టీడీపీ ఎఫెక్ట్‌; కాంగ్రెస్‌కు వరుస దెబ్బలు

Setback For Congress In Andhra Pradesh - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలుగు దేశం పార్టీతో దోస్తీ ఆంధ్రప్రదేశ్‌ కాంగ్రెస్‌ పార్టీలో ప్రకంపనలు రేపుతోంది. తమ పార్టీని దుమ్మెత్తిపోసిన టీడీపీతో చేతులు కలపడాన్ని సీనియర్‌ నాయకులు జీర్ణించుకోలేకపోతున్నారు. సాక్షాత్తు సోనియా గాంధీని ‘ఇటలీ దెయ్యం’ అంటూ నోరుపారేసుకున్న చంద్రబాబుతో రాహుల్‌ గాంధీ జట్టు కట్టడాన్ని కాంగ్రెస్‌లో చాలా మంది నాయకులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. సోనియాను అవినీతి అనకొండ అంటూ దుయ్యబట్టిన చంద్రబాబుతో స్నేహం మంచిది కాదని వాదిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో ఓడిపోతామన్న భయంతోనే ‘చేయి’ చాశారని చెబుతున్నారు.  

రాజీనామాల పరంపర
టీడీపీతో చేతులు కలపడాన్ని వ్యతిరేకిస్తూ కాంగ్రెస్‌ నాయకులు పార్టీని వీడుతున్నారు. మాజీ మంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత వట్టి వసంతకుమార్‌ గురువారం రాజీనామా ప్రకటించారు. నాలుగున్నరేళ్లుగా చంద్రబాబు ప్రభుత్వ అవినీతి, అక్రమాలపై పోరాటాలు చేశామని.. అలాంటి నాయకుడితో కలిసి పనిచేయడం ఇష్టంలేకే కాంగ్రెస్‌ పార్టీని వీడుతున్నట్టు ఆయన తెలిపారు. మరో సీనియర్‌ నేత మాజీ మంత్రి సి రామచంద్రయ్య తాజాగా కాంగ్రెస్‌ పార్టీని వీడారు. ఈ విషయాన్ని మీడియా ద్వారా ఆయన ప్రకటించారు. మరికొంత మంది సీనియర్‌ నాయకులు కూడా కాంగ్రెస్‌ను వీడే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది.

ముందే తెలిసి వెళ్లిపోయారు!
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ మాజీ స్పీకర్‌ నాదండ్ల మనోహర్‌ ఇటీవల కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేసి జనసేన పార్టీలో చేరారు. టీడీపీతో కాంగ్రెస్‌ కలుస్తుందన్న విషయం ముందే తెలుసుకుని ఆయన వెళ్లిపోయినట్టు ప్రచారం జరుగుతోంది. దశాబ్దాలుగా తమ పార్టీకి బద్ధ శత్రువుగా ఉన్న ‘సైకిల్‌’ పార్టీతో జట్టు కట్టడాన్ని ఆత్మహత్యాసదృశ్యంగా కాంగ్రెస్‌ నేతలు వర్ణిస్తున్నారు. (మాజీ మంత్రి వట్టి కాంగ్రెస్‌కు గుడ్‌బై)

తొందరపడొద్దు: రఘువీరా
సీనియర్‌ నాయకులు పార్టీని వీడుతుండటంతో పీసీసీ అధ్యక్షుడు ఎన్‌. రఘువీరారెడ్డి స్పందించారు. తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దని, కాంగ్రెస్‌ మంచి భవిష్యత్తు ఉందని చెప్పారు. పార్టీలో భిన్న అభిప్రాయాలు సహజమన్నారు. పొత్తులపై నిర్ణయాధికారాన్ని తమ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీకి కట్టబెట్టిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. రాహుల్‌ గాంధీ నిర్ణయమే తమకు శిరోధార్యమని స్పష్టం చేశారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top