పౌరసత్వ బిల్లుపై శివసేన యూటర్న్‌

Shiv Sena U Turn on Citizenship Amendment Bill - Sakshi

న్యూఢిల్లీ : పౌరసత్వ సవరణ బిల్లుకు మద్దతిచ్చే అంశంపై శివసేన యూటర్న్‌ తీసుకుంది. లోక్‌సభలో పౌరసత్వ బిల్లుకు మద్దతు తెలిపిన శివసేన.. ఆ తర్వాత జరిగిన పరిణామాలతో తన వైఖరి మార్చుకుంది. పౌరసత్వ సవరణ బిల్లును కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా బుధవారం రాజ్యసభలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా జరిగిన చర్చలో పాల్గొన్న శివసేన ఎంపీ సంజయ్‌ రౌత్‌.. బీజేపీపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. పౌరసత్వ బిల్లుకు మద్దతు తెలుపని వారిపై దేశద్రోహులనే ముద్ర వేస్తున్నారని మండిపడ్డారు. తమ జాతీయవాదానికి, హిందూత్వ వాదానికి ఎవరి సర్టిఫికేట్‌ అవసరం లేదని అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్‌ షా సామర్థ్యాలపై తమకు నమ్మకం ఉందని చెప్పిన రౌత్‌.. కానీ ఈ బిల్లు పాస్‌ అయ్యాక.. చొరబాటుదారులను నియంత్రిస్తుందా అనే సందేహాన్ని వ్యక్తం చేశారు. ఒకవేళ శరణార్థులను అంగీకరిస్తే.. వారికి ఓటు హక్కు కల్పిస్తారా అని ప్రశ్నించారు. 

కాగా, శివసేన లోక్‌సభలో పౌరసత్వ బిల్లుకు మద్దతు తెలుపడంపై కాంగ్రెస్‌ పార్టీ పరోక్షంగా విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. మహారాష్ట్రలో కాంగ్రెస్‌, ఎన్సీపీలతో కలిసి శివసేన ప్రభుత్వం కొనసాగుతున్న నేపథ్యంలోనే.. ఆ పార్టీ తన వైఖరిని మార్చుకున్నట్టుగా తెలుస్తోంది. అంతకుముందు కాంగ్రెస్‌ నేత బాలాసాహెబ్ తోరట్‌ మాట్లాడుతూ.. శివసేన రాజ్యాంగం ప్రకారం నడుచుకోవాలని అన్నారు. మహారాష్ట్రలో ప్రభుత్వం ఏర్పాటు చేసే సమయంలో శివసేన భాగస్వామ్య పక్షాలైన కాంగ్రెస్‌, ఎన్సీపీలతో కుదిరిన ఒప్పందాన్ని పాటించాలని తెలిపారు.

బుధవారం ఉదయం సంజయ్‌ రౌత్‌ మీడియాతో మాట్లాడుతూ.. సంఖ్య బలం విషయంలో లోక్‌సభతో పోల్చితే రాజ్యసభలో పరిస్థితి వేరుగా ఉందని తెలిపారు. ప్రభుత్వం తమ ప్రశ్నలకు సమాధానం ఇవ్వాల్సి ఉందన్నారు. ఓటు బ్యాంక్‌ రాజకీయాలు మంచివి కావని హితవు పలికారు. మరోసారి హిందూ, ముస్లింలను విభజించే ప్రయత్నం జరుగుతుందన్నారు. తమపై కాంగ్రెస్‌ పార్టీ నుంచి ఒత్తిడి లేదని రౌత్‌ చెప్పారు. తమ మనసులో ఉన్న మాటలనే బయటకు చెపుతున్నామని అన్నారు.

ఓటింగ్‌కు దూరంగా శివసేన!
పౌరసత్వ సవరణ బిల్లుపై రాజ్యసభలో ఓటింగ్‌ జరిగితే శివసేన అందులో పాల్గొనే అవకాశం లేదని ఢిల్లీ వర్గాల నుంచి సమాచారం. శివసేన ఓటింగ్‌కు దూరంగా ఉంటే పరోక్షంగా కేంద్ర ప్రభుత్వానికి మద్దతు తెలిపినట్టేనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top