రాహుల్‌ గాంధీ రాస్తా ఎటు?

 Rahul Gandhi Should Announce The Strategy To Face BJP In Next Elections - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: రాహుల్‌ గాంధీ నాయకత్వంలోని కాంగ్రెస్‌ పార్టీ ప్రస్తుత రాజకీయ సిద్ధాంతం ఏమిటీ? దృక్పథం ఏమిటీ? 2019లో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో ఆచరణీయ వ్యూహం ఏమిటీ? ఎలా గెలవాలనుకుంటోంది? ఇలాంటి ప్రశ్నలకు సంబంధించి రాహుల్‌ గాంధీని ఎప్పుడు కదిపినా, ఎవరు కదిపినా ‘బీజేపీని ఓడించడమే మా లక్ష్యం’ అని చెబుతున్నారు.

ఎలా ఓడిస్తారన్న ప్రశ్నకు ఆయన దగ్గర నుంచి సరైన సమాధానం రావడం లేదు. ఎన్నికల్లో అన్ని భావసారూప్యత పార్టీలను, అన్ని ప్రాంతీయ పార్టీలను కలుపుకొని పోతామని చెబుతున్నారు తప్పా, అది కూడా ఎలా ? అన్న ప్రశ్నకు సరైన సమాధానం లేదు.ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలో బలంగా ఉన్న సమాజ్‌వాది పార్టీ, బహుజన సమాజ్‌ పార్టీలు మధ్యప్రదేశ్‌ లాంటి రాష్ట్రాల్లో కాంగ్రెస్‌తో కలిసి పోటీ చేసేందుకు సుముఖంగా ఉన్నాయిగానీ, స్వరాష్ట్రంలో పాగా వేసేందుకు కాంగ్రెస్‌ పార్టీకి అవకాశం ఇచ్చేందుకు సిద్ధంగా లేవు.

ఇక పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రంలో మమతా బెనర్జీ, తెలంగాణలో కేసీఆర్‌ బీజేపీ యేతర ఫ్రంట్‌ నాయకత్వాన్ని కాంగ్రెస్‌ పార్టీకి ఇవ్వడానికి ససేమిరా ఒప్పుకునే పరిస్థితుల్లో లేరు. ఇక ఢిల్లీలో బీజేపీకి వ్యతిరేకంగా ఆప్‌ పార్టీతో చేతులు కలిపేందుకు కాంగ్రెస్‌ పార్టీయే సుముఖంగా లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఏ రాజకీయ దృక్పథం ప్రాతిపదికన, ఏ వ్యూహం ప్రకారం రానున్న సార్వత్రిక ఎన్నికలను రాహుల్‌ గాంధీ ఎదుర్కోవాలనుకుంటున్నారో అర్థం కావడం లేదు.

ప్రధాన రాజకీయ పార్టీ బీజేపీకిగాని, ప్రాంతీయ పార్టీలకుగానీ తమకంటూ ఓ ప్రత్యేక రాజకీయ సిద్ధాంతం అంటూ ఉంది. బీజేపీకి హిందూత్వ ఎజెండా ఉండగా, ప్రాంతీయ పార్టీలకు ఆయా ప్రాంతాల సామాజిక వర్గాల సంక్షేమం కోసం కషి చేయడమన్న రాజకీయ సిద్ధాంతాలు ఉన్నాయి. ఒకప్పుడు కాంగ్రెస్‌ పార్టీకి గాంధీ సిద్ధాంతం, ఆ తర్వాత విస్తృతార్థంలో లౌకిక సిద్ధాంతం అంటూ ఉండేది. లౌకిక సిద్ధాంతం ప్రాతిపదికన సమాజంలోని అన్ని వర్గాల ప్రజల్లోకి దూసుకెళ్లి పునాదులు వేసుకొంది. ఆ పునాదులన్నీ ఇప్పుడు పూడుకుపోయాయి.

ఒకప్పుడు ప్రతి సమాజిక వర్గంలో కాంగ్రెస్‌కు మద్దతిచ్చే వారు అంతో ఇంతో ఉండేవారు. అనేక ప్రాంతాల్లో పార్టీ ప్రాభవం తగ్గుతూ వచ్చినప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లో, ముఖ్యంగా పేదల్లో, నిరక్ష్యరాసుల్లో ఆదరణ ఉండేది. దాదాపు అన్ని వర్గాల వారికి పార్టీ దూరం అవుతూ వచ్చింది. అగ్రవర్ణాల వారు, ఇతర వెనకబడిన వర్గాల వారు బీజేపీ వెంట వెళ్లారు. దళితులు, బీసీలు, ఇతర వెనకబడిన వర్గాల వారు ప్రాంతీయ పార్టీల దరి చేరారు. మైనారీటీలు కూడా సొంత పార్టీలవైపే మొగ్గు చూపుతున్నారు.

ఇలాంటి పరిస్థితుల్లోనే గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల్లో అగ్రవర్ణమైన పటేళ్లతోపాటు దళితులను, ఇతర వెనకబడిన వర్గాల ప్రజలను కలుపుకుపోయేందుకు కాంగ్రెస్‌ పార్టీ కషి చేసి కొంత మేరకే విజయం సాధించింది. కర్ణాటకలో మాజీ కాంగ్రెస్‌ ముఖ్యమంత్రి సిద్ధ రామయ్య ‘అహిందా’ దక్పథంతో దళితులు, వెనకబడిన వర్గాల వారిని, మైనారిటీలను కలుపుకుని పోయేందుకు ప్రయత్నించారు. అందులో ఆయన విజయం కూడా అసంపూర్ణమే.

రానున్న సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ విజయం సాధించాలంటే ఇష్టమున్నా, లేకున్నా అన్ని పార్టీలను రాహుల్‌ గాంధీ కలుపుకుపోవాలి. మతతత్వ బీజేపీని ఓడించడమే తమ లక్ష్యమంటే సరిపోదు, అధికారంలోకి వస్తే ఏం చేస్తారో చెప్పాలి! అన్ని వర్గాల ప్రజలకు సామాజిక న్యాయం చేస్తాం, మైనారిటీలపై దాడులు నివారిస్తాం, మహిళలకు సాధికారిత కల్పిస్తాం....లాంటి నినాదాలు తీర్మానాలకే పరిమితం అవుతున్నాయి. సమావేశ మందిరాలను దాటి అవి బయటకు రావడం లేదు.

నేటి బీజేపీ పాలనలో రాజ్యాంగ ఉల్లంఘనలు జరుగుతున్నాయి, కవులు, కళాకారులు, మైనారిటీలపై దాడులు జరుగుతున్నాయి. భావ ప్రకటన స్వాతంత్రం కనుమరుగవుతోంది. కుహనా జాతీయ వాదం కదంతొక్కుతోంది. వీటన్నింటిని పటిష్టంగా ఎదుర్కొంటూ, పార్టీ అంతర్గత కుమ్ములాటలకు స్వస్తి చెప్పాలి. రాజ్యాంగ రక్షణకు కట్టుబడి, అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతికి పునరంకితమవుతూ చిత్తశుద్ధితో ప్రజల్లోకి వచ్చినప్పుడే రాహుల్‌ నాయకత్వంలో కూడా కాంగ్రెస్‌ పార్టీని ప్రజలు ఆహ్వానిస్తారు, పట్టం కడతారు!

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top