టీడీపీకి చేవ చచ్చిందా? | Tamara reddy bharadwaja commented over tdp | Sakshi
Sakshi News home page

టీడీపీకి చేవ చచ్చిందా?

Mar 22 2018 1:43 AM | Updated on Jul 11 2019 9:16 PM

Tamara reddy bharadwaja commented over tdp - Sakshi

సాక్షి, అమరావతి: నాలుగేళ్లుగా ప్రత్యేక హోదా కోసం పోరాడడానికి తెలుగుదేశం పార్టీకి చేవ చచ్చిందా? 15 రోజుల క్రితం నుంచే వారికి హోదా ఉద్యమం గుర్తుకు వచ్చిందా? అని ప్రముఖ సినీ దర్శక, నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. టీడీపీ ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్‌ చేసిన విమర్శలపై భరద్వాజ బుధవారం స్పందించారు.

గతంలో ప్రత్యేక హోదా ఉద్యమంలో పాల్గొంటే తనను, సంపూర్ణేషు బాబు, మహేష్‌ కత్తి, శివాజీలను అరెస్ట్‌ చేసింది టీడీపీ ప్రభుత్వం కాదా? అని నిలదీశారు. నాలుగేళ్లుగా ప్రత్యేక హోదా అక్కర్లేదు అని చెప్పి, ఇప్పుడు హోదా ఉద్యమం క్రెడిట్‌ మొత్తం ప్రతిపక్ష వైఎస్సార్‌సీపీకి వెళ్లిపోతోందన్న భయంతోనే మాట మార్చారని దుయ్యబట్టారు.

మీ రాజకీయాల్లోకి మమ్మల్ని లాగొద్దు
ఇప్పటికే సినిమా రంగానికి చెందిన పవన్‌ కళ్యాణ్, మోహన్‌బాబు, కొరటాల శివ వంటి వారు ప్రత్యేక ఉద్యమానికి మద్దతు తెలిపారని, కానీ టీడీపీలో ఉన్నవారు, పుష్కరాలు వంటి వేడుకలు నిర్వహించిన వారు, ప్రభుత్వంతో కలిసి నంది అవార్డులు పంచుకున్న సినీ నటులు, జ్యూరీ సభ్యులే హోదా గురించి మాట్లాడటం లేదని తమ్మారెడ్డి భరద్వాజ ఆరోపించారు. అధికారం ఉంది కదా అని టీడీపీ నేతలు ఇష్టమొచ్చినట్లు మాట్లాడటం తగదన్నారు. మీ రాజకీయాల్లోకి సినిమా వాళ్లని లాగొద్దని సుతిమెత్తగా హెచ్చరించారు.

బానిసలుగా బతుకుతున్నారని తమను అంటున్నారని, కానీ వాస్తవంగా పదవుల కోసం నాలుగేళ్లుగా బీజేపీకి బానిసలుగా, తొత్తులుగా జీవిస్తున్నది తెలుగుదేశం నేతలు కాదా? అని ప్రశ్నించారు. తమను విమర్శిస్తున్న టీడీపీ నాయకులు ఈ నాలుగేళ్లు ప్రత్యేక హోదాను పక్కన పెట్టి లంచాల మత్తులో మునిగితేలారా?  అంటూ ఘాటుగా విమర్శించారు.

సీఎం చంద్రబాబులో ప్రత్యేక హోదా సాధించాలన్న తపన కంటే వైఎస్‌ జగన్‌ బీజేపీ, పవన్‌ కళ్యాణ్‌లతో కలుస్తాడన్న భయమే ఎక్కువగా కనిపిస్తోందన్నారు. రాష్ట్రంలోని రాజకీయ నాయకులంతా ఒక్కతాటిపైకి వచ్చి ప్రత్యేక హోదా కోసం ఉద్యమం చేపడితే సినీ పరిశ్రమ కూడా తప్పకుండా పాల్గొని మద్దతు ఇస్తుందని తమ్మారెడ్డి భరద్వాజ చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement