడ్డి మహేశ్వరం కాంగ్రెస్‌ తీగల కృష్ణారెడ్డి టీఆర్‌ఎస్ 7607
హరిప్రియ ఇల్లందు కాంగ్రెస్‌ కనకయ్య కోరం  టీఆర్‌ఎస్ 2907

2014 ఎన్నికల్లో విజయం సాధించిన మహిళలు
 

అభ్యర్థి పేరు నియోజక వర్గం పార్టీ ప్రత్యర్థి అభ్యర్థి పార్టీ మెజారిటీ
రేఖా శ్యాం నాయక్ ఖానాపూర్‌     టీఆర్‌ఎస్‌     రాథోడ్‌ రమేష్‌ టీడీపీ 38,551
బొడిగె శోభ     చొప్పదండి టీఆర్‌ఎస్‌     సుద్దాల దేవయ్య కాంగ్రెస్‌ 54,981
డికె అరుణ      గద్వాల్‌ కాంగ్రెస్‌ బండ్ల క్రిష్ణ మోహన్‌ రెడ్డి టీఆర్‌ఎస్‌   8,260
గొంగిడి సునీత ఆలేరు టీఆర్‌ఎస్‌  బూడిద భిక్షమయ్య కాంగ్రెస్‌ 31,477
జెట్టి గీత     జహీరాబాద్‌ కాంగ్రెస్‌ కొనింటీ మానిక్‌ రావ్‌     టీఆర్‌ఎస్‌ 814
కొండా సురేఖ వరంగల్‌ ఈస్ట్‌ టీఆర్‌ఎస్‌  బసవరాజు సారయ్య కాంగ్రెస్‌ 55,085
కోవా లక్ష్మి అసిఫాబాద్‌ టీఆర్‌ఎస్‌  ఆత్రం సక్కు కాంగ్రెస్‌ 19,052
పద్మా దేవేందర్‌ రెడ్డి     మెదక్‌ టీఆర్‌ఎస్‌  విజయశాంతి కాంగ్రెస్‌ 39,660
నలమాద పద్మావతి రెడ్డి కోదాడ కాంగ్రెస్‌ బొల్లం మల్లయ్య యాదవ్‌ టీడీపీ 13,090

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top