ఉప ఎన్నికల్లో ఆర్జేడీ హవా

RJD Won 2 Seats And BJP Retains Bhabua Seat - Sakshi

సాక్షి, పాట్నా: బిహార్ ఉప ఎన్నికల్లో లాలూ ప్రసాద్ యాదవ్ పార్టీ రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్జేడీ) హవా కొనసాగింది. ఓ లోక్‌సభ స్థానాన్ని, ఓ అసెంబ్లీ సీటును ఆర్జేడీ కైవసం చేసుకోగా, మరో అసెంబ్లీ స్థానాన్ని బీజేపీ తిరిగి సొంతం చేసుకుంది. అరారియా లోక్‌సభ స్థానంలో బీజేపీ ప్రత్యర్థి ప్రదీప్ కుమార్ సింగ్‌పై 61 వేల పైచిలుకు ఓట్ల భారీ ఆధిక్యంతో ఆర్జేడీ అభ్యర్థి సర్ఫరాజ్ అలం గెలుపొందారు. సర్ఫరాజ్‌కు 5,09,334 ఓట్లు రాగా, బీజేపీ అభ్యర్థి ప్రదీప్ కుమార్‌కు 4,47,346 ఓట్లు పోలయ్యాయి. ఆర్జేడీ ఎంపీ మహమ్మద్ తస్లిముద్దీన్ మృతితో ఈ అరారియాకకు ఉప ఎన్నిక జరుగగా.. తస్లిముద్దీన్ తనయుడు అలాంను ఆర్జేడీ బరిలోకి దింపింది. తండ్రి తర్వాత ఆయన తనయుడే అరారియాలో (ఆర్జేడీ) ఘనవిజయం సాధించింది.

జహనాబాద్‌ అసెంబ్లీ స్థానాన్ని ఆర్జేడీ గెలుచుకుంది. ఆర్జేడీ అభ్యర్థి కృష్ణమోహన్ యాదవ్‌ ఇక్కడ విజయం సాధించారు. సమీప ప్రత్యర్ధి, జేడీయూకు చెందిన అభిరామ్ శర్మపై 35,000 ఓట్ల మెజార్టీతో కృష్ణమోహన్ గెలుపొందారు. ఈ రెండు స్థానాల్లో ఆర్జేడీ విజయం సాధించడంతో ఆ పార్టీ కార్యకర్తలు బాణాసంచా కాల్చి, స్వీట్లు పంచి సంబరాలు చేసుకుంటున్నారు. మహాకూటమి నుంచి జేడీయూ వైదొలిగిన తర్వాత జరిగిన ఈ ఉప ఎన్నిక ఆ పార్టీ చీఫ్, సీఎం నితీశ్ కుమార్‌కు పరీక్షగా నిలిచాయి.

బీజేపీకి స్వల్ప ఊరట
కాగా, ఉప ఎన్నికల్లో ఓ అసెంబ్లీ స్థానాన్ని నెగ్గిన బీజేపీకి స్వల్ప ఊరట లభించింది. భబువా అసెంబ్లీ నియోజకవర్గాన్ని మళ్లీ బీజేపీ సొంతం చేసుకుంది. తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ అభ్యర్థి శంభు పటేల్‌పై 11 వేల పైచిలకు ఓట్ల మెజార్టీతో బీజేపీ నాయకురాలు రింకీ రాణి పాండే విజయం సాధించారు. ఇటీవల రింకీ భర్త ఆనంద్ భూషణ్ పాండే మృతితో ఖాళీ అయిన భబువాకు ఉప ఎన్నిక జరిగింది. ఆనంద్ భూషణ్ భార్య రింకీని బరిలో నిలపగా సానుభూతి ఓట్లు పడ్డాయి. దీంతో కనీసం ఈ ఒక్క స్థానాన్నైనా బీజేపీ సొంతం చేసుకోగలిగిందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top