చంద్రబాబు మాటల్లో నిస్పృహ

Sajjala ramakrishna reddy Rubbishes Chandrababu Remarks  - Sakshi

ప్రజలందరూ ఓటు హక్కును వినియోగించుకోండి..

సాక్షి, హైదరాబాద్‌ : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అత్యంత అన్యాయంగా ప్రవర్తిస్తున్నారని వైఎస్సార​ కాంగ్రెస​ పార్టీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. ఆయన బుధవారం పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఈసారి ఎన్నికల్లో చంద్రబాబు పప్పులు ఉడకలేదని అన్నారు. ప్రజలు మార్పు కోరుతున్నారని పోలింగ్‌ సరళిని బట్టి అర్థమవుతోందని, ఉదయం ఆరు గంటల నుంచే ప్రజలు క్యూలైన్‌లో నిలబడ్డారన్నారు. ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని సజ్జల కోరారు. ప్రజాస్వామ్య సంప్రదాయాలకు వైఎస్సార​ కాంగ్రెస​ పార్టీ కట్టుబడి ఉందన్నారు. 

విశ్వసనీయతే వైఎస్సార​ కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన లక్ష్యమన్నారు. శాంతియుతంగా ఎన్నికలు జరగాలనేదే తమ అభిప్రాయం అన్నారు. రాష్ట్రంలో మంచి పాలన అందివ్వడంలో చంద్రబాబు విఫలం అయ్యారని సజ్జల విమర్శించారు. సైకిల్‌ గుర్తుపై నొక్కితే ఫ్యాన్‌కు ఓట్లు వెళ్తున్నాయని చంద్రబాబు ఆరోపణలు చేయడం హాస్యాస్పదమన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబుకు తాను ఓ సలహా ఇస్తున్నానన్ని...ఈవిఎంలలో ఈ విధంగా జరుగుతున్నాయి కాబట్టి చంద్రబాబు ఫ్యాన్‌ గుర్తుకు ఓటేయమని చెప్పాలని, అప్పుడు అవన్నీ సైకిల్‌కు పడతాయి అని సజ్జల పేర్కొన్నారు.

అయిదేళ్ల సమయాన్ని చంద్రబాబు దుర్వినియోగం చేశారని మండిపడ్డారు. మంచి పనులు చేసి ప్రజలను ఓటు అడగాల్సిన పని చంద్రబాబు చేయలేదన్నారు. ప్రజల పాలన పక్కనబెట్టి ప్రతిపక్షాలను బలహీనపర్చడంలో దృష్టి సారించారన్నారు. చంద్రబాబు పప్పులు ఈసారి ఉడకలేదన్నారు. నిన్నటి నుంచి చంద్రబాబు నిస్పృహ కనిపిస్తోందన్నారు. నిన్న ఈసీ వద్ద చంద్రబాబు పెద్ద డ్రామా చేశారని సజ్జల మండిపడ్డారు. 2009లో చంద్రబాబు ఫిర్యాదు చేసి డీజీపీని మార్చారని, అర్థరాత్రి ఈసీ వద్దకు వెళ్లి ధర్నాలు చేశారనే విషయాన్ని గుర్తు చేశారు. చంద్రబాబు అధికార దుర్వినియోగం చేశారని ఆయన అన్నారు. ధర్నాల ద్వారా సింపతీ పొందాలని చంద్రబాబు యత్నిస్తున్నారని, ఓటమి తప్పదని ఆయనకు స్పష్టంగా కనిపిస్తోందన్నారు.

ఓటమి సాకు కోసం చంద్రబాబు వెతుకుతున్నారని, ఎన్నికల ప్రక్రియను దెబ్బతీసేలా ప్రయత్నిస్తున్నారని సజ్జల రామకృష్ణారెడ్డి ధ్వజమెత్తారు. ప్రజల్లో చైతన్యం వచ్చిందని, మార్పు కోరినట్లు కనిపించిందని....చంద్రబాబు ట్రిక్కులు వీటిని ఆపలేవన్నారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసింది చంద్రబాబు, కోడెల శివప్రసాదరావు అని అన్నారు. పార్టీలో ఫిరాయింపులను చంద్రబాబు ప్రోత్సహిస్తే...వాటికి సహకరించింది కోడెల అని దుయ్యబట్టారు. ఇక పోలింగ్‌ బూత్‌లో కోడెల తనంతట తానే చొక్కా చించుకుని, డ్రామా క్రియేట్‌ చేశారన్నారు. ఇక ఫోన్‌ ట్యాపింగ్‌ చేసే ఏబీ వెంకటేశ్వరరావు ...చంద్రబాబుకు సలహాదారు అని, ఆయన సలహాదారులంతా హ్యాకర్స్‌, మోసగాళ్ళేనని సజ్జల విమర్శించారు. దాడులు ఎక్కడ జరిగినా దానికి ప్రధాన కారణం టీడీపీ నేతలేనని అన్నారు. తమది శాంతిని కోరుకునే పార్టీ అని.. పోలింగ్‌ ప్రశాంతంగా జరగాలన్నదే తమ అభిమతమన్నారు. అందుకే వైఎస్సార​ కాంగ్రెస​ పార్టీ సంయమనంతో వ్యవహరిస్తోందని తెలిపారు. 

ఈవీఎంలు పనిచేయని చోట సమయాన్ని పొడిగించాలని సజ్జల ఈ సందర్భంగా ఈసీని కోరారు. పోలింగ్‌కు ఆటంకం కలిగించేందుకు చంద్రబాబు యత్నిస్తున్నారన్నారు. పశ్చిమ గోదావరి, చిత్తూరు జిల్లాలను లక్ష్యంగా చేసుకున్నారని, రీ పోలింగ్‌ జరపాలని కుట్రకు యత్నించే అవకాశం ఉందన్నారు. ఈ విషయంలో పోలీస్‌ వ్యవస్థ నిష్పక్షపాతంగా వ్యవహరించాలని సజ్జల కోరారు. కొంతమంది పోలీస్‌ అధికారులు తప్ప అందరూ  అదే విధంగా ఉన్నారన్నారు. ఏబీ వెంకటేశ్వరరావు ఇంకా సీఎం వెంటే తిరుగుతున్నారని అన్నారు. వచ్చేది మంచి ప్రభుత్వం అని... పోలీసులు ఎవరి ఒత్తిళ్లకు లొంగవద్దని సజ్జల సూచించారు. 

చంద్రబాబులా తాము వ్యవహరించబోమని, కాబట్టి ప్రజలు స్వేచ్చగా ఓటుహక్కు వినియోగించుకునేలా వ్యవహరించాలన్నారు. వైఎస్సార్ సీపీ ప్రతిపక్షంలో ఉందని, అధికార పక్షం తమపై ఆరోపణలు చేయడం ఏంటని సూటిగా ప్రశ్నించారు. కేఏ పాల్‌లాంటి వారిని అడ్డుపెట్టుకుని హెలికాప్టర్‌ రెక్కలు గుర్తు తెచ్చారన్నారు. దీనివల్ల నాలుగు ఓట్లు చీలతాయని చంద్రబాబు చంద్రబాబు భావించారన్నారు.  మన అభివృద్ధికి దోహదం చేసే రాజకీయ పార్టీని ఎంపిక చేసుకుని ఓటు వేయడం అనేది బాధ్యతే కాకుండా హక్కు అని, పౌరులందరూ తమ ఓటు హక్కును ఉపయోగించుకోవాలన్నారు. ఇంకా ఎవరైనా పోలింగ్‌ బూత్‌కు వెళ్లకపోతే వారికి వైఎస్సార్ సీపీ తరపున, పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ తరఫున వెళ్లి ఓటు వేయాలని సజ్జల రామకృష్ణారెడ్డి విజ్ఞప్తి చేశారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top