ఢిల్లీ కోర్టులో ‘నాగం’ బంతి | Some other seniors in congress are against the Nagam Janardhan reddy | Sakshi
Sakshi News home page

ఢిల్లీ కోర్టులో ‘నాగం’ బంతి

Mar 21 2018 2:34 AM | Updated on Mar 18 2019 9:02 PM

Some other seniors in congress are against the Nagam Janardhan reddy - Sakshi

నాగం జనార్దన్‌రెడ్డి , దామోదర్‌రెడ్డి

సాక్షి, నాగర్‌ కర్నూల్‌: ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లా రాజకీయాల్లో ఒకప్పుడు కీలక నేతగా ఉన్న నాగం జనార్దన్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరిక వ్యవహారం ప్రస్తుతం ఢిల్లీకి చేరింది. నాగర్‌ కర్నూల్‌ నియోజకవర్గ రాజకీయాల్లో మళ్లీ చక్రం తిప్పాలన్న భావనతో నాగం కాంగ్రెస్‌ పార్టీలో చేరేందుకు ఒకపక్క రంగం సిద్ధం చేసుకుంటుండగా.. మరోపక్క స్థానికంగా నాగంపై కేడర్‌లో వ్యక్తమవుతున్న వ్యతిరేకతను ఢిల్లీ పెద్దలకు వివరించేందుకు కాంగ్రెస్‌ పార్టీ నాగర్‌కర్నూల్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి, ఎమ్మెల్సీ దామోదర్‌రెడ్డి పావులు కదుపుతున్నారు. నాగం కాంగ్రెస్‌లో చేరేందుకు ఆ పార్టీ సీనియర్‌ నేత, కేంద్ర మాజీ మంత్రి జైపాల్‌రెడ్డి ద్వారా ఢిల్లీలో తీవ్రస్థాయిలో ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగా ఉగాది తర్వాత తాను కాంగ్రెస్‌ పార్టీ తీర్థం పుచ్చుకుంటానని ఆయన ప్రకటించారు. నాగం ప్రధాన ప్రత్యర్థి అయిన ఎమ్మెల్సీ కూచకుళ్ల దామోదర్‌రెడ్డి ఆయన రాకను మొదటి నుంచీ వ్యతిరేకిస్తున్నారు. ఇవేమీ పట్టించుకోని నాగం తన పని తాను చేసుకుంటూ ఢిల్లీలో పావులు కదుపుతున్నారు. పలు మండలాల ముఖ్యులతో ఫోన్‌లో మాట్లాడుతూ తనకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నంలో ఉన్నట్టు తెలుస్తోంది. ఇది తెలుసుకున్న దామోదర్‌ రెడ్డితోపాటు ఎంపీ నంది ఎల్లయ్య కూడా తమ ప్రమేయం లేకుండా కార్యకర్తలతో సంప్రదింపులేం టని మండిపడుతున్నారు. నాగం రాకను మరికొంతమంది సీనియర్లు వ్యతిరేకిస్తున్నట్టు తెలుస్తోంది.  

రాహుల్‌ వ్యాఖ్యలపై ఆశలు 
పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ, వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో యువతకు ప్రాధాన్యమిస్తామని ప్రకటించడం పలువురిలో ఆశలు రేకెత్తిస్తోంది. ఎమ్మెల్సీ దామోదర్‌రెడ్డి తనకు బదులుగా తన కుమారుడు డాక్టర్‌ రాజేశ్‌కు అవకాశం కల్పించాలని కోరుతున్నారు. ఇదే విషయాన్ని ఆయన ఇప్పటికే కాంగ్రెస్‌ అధిష్టానం ముందు ఉంచారు. గత 30 ఏళ్లుగా నాగర్‌ కర్నూల్‌ నియోజకవర్గంలో వరుస పరాజయాలు బాధిస్తున్నా పార్టీని వీడకుండా ప్రతికూల పరిస్థితుల్లోనూ కాంగ్రెస్‌ను పటిష్టం చేస్తూ కార్యకర్తలకు అండగా ఉంటూ వస్తున్నామని దామోదర్‌రెడ్డి చెబుతున్నారు. నాగం కాకుండా యువతకు అవకాశం కల్పిస్తే దగ్గరుండి గెలిపించుకుంటానని కూచకుళ్ల మధ్యేమార్గంగా ప్రచారం చేస్తున్నారు. ఇదే విషయాన్ని ఢిల్లీ పెద్దల ముందు ఉంచడం ద్వారా నాగం జనార్దన్‌రెడ్డికి చెక్‌ పెట్టాలని చూస్తున్నారు. మరోపక్క నాగర్‌ కర్నూల్‌ జిల్లా మహిళా కాంగ్రెస్‌ అధ్యక్షురాలు, స్థానిక జెడ్పీటీసీ సభ్యురాలైన కొండా మణెమ్మ తనకు అవకాశం వస్తుందని ఆశలు పెట్టుకున్నారు.  

ఢిల్లీ నిర్ణయం ఏమిటి?
నాగం జనార్దన్‌రెడ్డి చేరిక వ్యవహారం ఉమ్మడి మహబూబ్‌నగర్‌ కాంగ్రెస్‌లో చర్చనీయాంశంగా మారింది. రాష్ట్ర రాజకీయాల్లో కీలక నేతగా గుర్తింపు పొందిన నాగం అనూహ్యంగా 2014 ఎన్నికల్లో అసెంబ్లీ బరి నుంచి తప్పుకుని పార్లమెంట్‌ బరిలో దిగారు. టీడీపీని వీడి బీజేపీ జెండా ఎత్తుకున్నారు. నాగం అనుకున్న స్థాయి లో బీజేపీ ఉమ్మడి జిల్లాలో ఊపందుకోకపోవడంతో రోజురోజుకు ఆ పార్టీపై పెట్టుకున్న ఆశ లు సన్నగిల్లుతూ వచ్చాయి. దీంతో కాంగ్రెస్‌లో చేరేందుకు నిర్ణయించుకున్నారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. నాగంపై కాంగ్రెస్‌ అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుంటుందన్న అంశం జిల్లా నాయకుల్లో ఉత్కంఠ కలిగిస్తోంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement