
సాక్షి, గాంధీనగర్ : ఓ పక్క తొలిదశ పోలింగ్ జరుగుతుండగానే రెండో దశ ఎన్నికల ప్రచారంలో ప్రధాని నరేంద్రమోదీ మునిగిపోయారు. తనను నీచమైన వ్యక్తి అంటూ కాంగ్రెస్ పార్టీ నేత మణిశంకర్ చేసిన వ్యాఖ్యలను పదే పదే ప్రజలకు గుర్తు చేస్తూ ప్రచార అస్త్రంగా ఉపయోగించుకుంటున్నారు. అంతేకాకుండా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీకి కీలక అనుచరుడైన సల్మాన్ నిజామీ చేసిన వ్యాఖ్యలను మరో ప్రచార అస్త్రంగా ఉపయోగిస్తున్నారు. సల్మాన్ తన తల్లిదండ్రులు ఎవరని ప్రశ్నిస్తున్నారని, అసలు అలాంటి భాష ఉపయోగించవచ్చా అని మోదీ ప్రశ్నించారు.
'నా తండ్రి, తల్లి ఎవరని కాంగ్రెస్ పార్టీ నన్ను ప్రశ్నిస్తోంది. నా సోదరీసోదరులారా మిమ్మల్ని ఒకటే అడుగుతున్నాను.. అలాంటి భాషను మనం శత్రువుల విషయంలోనైనా ఉపయోగిస్తామా? కానీ, ఒక బాధ్యతగల కాంగ్రెస్ పార్టీ నేత నన్ను ఇలా అడిగారు. రాహుల్‌గాంధీ పార్టీ నా తల్లిదండ్రులెవరని ప్రశ్నిస్తోంది. ఈ దేశ ప్రజలే నాతల్లిదండ్రులు. నేను ఈ భూమిపుత్రుడిని.. ఈ లునావాడ బిడ్డను. భాష విషయంలో, పనుల విషయంలో మాటల విషయంలో కాంగ్రెస్ పార్టీ సిగ్గును వదిలేసింది. ఆ పార్టీ ఓటమి అంచుల్లో ఉంది. ఎన్నో అబద్ధాలు ప్రచారం చేస్తుంది. అలా అబద్ధాలు చెప్పడం కూడా నేరమే. సామాన్య ప్రజలకోసం పనిచేసేది మన ప్రభుత్వమే' అని మోదీ చెప్పారు.