మోదీ ముఖం మాడింది

Rahul Gandhi campaign in Tikamgarh district - Sakshi

ఓడిపోతామని ఎన్నికలు సగం పూర్తయ్యేసరికి ఆయనకు అర్థమైంది: రాహుల్‌ విమర్శలు 

పతారియా/జటారా: సార్వత్రిక ఎన్నికలు సగం పూర్తయ్యే సరికే ప్రధాని మోదీకి ఓడిపోతున్నామనే విషయం అర్థమైందని, దీంతో మోదీ ముఖం మాడిపోయిందని కాంగ్రెస్‌ చీఫ్‌ రాహుల్‌ అన్నారు. ప్రధాని మోదీ నివాసం ఉండే ఇంటి ముందు నిల్చుని చౌకీదార్‌ అని ఎవరైనా అరిస్తే.. ఆ ఇంటికి కాపలా ఉండే సీఆర్పీఎఫ్, బీఎస్‌ఎఫ్‌ సిబ్బంది సైతం చోర్‌ అంటూ అరుస్తారని రాహుల్‌ వ్యాఖ్యానించారు. గత ఐదేళ్లలో 15 మంది బడా వ్యక్తులకు చెందిన రూ.5.55 లక్షల కోట్ల రుణాన్ని మోదీ మాఫీ చేసిన విషయం దేశం మొత్తానికి తెలుసని విమర్శించారు. మంగళవారం మధ్యప్రదేశ్‌లోని దామో జిల్లా, బుందేల్‌ఖండ్‌ ప్రాంతంలోని తికమ్‌గఢ్‌ జిల్లాలో రాహుల్‌ గాంధీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మధ్యప్రదేశ్‌లో శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ సీఎంగా ఉన్నపుడు బుందేల్‌ఖండ్‌ అభివృద్ధి కోసం అప్పటి యూపీఏ ప్రభుత్వం రూ.3,800 కోట్ల ప్యాకేజీ ఇచ్చిందని, అయినా అభివృద్ధి జరగలేదన్నారు. 

ఏడాదిలో 22 లక్షల ఉద్యోగాలు.. 
అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే యువత కోసం ఖాళీగా ఉన్న 22 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్లు జారీ చేస్తామని తెలిపారు. భయం, ఆందోళనలో మోదీ ఏదేదో మాట్లాడుతున్నారని అన్నారు. కొత్తగా వ్యాపారం ప్రారంభించే యువతకు మొదటి మూడేళ్లు ఎటువంటి అనుమతులు తీసుకోనవసరం లేకుండా చేస్తామని వెల్లడించారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top