
వసంత కృష్ణప్రసాద్‌ను పార్టీలోకి ఆహ్వానిస్తున్న వైఎస్ జగన్
సాక్షి, విజయవాడ : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి వలసలు ఊపుందుకున్నాయి. రాష్ట్రం కోసం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేస్తున్న పోరాటాలు, ప్రజల సంక్షేమం కోసం పడుతున్న తపన చూసి పలువురు నేతలు ఆకర్షితులవుతున్నారు. ఈ క్రమంలో కృష్ణా జిల్లా మైలవరానికి చెందిన టీడీపీ నేత, మాజీ మంత్రి వసంత నాగేశ్వరరావుతో పాటు ఆయన కుమారుడు, ప్రముఖ పారిశ్రామికవేత్త వసంత కృష్ణప్రసాద్ గురువారం వైఎస్సార్ సీపీలో చేరారు.
జిల్లాలోని కైకలూరు నియోజకవర్గంలో ప్రజాసంకల్పయాత్ర చేస్తున్న వైఎస్ జగన్ సమక్షంలో వసంత కృష్ణప్రసాద్ సహా వందలాది మంది కార్యకర్తలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారందరికీ జగన్ కండువాలను కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీని బలోపేతం చేయడానికి వైఎస్ జగన్ నాయకత్వంలో పనిచేస్తామని వసంత నాగేశ్వరరావు, కృష్ణప్రసాద్ ఈ సందర్భంగా చెప్పారు.
వైఎస్ జగన్ ముఖ్యమంత్రి కావడం తథ్యమని కృష్ణప్రసాద్ అన్నారు. అధికారంలోని వస్తే రాష్ట్రాన్ని అభివృద్ధిలోకి తీసుకెళ్తారన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ప్రజల గుండెల్లో ఉన్నాయని వసంత నాగేశ్వరరావు అన్నారు.
వసంత నాగేశ్వరరావుతో వైఎస్ జగన్ కరచాలనం