స్టార్‌వార్‌ 2.0 !

Star Campaigners Attending Mahabubnaagr Meeting - Sakshi

సాక్షి, మహబూబ్‌నగర్‌ : లోక్‌సభ ఎన్నికలకు దాఖలైన నామినేషన్ల పరిశీలన ఘట్టం ముగిసింది. గురువారం ఉపసంహరణ పర్వం ముగిసిన తర్వాత లోక్‌సభ బరిలో ఎంత మంది ఉంటారనేది తేలనుంది. ఎన్నికలకు రెండు వారాలు మాత్రమే ఉన్న నేపథ్యంలో ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తించేందుకు ప్రధాన పార్టీ నేతలు తమతమ అగ్రనేతలను ఇప్పటికే ఆహ్వానించారు. వీరిలో ఇప్పటికే పలువురు అధినేతల పర్యటనలు ఖరారయ్యాయి.

ఈ నెల 29న పాలమూరు, నాగర్‌కర్నూల్‌ లోక్‌సభ స్థానాలకు సంబంధించి మహబూబ్‌నగర్‌ శివారులోని అమిస్తాపూర్‌–భూత్పూర్‌ మధ్య వద్ద బీజేపీ బహిరంగ సభకు చురుకుగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రధానమంత్రి నరేంద్రమోదీ హాజరుకానున్న ఈ సభను విజయవంతం చేసేందుకు కమలనాథులు అన్ని శక్తిలొస్తున్నారు. రెండు లోక్‌సభ స్థానాల నుంచి రెండు లక్షల మందిని తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

మోదీ పాలమూరుకు రావడం ఇది మూడోసారి. గత పార్లమెంట్‌ ఎన్నికల ప్రచారంలో భాగంగా 2014లో తొలిసారిగా మహబూబ్‌నగర్‌కు వచ్చిన ఆయన.. గత నవంబర్‌లో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం కోసం రెండోసారి వచ్చారు. మరోవైపు టీఆర్‌ఎస్‌ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారంలో భాగంగా సీఎం కేసీఆర్‌ ఈ నెల 31న వనపర్తి, మహబూబ్‌నగర్‌లో నిర్వహించే బహిరంగ సభల్లో పాల్గొననున్నారు. ఈ సభను విజయవంతం చేసేందుకు గులాబీ శ్రేణులు ఇప్పటి నుంచే ప్రయత్నాలు ముమ్మరం చేశాయి.

ఇటు ఏఐసీసీ అధినేత రాహుల్‌ గాంధీ సైతం ఏప్రిల్‌ ఒకటో తేదీన వనపర్తిలో జరిగే బహిరంగ సభలో పాల్గొననున్నారు. స్ధానిక కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్ధి మల్లురవికి మద్దతుగా ప్రచారం నిర్వహిస్తారు. వచ్చే నెల ఏడో తేదీన టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ పాలమూరు లోక్‌సభ పరిధిలోని మహబూబ్‌నగర్, జడ్చర్ల, షాద్‌నగర్‌లలో బహిరంగసభలో పాల్గొంటారు. ఇదిలా ఉంటే.. ఇంకొందరి ముఖ్యనేతల ప్రచారానికి అన్ని పార్టీల్లో కసరత్తు జరుగుతోంది.

వచ్చే నెల 7, 8 తేదీల్లో రాహుల్‌ లేదా ప్రియాంక గాంధీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా, పలువురు కేంద్ర మంత్రుల జిల్లా పర్యటనకు ఆయా పార్టీలు కసరత్తు చేస్తున్నాయి. ముఖ్యంగా పాలమూరు అసెంబ్లీ సెగ్మెంట్‌ను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పార్టీలు ఈ స్థానంలో పాగా వేసేందుకు వ్యూహాలు రచిస్తున్నాయి.

అభ్యర్థుల ఎంపిక మొదలు.. గెలుపు వరకు ఆచితూచి వ్యవహరిస్తున్నాయి. ఇప్పటికే ప్రచారాలతో రాజకీయ వాతావరణాన్ని వేడెక్కించిన అభ్యర్థులు పోటాపోటీగా కార్యకర్తలతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. రానున్న రోజుల్లో రాజకీయం మరింతగా వేడెక్కనుంది.  

ఏ గూటికి ఎవరెవరో? 
ఎన్నికల వేళ మారుతోన్న రాజకీయ సమీకరణాల నేపథ్యంలో ఏ పార్టీలో ఎప్పుడు ఎవరు చేరుతారోననే చర్చ జిల్లాలో హాట్‌టాపిక్‌గా మారింది. ఇప్పటికే వలసల హిట్‌లిస్టులో ఉన్న పాలమూరు సిట్టింగ్‌ ఎంపీ జితేందర్‌రెడ్డి టీఆర్‌ఎస్‌ను వీడి, బుధవారం ఢిల్లీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా సమక్షంలో బీజేపీలో చేరారు. ఈ క్రమంలో ఇంకెంతమంది ఇతర పార్టీల నుంచి బీజేపీ గూటికి చేరుతారోననే ఉత్కంఠ నెలకొంది. అయితే.. మహబూబ్‌నగర్‌ పార్లమెంట్‌ బీజేపీ అభ్యర్థి డీకే అరుణ ముఖ్య అనుచరుడిగా ఉన్న దేవరకద్ర నియోజకవర్గ కాంగ్రెస్‌ ఇన్‌చార్జ్‌ డోకూరు పవన్‌కుమార్‌రెడ్డితో పాటు నారాయణపేటకు చెందిన కాంగ్రెస్‌ నాయకుడు శివకుమార్‌రెడ్డి, అసెంబ్లీ ఎన్నికల్లో షాద్‌నగర్‌ నుంచి బీఎస్పీ అభ్యర్థిగా పోటీ చేసిన వీరపల్లి శంకర్‌ బీజేపీలో చేరుతారనే ప్రచారం జరుగుతోంది.  
  

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top