లగడపాటిది పనికిమాలిన సర్వే: టీడీపీ మంత్రి

TDP Ayyanna Patrudu Fire On Lagadapati Survey - Sakshi

నర్సీపట్నం: ‘ప్రజల నాడి లగడపాటికి ఏమి తెలుసు.. ఆయన సర్వే వల్ల వేలాది కుటుంబాలు వీధిన పడ్డాయని’ రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు మండిపడ్డారు. రెండు రోజుల క్రితం విడుదలైన ఎగ్జిట్‌పోల్స్‌లో లగడపాటి రాజగోపాల్‌  ప్రకటించిన సర్వేపై మంత్రి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మంగళవారం తన స్వగృహంలో విలేకరులతో ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా లగడపాటి ప్రకటించిన ఎగ్జిట్‌పోల్స్‌ వలన అనేకమంది కోట్లాది రూపాయలు బెట్టింగ్‌లు కట్టి వీధిన పడ్డారన్నారు.

ప్రజల నాడి తెలియని ఇలాంటి  పనికిమాలిన సర్వేల వల్ల కోట్లలో బెట్టింగ్‌లు కాసి ఆత్మహత్యలు చేసుకుంటున్నారని విమర్శించారు.   క్షేత్రస్థాయిలో పరిస్థితులను తెలుసుకోకుండా ఢిల్లీ వంటి నగరాల్లో కూర్చుని చేసే సర్వేల్లో వాస్తవికత ఉండదన్నారు. ప్రజలనాడి తెలిసిన వారే ఎగ్జిట్‌పోల్స్‌ చేయాలన్నారు. ఎన్నికలకు సంబంధించి వచ్చిన ఎగ్జిట్‌ పోల్స్‌ మొత్తం నవ్వులాటగా ఉన్నాయని చెప్పారు.

రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు తిరిగి అధికారంలోకి తీసుకొస్తాయని ఆయన పేర్కొన్నారు. కేంద్ర ఎన్నికల   కమిషన్‌ ప్రధాన మంత్రి నరేంద్రమోదీ కనుసన్నల్లో నడుస్తోందని ఆరోపించారు. కౌటింగ్‌ కేంద్రంలో అభ్యర్థి వద్ద సెల్‌ఫోన్‌ ఉండేందుకు అంగీకరించని ఎన్నికల కమిషన్‌.. కేంద్ర అబ్జర్వర్‌కు సెల్‌ఫోన్‌ అనుమతించడంపై అయ్యన్న అనుమానం వ్యక్తం చేశారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top