
సాక్షి, న్యూఢిల్లీ : రాజ్యసభ (ఎగువసభ) డిప్యూటీ చైర్మన్ పీజే కురియన్ పదవీ కాలం నేటితో ముగుస్తుంది. ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆయనకు వీడ్కోలు విందు ఏర్పాటు చేశారు. ఈ వీడ్కోలు సమావేశానికి రాజ్యసభలోని వివిధ పార్టీలకు చెందిన నేతలను వెంకయ్యనాయుడు ఆహ్వానించారు. ఆదివారం సాయంత్రం వెంకయ్య నాయుడి నివాసంలో ప్రారంభమైన ఈ సమావేశానికి వైఎస్సార్ సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి, వివిధ పక్షాల నేతలు హాజరయ్యారు.
మరోవైపు కొత్త డిప్యూటీ చైర్మన్ ఎంపిక కోసం అధికార బీజేపీ కసరత్తు మొదలు పెట్టింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాత్రం రాజ్యసభ చైర్మన్ ఎన్నికను ఏకగ్రీవం చేయడానికే మొగ్గుచూపుతున్నట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. కాంగ్రేసేతర పార్టీలకు ఎగువ సభ చైర్మన్‌గా అవకాశం ఇవ్వాలని మోదీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో జనతాదళ్, తృణమూల్ కాంగ్రెస్ పార్టీలతో బీజేపీ నేతలు చర్చలు జరుపుతున్నారు.