డోనాల్డ్ ట్రంప్ ట్వీట్.. రాహుల్ సెటైర్లు!

Rahul Gandhi criticises pm modi for Trump tweet on pakistan - Sakshi

న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోదీని లక్ష్యంగా చేసుకుని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ విమర్శల దాడికి దిగారు. భారత్, అమెరికా సంబంధాలు బలపడటం దేవుడెరుగును కానీ అంతకంటే ఎక్కువగా పాకిస్తాన్‌తో సత్సంబంధాల కోసం ఆ దేశ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఎదురుచూస్తున్నారని రాహుల్ మండిపడ్డారు. ఈ నేపథ్యంలో ఆయన చేసిన ట్వీట్ కలకలం రేపింది. 'మోదీజీ తొందరపడండి, డోనాల్డ్ ట్రంప్ మీ కౌగిలి కోసం ఎదురుచూస్తున్నారంటూ' రాహుల్ ట్వీట్ చేశారు. గతంలో ప్రధాని మోదీ అమెరికా పర్యటన నేపథ్యంలో.. పాక్ ఉగ్రవాదులకు చోటిస్తుందని, ఇకనైనా ఆ చర్యలు మానుకోవాలంటూ హెచ్చరించిన ట్రంప్ కొన్ని రోజుల్లోనే మాట మార్చడం రాహుల్‌కు విసుగు తెప్పించినట్లు తెలుస్తోంది. దీంతో మోదీజీ త్వరపడండి.. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మీ కౌగిలింత కోసం ఎదురుచూస్తున్నారంటూ సోషల్ మీడియా ద్వారా రాహుల్ గాంధీ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

అసలు విషయం ఏంటంటే.. ఇటీవల పాకిస్తాన్ సైన్యం హక్కానీ ఉగ్రవాద సంస్థ చెర నుంచి అమెరికా-కెనెడియన్‌ కుటుంబాన్ని విడిపించింది. దీనిపై ట్రంప్ స్పందిస్తూ.. గత కొన్నేళ్లుగా పాక్ నుంచి అమెరికా లబ్ధి పొందిందన్నారు. పాకిస్తాన్‌తో చాలా అంశాల్లో సంబంధాలను మెరుగు పరుచుకోవాల్సి ఉందని ట్రంప్ వ్యాఖ్యానిస్తూ ట్వీట్ చేశారు. మరోవైపు ఈ అక్టోబర్ చివరి వారంలో అమెరికా ప్రతినిధి రెక్స్ టిల్లర్‌సన్, భారత్‌లో పర్యటించి దేశ నేతలతో చర్చించనున్న తరుణంలో ట్రంప్, పాక్‌కు మద్ధతిస్తూ ట్వీట్ చేయడం చర్చనీయాంశమైంది. గతంలో మోదీ అమెరికా పర్యటన నేపథ్యంలో ట్రంప్‌ను ఆత్మీయంగా కౌగిలించుకోవడం అప్పట్లో హాట్‌ టాపిక్ అయిన సంగతి తెలిసిందే.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top